Wednesday, August 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిమ్జ్‌లో పునరావాసం కల్పించే వరకు పనులు నిలిపివేయాలి

నిమ్జ్‌లో పునరావాసం కల్పించే వరకు పనులు నిలిపివేయాలి

- Advertisement -

కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే పోరాటం ఉధృతం : వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బి.రాంచందర్
ఝరాసంగంలో నిర్వాసితుల ర్యాలీ, ధర్నా
నవతెలంగాణ-ఝరాసంగం

నిమ్జ్ ప్రాజెక్టు ప్రభావిత వ్యవసాయ కూలీలకు పునరావాసం, పునర్‌ ‌నిర్మాణం, జీవనోపాధి హక్కులు కల్పించకుండా నిమ్జ్‌లో ఎలాంటి పనులు కొనసాగించరాదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బి.రాంచందర్ డిమాండ్ చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల ప్రధాన కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిమ్జ్ ప్రాజెక్టు భూ బాధితులు, ఉపాధి కూలీలు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు, రైతు కూలీలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక ఎస్‌ఐ నారాయణ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని, 2016లో జారీ చేసిన నిషేధాజ్ఞలను కచ్చితంగా అమలు చేయాలని కోరుతూ వ్యవసాయ కార్మికులు డిప్యూటీ తహసీల్దార్ రాజు గౌడ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాంచందర్ మాట్లాడుతూ.. నిమ్జ్ ప్రాజెక్టు కారణంగా జీవనోపాధి కోల్పోయిన వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులు, భూమిలేని నిరుపేద కుటుంబాలను ఇప్పటి వరకు గుర్తించకపోవడం, సర్వే నిర్వహించకపోవడం అన్యాయమన్నారు. గ్రామసభలు నిర్వహించకపోవడం, పునరావాస ప్యాకేజీలపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా పూర్తిగా భూసేకరణ చేయడం అనేది.. న్యాయమైన పరిహారం, పారదర్శకత, పునరావాసం, పునర్నిర్మాణ హక్కుల చట్టం-2013తో పాటు జీవో ‌నంబర్‌ 38 నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. చట్ట ప్రకారం పునరావాసం పూర్తికాకముందే రైతులను సాగు చేయకుండా అడ్డుకోవడం, భూములకు కంచెలు వేయడం, తవ్వకాలు, రోడ్ల నిర్మాణం వంటి చర్యలు చేపట్టడం పూర్తిగా చట్టవిరుద్ధమన్నారు. అంతేకాకుండా హైకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ప్రాజెక్టు ప్రభావిత నిర్వాసితులకు చట్టబద్ధమైన పునరావాసం కల్పించే వరకు నిమ్జ్‌లో జరుగుతున్న అన్ని పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఉత్తర్వులు, కేంద్ర భూసేకరణ చట్టం-2013, జీవో నెం.38 నిబంధనలను తక్షణమే అమలు చేసి ప్రభావిత కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా బలవంతపు చర్యలు కొనసాగిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంతే కాకుండా రెండో విడతలో భూసేకరణ నిమిత్తం 195 ఎకరాలకు జారీ చేసిన నోటిఫికేషన్ ను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. రైతుల నుంచి వినతిపత్రం అందుకున్న డిప్యూటీ తహసీల్దార్ రాజు గౌడ్ స్పదిస్తూ రైతుల సమస్యలను పరిష్కరించేందుకే ఉన్నామన్నారు. తమకు ఉన్న పరిమితులకు లోబడి సాధ్యమైనంతవరకు రైతులకు, రైతు కూలీలకు న్యాయం చేసే విధంగా జిల్లా కలెక్టర్‌కు నివేదికలు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఎం.శంకర్, ప్రధాన కార్యదర్శి చంద్రన్న, ఉపాధ్యక్షులు బాలప్ప, జయమ్మ, గోపాల్, అంజన్న, అంజాధ్, ఖైరాత్ అలీ, శివన్న, నర్సమ్మ, మొనప్ప, అనిషమ్మ, బాగమ్మ, వ్యవసాయ కూలీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -