Friday, August 7, 2026
E-PAPER
Homeజాతీయంక్యా బోల్తీ పబ్లిక్?

క్యా బోల్తీ పబ్లిక్?

- Advertisement -

నిరుద్యోగం, విద్యా సంస్కరణలపై కాక్రోచ్‌ దేశవ్యాప్త ప్రచారం
సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా పర్యట‌న‌ ప్ర‌క‌టించిన సీజేపీ
వ్య‌వస్థాప‌కుడు అభిజీత్ దీప్కే దేశ‌వ్యాప్త స‌భ్య‌త్వ న‌మోదు
క్యూఆర్ స్కాన‌ర్ విడుద‌ల‌

​నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశవ్యాప్తంగా ‘క్యా బోల్తీ పబ్లిక్’ (ప్రజలు ఏమంటున్నారు) పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు. సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా పర్యటించి ప్రతి ఒక్కరితోనూ మమేకమవుతామని అన్నారు. సీజేపీ ఒక రాజకీయ పార్టీగా మారకుండా ఒక ఒత్తిడి బృందంగానే కొనసాగుతుందని దీప్కే ప్రకటించారు. మహారాష్ట్రలో నిర్వహించిన పార్టీ ప్రధాన బృంద సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో అభిజీత్ దీప్కే మాట్లాడారు. గ‌త నెల న్యూఢిల్లీ జంతర్ మంత‌ర్‌లో జ‌రిగిన సీజేపీ ఆధ్వ‌ర్యంలోని జెన్ జీ ఉద్య‌మానికి యువ‌త ముఖచిత్రంగా నిలిచిందనీ, ఆ ఉద్య‌మం ఫ‌లితంగా అప్ప‌టి విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేశార‌ని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశం లేదని, ప్రజల తరపున ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే ఒత్తిడి సంస్థ‌గా పనిచేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ‘క్యా బోల్తీ పబ్లిక్’ కార్య‌క్ర‌మంతో ముఖ్యంగా యువ‌త ఆశ‌యాలు, అంచ‌నాలు, ఆందోళ‌న‌ల‌ను అర్థం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. దేశ యువత‌ను నిర్ల‌క్ష్యం చేశార‌ని, దేశ జ‌నాభాలో దాదాపు 65 శాతం మంది యువ‌తేన‌ని, అయినా వారి స‌మ‌స్య‌ల‌కు ప్ర‌ధాన రాజ‌కీయ చ‌ర్చ‌ల్లో చోటు ద‌క్క‌లేద‌ని అన్నారు. ప్ర‌భుత్వం వారి స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదని, ఈ అంశాల‌పై మాట్లాడేం దుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్తామ‌నీ, వారి అంచ‌నాల‌ను తెలుసుకుంటామ‌ని, వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను వింటామ‌ని అన్నారు.

​ఉద్యమాన్ని మరింత విస్తరిస్తాం
దేశ యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, ప్రయివేటు విద్యాసంస్థల అధిక ఫీజులు, ప్రభుత్వ పాఠశాలల నాణ్యత, ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల్లో తగ్గుతున్న విశ్వాసం వంటి అంశాలపై ఉద్యమాన్ని మరింత విస్తరించనున్నట్టు తెలిపారు. ‘‘విద్య ఖర్చు గణనీయంగా పెరిగింది. ఒక‌టో త‌ర‌గ‌తికే ఫీజులు రూ.ల‌క్ష నుంచి రూ.రెండు ల‌క్ష‌ల వ‌ర‌కు చెల్లించాల్సి వ‌స్తోంది. కొన్ని పాఠ‌శాల‌ల్లో ఫీజులు ఇంకా ఎక్కువే ఉంటున్నాయి. విద్యార్థులు అధిక ట్యూషన్ ఫీజులను ఎదుర్కొంటున్నారు. కుటుంబాలు భారీగా విద్యా వ్యయాన్ని భరించాల్సి వస్తోంది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాలు భారీ మొత్తాన్ని ఎలా భ‌రిస్తాయి? ఈ ఖ‌ర్చుల వ‌ల్ల ప్ర‌జ‌లు అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. ఆ భారం త‌గ్గాల‌ని సీజేపీ కోరుకుంటోంది. విద్య ప్రాథ‌మిక హ‌క్కు అని, గ‌త కొన్నేండ్లుగా అది ఒక వ్యాపారంగా మారిపోయింది. మన దేశంలో ఉద్యోగాలు దాదాపు లేవు. జంతర్ మంత‌ర్‌కు వ‌చ్చిన వారిలో చాలా మంది నిరుద్యోగులే. బ‌లవంతం వ‌ల్ల డెలివ‌రీ ఎగ్జిక్యూటివ్‌గా, లేదా డెలివ‌రీ బాయ్‌గా మారాల‌ని ఎవ‌రి క‌లా, ఆశ‌య‌మూ ఉండ‌దు’’ అని అన్నారు. డిగ్రీలు సంపాదించినా పెద్ద సంఖ్యలో చదువుకున్న యువత నిరుద్యోగులుగానే ఉన్నారని దీప్కే తెలిపారు. డిగ్రీ సంపాదించిన తరువాత కూడా దేశ యువతలో దాదాపు 80 శాతం మంది నిరుద్యోగులు గానే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చదువు పూర్తి చేయని వారు, డిగ్రీలు లేనివారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, వారు చదువుకున్న యువత భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు.

