- లేదంటే కోర్టు ధిక్కరణ కేసు వేస్తాం..!
– తహసీల్దార్ కార్యాలయం ముందు ఉద్రిక్తత
– పునరావాసం కల్పించాలని నిమ్జ్ భూ బాధితులు, ఉపాధి కూలీలు డిమాండ్ - – లేదంటే భూములను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక
- నవతెలంగాణ – ఝరాసంగం
- నిమ్జ్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు, రైతు కూలీలకు పునరావాసం కల్పించాలని, పునరావాసం కల్పించేంతవరకు రైతుల భూములలో ఎలాంటి పనులు చేపట్టవద్దని అధికారులు మొండిగా ఒకవేళ పనులను చేపట్టినా తమ భూములను తాము స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వానికి హెచ్చరించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలి నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు రైతులు, రైతు కూలీలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు బి రామచందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రైతులకు పునరావాసం కల్పించాలని ఇచ్చిన ఆదేశాలు, జీవో నెం. 38, స్టే ఆర్డర్ నెం. 677లను అధికారులు ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు.
- నిమ్జ్ పరిసర ప్రాంతాలైన ఎల్గోయి, బర్దిపూర్, చిలేపల్లి తదితర గ్రామాలకు చెందిన భూ బాధితులు, ఉపాధి కూలీలకు పునరావాసం కల్పించకుండా ఆ భూములలో పనులను ఎలా చేపడతారని అధికారులను ప్రశ్నించారు. రెవెన్యూ, నిమ్జ్ అధికారులు రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ భూముల్లో పనులు చేపట్టడం సరైన విధానం కాదని అన్నారు. రైతులపై అకారణంగా కేసులు నమోదు చేసి బైండోవర్ చేయడం కూడా తగదని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వం చెల్లించే ధరలకు తహసిల్దార్, ఆర్డీవో, ఎమ్మెల్యే భూములు వదులు కొంటారా అని ప్రశ్నించారు. రైతుల హక్కుల కోసం ఎక్కడికైనా సిద్ధమని, రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపవమని హెచ్చరించారు. రెండో విడతలో ఎల్గోయి గ్రామంలో వేసిన 195 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
తహసీల్దార్ కార్యాలయం ముందు భూ బాధితులు, ఉపాధి కూలీలు భారీ సంఖ్యలో చేరుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో ఉప తహసీల్దార్ రాజు గౌడ్ కు హైకోర్టు ఆదేశాల ప్రతులతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. వెంటనే హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల యొక్క సమస్యలను పరిష్కరించేందుకే తాము ఉన్నామని కానీ మాకంటూ పరిమితులు ఉంటాయని, పరిమితులకు లోబడి తాము విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, జిల్లా కలెక్టర్కు రైతుల సమస్యలను విన్నవిస్తామని ఉప తాసిల్దార్ రాజు గౌడ్ హామీ రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చంద్రన్న, రైతు సంఘం నాయకులు శంకర్,గోపాల్,బాలప్ప,సంజీవులు, అంజన్న,నర్సింలు,శివన్న,సంగన్న,అంజాధ్, ఖైరాత్ అలీ తో పాటు వివిధ గ్రామాలకు చెందిన ఉపాధి కూలీలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




