– మార్చి నాటికి 1,050 కొత్త బస్సులు
– టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)లో రూ.400 కోట్ల వ్యయంతో 1,050 కొత్త డీజిల్ బస్సుల్ని ప్రవేశపెట్టనున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. వీటిలో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరీ స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు ఉన్నాయని వివరించారు. వాటితో పాటు హైదరాబాద్ నగరంలో 540, జిల్లాలకు 500 ఎలక్ట్రిక్ బస్సులను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ‘మహాలక్ష్మి’ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకంలో భాగంగా రద్దీ పెరిగిందనీ, కొత్త బస్సుల రాకతో దాన్ని నియంత్రించగలుగుతామని అభిప్రాయపడ్డారు. దీనిలో భాగంగానే శనివారం ఉదయం 10 గంటలకు 80 డీజిల్ కొత్త బస్సుల్ని ప్రవేశపెడుతున్నామనీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నెక్లెస్‌రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వీటిని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ బస్సుల్లో 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరీ స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులు ఉన్నాయని వివరించారు.