నిరంతరం ప్రజల ఒత్తిడి అవసరం
సీజేపీకి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు విద్య‌, ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన అంశాల‌కే ప‌రిమితం కాలేద‌ని, ప్ర‌జాస్వామ్య సంస్థ‌ల ప‌నితీరుపై నెల‌కొన్న విస్తృత అంసతృప్తిని ఇది ప్ర‌తిబింబిస్తోంద‌ని అన్నారు. రాజ‌కీయ సంస్థ‌లు, న్యాయ వ్య‌వ‌స్థ‌, మీడియా, ఎన్నిక‌ల సంఘంపై ప్ర‌జ‌లు విశ్వాసం కోల్పోతున్నార‌ని చెప్పారు. ఈ సంస్థ‌ల్లో జ‌వాబుదారీత‌నం, నిష్ప‌క్ష‌పాతాన్ని మెరుగుప‌ర‌చ‌డా నికి నిరంత‌రం ప్ర‌జ‌ల ఒత్తిడి అవ‌స‌ర‌మ‌ని అన్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తి, పరిష్కారాల కోసం అధికారులపై ఒత్తిడి తీసుకురాగ‌ల దేశ‌వ్యాప్త ఉద్య‌మాన్ని నిర్మించ‌డమే త‌మ త‌క్ష‌ణ ప్రాధాన్య‌త అని స్ప‌ష్టం చేశారు. ‘‘ఈ రోజు మన దేశంలో సంస్థాగత జవాబుదారీతనం ప్రమాదకర స్థితిలో ఉంది. ఇది మన ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదకర సంకేతం. గతంలో ఓటర్లు ప్రభుత్వాన్ని ఎన్నుకునేవారు. ఈ రోజు ఎవరు ఓటు వేయాలో ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. ప్రజాస్వామ్యం ఇలా పనిచేయదు. మనం ఎన్నికల సంఘం జవాబుదారీతనాన్ని సరిదిద్దాలి. మనం ఇది చేసేంత వరకు దేశంలో ఎన్నికల అవకతవకలు కొనసాగుతాయి’’ అని దీప్కే సూచించారు.

నిరుద్యోగం దేశంలో ఒక ప్రధాన సమస్య అని, దీనిని దేశవ్యాప్త సమస్యగా పరిగణిస్తామని తెలిపారు. ‘‘ఇప్పుడు నిరుద్యోగాన్ని జాతీయ అంశంగా మార్చాలనుకుంటున్నాం. ప్రభుత్వంగా మీరు నిరుద్యోగ సంక్షోభాన్ని ఇక నిర్ల‌క్ష్యం చేయ‌లేరు’’ అని ఆయన అన్నారు. బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, నెహ్రూ ఆదర్శాలే సీజేపీకి మార్గదర్శకాలని చెప్పారు. ‘‘మా సిద్ధాంతం రాజ్యాంగ విలువలపై ఆధారపడి ఉంటుంది. మేము లౌకికవాదులం. ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తాం. మేము ప్రజాస్వామ్యవాదులం. సామాజిక న్యాయం దిశగా పని చేస్తూనే ఉంటాం’’ అని అన్నారు. ఇటీవలి రాజకీయ మార్పులకు విద్యార్థులే కారణమని దీప్కే తెలిపారు. దేశం ఏండ్ల పాటు అణచివేత, నిరంకుశ పాలనను చూసిందని అన్నారు. రాజ‌కీయ పార్టీల ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని, ప్ర‌జ‌లు ఉదయం ఒక పార్టీకి ఓటేస్తే, సాయంత్రంక‌ల్లా మ‌రో పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తోంద‌ని ఎద్దేవా చేశారు.

పెద్ద ఎత్తున పాల్గొనండి
‘క్యా బోల్తీ పబ్లిక్’ ప్రచార కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌నుకునేవారు అధికారిక క్యూఆర్ కోడ్‌ల‌ను స్కాన్ చేయాల‌ని సూచించారు. ఆ క్యూఆర్ కోడ్‌ల‌ను మీడియా స‌మావేశంలో ప్ర‌ద‌ర్శించారు. స‌భ్య‌త్వం పూర్తిగా ఉచిత‌మ‌ని, మోస‌పూరిత చెల్లింపు అభ్య‌ర్థ‌న‌ల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -