సీఎస్ కు యూఎస్పీసీ నోటీస్ అందజేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళన చేపడుతున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసీ) తెలిపింది. ఈ మేరకు మంగళవారం యుఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును కలిసి నోటీసును అందజేశారు. పాఠశాలలకు ఉచిత విద్యుత్తు, పారిశుధ్య నిర్వహణకు నిధులు మంజూరు చేస్తామన్న హామీని నిలబెట్టుకున్నందుకు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, నియామకాలు చేపట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పట్ల అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని తెలిపారు. దీంతో పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో వారు విశ్వాసం కలిగించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ఉపాధ్యాయుల్లో అశాంతి, అసంతృప్తి తీవ్రమవుతున్నాయని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలలు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను మరోసారి ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికే దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. ఈనెల 7న పాఠశాలల ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరనస తెలపడం మొదలు 29న హైదరాబాద్ లో మహా ధర్నా వరకు వివిధ దశల్లో ఆందోళనా కార్యక్రమాలు కొనసాగిస్తామని వివరించారు. ఈ నేపథ్యంలో తక్షణమే సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని వారు సీఎస్ ను కోరారు.
సమస్యల పరిష్కారం కోసం ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



