బీసీలను మభ్యపెడుతున్న కాంగ్రెస్, బీజేపీ
బీసీ బిల్లుకు చట్టబద్ధత వచ్చే వరకు
పల్లె నుంచి ఢిల్లీ దాకా పోరాటం: టీఆర్‌ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ – దిల్ సుఖ్ నగర్
సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ బస్తీల్లో కుస్తీ.. ఢిల్లీ గల్లీల్లో దోస్తీ చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో గురువారం టీఆర్‌ఎస్ (తెలంగాణ రక్షణ సేన) ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. బీసీ రిజర్వేషన్లపై క్రెడిట్ కొడదామనుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా పార్లమెంట్‌లో చట్టం చేయించొచ్చని, అలా చేయకుండా బీసీలను మభ్యపెడుతున్నారని అన్నారు. తెలంగాణలో బీసీల జనాభా 60 శాతానికి పైగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికే పరిమితం చేయడం ఎందుకని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించకుండా అన్ని పార్టీల అగ్రవర్ణ నాయకులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నట్టే బీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లు చట్టబద్ధత వచ్చే వరకు తెలంగాణ రక్షణ సేన పల్లె నుంచి పట్టణం దాకా, హైదరాబాద్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరుబాట పడుతుందని స్పష్టం చేశారు.
సామాజిక తెలంగాణ కోసం రాజకీయాలకతీతంగా బీసీలకు బేషరతుగా అందరూ మద్దతు తెలపాలన్నారు. సామాజిక ఉద్యమాలకు నాంది పలికిన సాహుల్ మహారాజు, సిద్ధార్థుడు, మహాత్మ జ్యోతిబా ఫూలే, అంబేద్కర్ తదితరుల ఆశయాల సాధన కోసం టీఆర్‌ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పారు. అగ్ర కులాలే కాదు అణగారిన తరగతుల్లోనూ అధిక సంపన్నులు ఉన్నారని, అయితే అటువంటి వారితో ఆయా తరగతులకు కూడా న్యాయం జరగడం లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో కొంతమంది సంపన్నులున్నా 90 శాతం మంది పేదరికం అనుభవిస్తున్నారని తెలిపారు. మైనారిటీలు, క్రైస్తవులకు హక్కులు, సంక్షేమం కోసం పాలకులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణ సేన సభ విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందని ఎల్‌బీనగర్ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన నాయకులు దూగుంట్ల నరేష్, కె. నవీన్ గౌడ్, రాంకోటి తెలిపారు.



