Thursday, August 6, 2026
E-PAPER
Homeజాతీయంఅణచివేయడం 
కాదు..యువత 
చెప్పేది వినండి

అణచివేయడం 
కాదు..యువత 
చెప్పేది వినండి

- Advertisement -

జెన్‌ ‌జీ నిరసనలపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : నీట్‌ యూజీ పేపర్‌‌ లీక్‌‌ నేపథ్యంలో ఆందోళనల్లో పాల్గొంటున్న విద్యార్ధులు, యువత చెప్పేది ముందుగా వినాలనీ, వారిని అణచివేసే చర్యలు చేపట్టరాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వారిపై దూకుడుగా ప్రవర్తించడం కన్నా ఇది మంచి మార్గమని పేర్కొంది. ‘‘వారికి నచ్చచెప్పడం, శాంతింపజేయడం అన్నింటికంటే మంచి మార్గం…తార్కికంగా ఆలోచించడమనేది అన్నింటికంటే శక్తివంతమైన మార్గం. ముందుగా వారు చెబుతున్నది వినండి, అప్పడు దాన్ని ఎలా ఎదుర్కొవాలో ప్రభుత్వానికి తెలుస్తుంది.’’ అని చీఫ్‌ జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌పేర్కొన్నారు. రిటైర్డ్‌ ఎయిర్‌ ‌ఫోర్స్‌ ఆఫీసర్‌ ‌మనీష్‌ ‌కుమార్‌ ‌సోలంకి దాఖలు చేసిన పిటిషన్‌‌ను కోర్టు విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. సీజేపీ నిర్వాహకులు చెబుతున్నది వినడానికి, వారు చెప్పేది చేయడానికి అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పిటిషనర్‌ ‌పేర్కొన్నారు. ‘‘ జులై 20న పోలీసుల చర్యలు జరిగి 15 రోజులు గడిచింది. కానీ ఇంతవరకు నిర్వాహకులను జవాబుదారీ చేస్తూ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. కనీసం సీజేపీ రిజిస్టర్‌ అయిన సంస్థ కూడా కాదని పిటిషనర్‌ ‌వాదించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ముఖ్యమేనని, ప్రభుత్వం ఇలా వెనుకడుగు వేసినట్లైతే, సమాజం, న్యాయ సంస్థలు కూడా వెనుకడుగు వేసినట్టు కనిపించరాదని పిటిషనర్‌ ‌తరపు న్యాయవాది రిజ్వాన్‌ అహ్మద్‌ ‌పేర్కొన్నారు. దేశం, సమాజం ఎందుకు ప్రమాదకరమైన ధోరణిని సహించాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం వెనుకంజ వేసిన కారణంగా రాళ్ళు విసిరిన వారిని వదిలివేయడానికి అనుమతించరాదని ఆయన పేర్కొన్నారు.

రేపు ఆల్ఫా, బీటా, గామా తరాల వారు కూడా రావచ్చు, రైతులు ట్రాక్లర్లతో పార్లమెంట్‌‌కు వస్తారు.’’ అంటూ అహ్మద్‌ ‌వాదించారు. దీనిపై చీఫ్‌ ‌జస్టిస్‌ ‌స్పందిస్తూ, సయోధ్య, కౌన్సెలింగ్‌, శాంతి అవసరమని వ్యాఖ్యానించారు. ‘‘యువతను శాంతింపజేయాల్సిన అవసరముంది. వారిలో కొందరు రాళ్ళు విసిరి ఉండవచ్చు. కానీ వారికి సలహాలు, సూచనలు, నచ్చచెప్పడాలు చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ తరుణంలో ఎలాంటి దూకుడు చర్యలు తీసుకున్నా పరిస్థితి మరింత పెచ్చరిల్లడం తప్ప మరేమీ ఉండదు. తద్వారా మరిన్ని ఉల్లంఘనలకు వారు పాల్పడేందుకు దారి తీస్తుంది. దాన్నంతటినీ నివారించాల్సి ఉంది.’’ అని చీఫ్‌ ‌జస్టిస్‌ ‌పేర్కొన్నారు. యువతరంతో వ్యవహరించేటపుడు బల ప్రయోగానికి దిగడం కన్నా లా ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌ ‌సంస్థలు సంయమనం పాటించడం మెరుగైన వ్యవహారమని అన్నారు. శాంతియుతంగా సాగుతున్న ఆందోళన హింసాత్మకంగా మారవచ్చు, పరిస్థితులు అదుపు తప్పకుండా చూసుకోవాల్సింది ప్రభుత్వమేనని అన్నారు. ‘‘ప్రజాస్వామ్య ఉద్యమంలో శాంతియుత లక్ష్యాలతోనే ప్రారంభమైనా కొన్ని సంఘటనలు చోటు చేసుకోవచ్చు, అయినా పరిస్థితి చేజారకుండా ఉండాలంటే సంయమనంతో వ్యవహరించక తప్పదు’’ అని చీఫ్‌ ‌జస్టిస్‌ ‌స్పష్టం చేశారు. నీట్‌ ‌నిరసనలపై దాఖలైన పిటిషన్లతో పాటూ విచారించేందుకు ఈ పిటిషన్‌‌ను కూడా వాటితో కలిపారు. ఆ పిటిషన్లపై 18వ తేదీన విచారణ జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -