Wednesday, August 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‘ఆయుష్’లో నిరవధిక సమ్మె

‘ఆయుష్’లో నిరవధిక సమ్మె

- Advertisement -

నవతెలంగాణ-ఉప్పల్
​స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాలలు, అనుబంధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు మంగళవారం నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. అందులో భాగంగా తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్–పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జేఏసీ ఆధ్వర్యంలో మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా రామంతపూర్‌లోని జేఎస్‌పీఎస్ ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. “స్టైఫండ్ పెంచాలి”, “వివక్ష వీడాలి”, “న్యాయం చేయాలి” అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు డాక్టర్ నితిన్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులకు చెల్లిస్తున్న స్టైఫండ్ దేశంలోనే అత్యల్పంగా ఉందని ఆరోపించారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో సగం కంటే తక్కువ స్టైఫండ్ ఇస్తున్నారని తెలిపారు. జీవన వ్యయం పెరిగినా పదేండ్లుగా స్టైఫండ్‌లో ఎలాంటి పెంపూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2016 వరకు అల్లోపతి, ఆయుష్ విద్యార్థులకు సమానంగా స్టైఫండ్ ఉండేదని, అనంతరం అల్లోపతి విద్యార్థుల స్టైఫండ్‌ను పెంచుతూ వచ్చి, ఆయుష్ విద్యార్థులను మాత్రం విస్మరించారని అన్నారు. అల్లోపతి విద్యార్థులతో సమానంగా తమకూ స్టైఫండ్ ఇవ్వాలని, డిమాండ్లు నెరవేరే వరకు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. డాక్టర్ శ్రవణ్ రెడ్డి, డాక్టర్ సాయి చరణ్, డాక్టర్ శ్రవణ్, డాక్టర్ నవనీత్, డాక్టర్ మంజూషా తదితరులు పాల్గొన్నారు.

​​రోగుల మద్దతు
ఆయుష్ వైద్యుల డిమాండ్లు న్యాయమైనవేనని ఈ సందర్భంగా రోగులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని, సమ్మె కారణంగా వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -