Friday, August 7, 2026
E-PAPER
Homeజాతీయంవాటాల విక్రయంలో గోప్యత

వాటాల విక్రయంలో గోప్యత

- Advertisement -

ఎల్‌ఐసీ షేర్ల డిజిన్వెస్ట్‌మెంట్‌‌లో పారదర్శకతకు పాతర..!
ప్రయివేటు శక్తులకు 6.5 శాతం వాటాలు
కేంద్ర ఖజానాకు రూ.31,500 కోట్లు
ఆర్థిక విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్న త్రీవ అనుమానాలు

న్యూఢిల్లీ : దేశీయ జీవిత బీమా రంగానికి మూలస్తంభంగా ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) వాటాల విక్రయాల్లో మోడీ సర్కార్‌ ‌పారదర్శకతకు పాతర వేసిందని స్పష్టమవుతోంది. ప్రభుత్వ రంగ ఈ బీమా కంపెనీలో 6.5 శాతం విలువ చేసే వాటాలను మార్కెట్‌ ‌శక్తులకు ఉన్నపలంగా అమ్మేసింది. పెట్టుబడిదారులకు 10 శాతం పైగా డిస్కౌంట్‌‌తో చౌకగా అమ్మేశారు. ఆగస్టు 3న ఎల్‌ఐసి షేర్‌ ‌ధర రూ.424.40 వద్ద ముగిసింది. కాగా ఓఎఫ్‌ఎస్‌‌లో ఆగస్టు 4 నుంచి ఒక్కో షేర్‌ ధరను 11.10 శాతం తక్కువతో రూ.382గా దీపమ్‌ ‌నిర్ణయించింది. దీంతో పెట్టుబడిదారులకు చౌకగా వాటాలు లభించినట్లయ్యింది. బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం.. ఈ లావాదేవీ సమయాన్ని అత్యంత రహస్యంగా ఉంచిన దీపమ్‌ అధికారులు, కొంతమంది ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లకు కూడా చివరి నిమిషంలోనే సమాచారం అందించారు. ఒక బ్యాంకర్‌ను కారణం చెప్పకుండా ఢిల్లీలోని దీపమ్‌ కార్యాలయానికి పిలిపించి అక్కడికి వెళ్లిన తర్వాతే అదే సాయంత్రం ఎల్‌ఐసీ వాటాల విక్రయం ప్రారంభమవుతుందని తెలియజేసి స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ సిద్ధం చేయాలని ఆదేశించింది. ప్రభుత్వంలోని చిన్న కోర్ టీంకు మాత్రమే ముందుగా పూర్తి సమాచారం ఉండగా.. మిగిలిన సలహాదారు లకు మార్కెట్ ముగిసిన తర్వాత వివరాలు అందించారు. ఈ వాటాల విక్రయ ప్రక్రియ, ధర నిర్ణయంలో అనుసరించిన గోప్యతపై ఆర్థిక విశ్లేషకుల నుంచి తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి.

విమర్శల వెల్లువ
ఈ వాటాల ఉపసంహరణ బాధ్యతను పర్యవేక్షిస్తున్న దీపమ్‌ వ్యవహారశైలి ఇప్పుడు విమర్శలకు కేంద్రబిందువుగా మారింది. వాటాల అమ్మకం నిర్ణయంలో తగిన పారదర్శకత పాటించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎల్‌ఐసి షేరు ఫ్లోర్ ప్రైస్‌ను మార్కెట్ ధర కంటే రెండంకెల డిస్కౌంట్‌‌తో రూ.382గా నిర్ణయించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతు న్నాయి. మొదట 2.5 శాతం వాటాలను మాత్రమే విక్రయానికి ఉంచిన ప్రభుత్వం, సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి భారీ డిమాండ్ రావడంతో గ్రీన్‌షూ ఆప్షన్ ద్వారా అదనంగా 4 శాతం వాటాలను విక్రయించి మొత్తం 6.5 శాతం వాటాలను అమ్మేసింది. తొలుత రెండు రోజులు అనుకున్న ఒఎఫ్‌ఎస్‌‌ను మరో రోజు పొడిగించి అనుహ్యంగా వాటాలను విక్రయించడం గమనార్హం.

ప్రయివేటు శక్తులకు పెద్దపీట
ఈ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కేంద్రం 2.5 శాతం బేస్ వాటాతో పాటు అదనంగా 4 శాతం గ్రీన్ షూ ఆప్షన్ కింద మొత్తం 82.22 కోట్లకు పైగా షేర్లను విక్రయించింది. ఫలితంగా 6.5 శాతం వాటాలు ప్రయివేటు సంస్థలు, ఇన్వెస్టర్ల చేతుల్లోకి వెళ్లాయి. సంస్థలో ఇప్పటి వరకు 96.5 శాతంగా ఉన్న ప్రభుత్వ వాటా ఈ విక్రయంతో 90 శాతానికి పడిపోయింది. సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్ షేర్ హోల్డింగ్‌ను పెంచడానికే ఈ విక్రయం అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఇంత వేగవంతమైన ప్రక్రియ వెనుక ప్రయివేటు శక్తులకు ప్రయోజనం చేకూర్చే ధోరణి ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కోట్లాది మంది సామాన్య పాలసీదారుల నమ్మకానికి ప్రతీకగా ఉన్న ఎల్‌ఐసి ఆస్తుల విక్రయ వ్యవహారంలో పారదర్శకత లేకపోవడం ఆర్థిక వర్గాల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది.

రికార్డు స్థాయిలో ఉపసంహరణ..
ఎల్‌ఐసిలో 6.5 శాతం వాటాలను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించిన కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.31,552 కోట్లను తన ఖాజానాలో వేసుకుంది. మూడు రోజుల పాటు సాగిన ఈ ఒఎఫ్‌ఎస్‌లో గ్రీన్ షూ ఆప్షన్‌తో కలిపి మొత్తం 82.22 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. ఊహించిన దానికంటే ఎక్కువగా 113.16 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. దీంతో మొత్తం ఆఫర్ 1.38 రెట్లు స్పందన వచ్చింది. ఇందులో సంస్థాగత పెట్టుబడిదారులకు కేటాయించిన 74 కోట్ల షేర్లకు. గాను 107.4 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలు చేయడంతో 1.45 రెట్లు సబ్‌స్క్రిప్షన్ నమోదయ్యింది. రిటైల్ విభాగంలో కేటాయించిన 8.22 కోట్ల షేర్లకు గాను 5.76 కోట్ల షేర్లకు బిడ్లు రాగా, ఇది 0.7 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌గా నమోదయ్యింది.

​అమ్మకానికి మరో 15 శాతం వాటాలు..!
ఎల్‌ఐసీలో 10 శాతం వాటాల విక్రయాన్ని 2027 మే 16 కల్లా పూర్తి చేయాలని సెబీ గడువు విధించగా.. దాని కంటే ముందే విక్రయించడం గమనార్హం. తొలుత 2022 మే నెలలో 3.5 శాతం వాటాలను విక్రయించి ఎల్‌ఐసిని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసిన ప్రభుత్వం.. ఆ సమయంలో రూ.20,516 కోట్లు తన ఖాజానాలో వేసుకుంది. భవిష్యత్తులో సెబీ నిబంధనల ప్రకారం కనీస పబ్లిక్ వాటా 25 శాతానికి చేర్చేలా దశలవారీగా వాటాలను విక్రయించే యోచనలో ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా మరో 15 శాతం వాటాలను ఎప్పడైనా విక్రయించే అవకాశాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా మొత్తం రూ.80,000 కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా సేకరించిన మొత్తం నిధులు రూ.52,700 కోట్లకు చేరాయి. ఆర్థిక సంవత్సరం 2018-19 తర్వాత పబ్లిక్ సెక్టార్ సంస్థల వాటాలను విక్రయించడం ఇదే తొలిసారి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -