Friday, August 7, 2026
E-PAPER
Homeజాతీయంగోబర్ధన్ బయోఎనర్జీ పథకం

గోబర్ధన్ బయోఎనర్జీ పథకం

- Advertisement -

రూ.23,731 కోట్లతో అమలు
సీబీజీ ఉత్పత్తిని పది రెట్లు పెంచే లక్ష్యం
అసోంలో నాలుగు లేన్ల నేషనల్‌ ‌హైవే

కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
‘గోబర్ధన్’ జాతీయ సర్క్యులర్ బయోఎనర్జీ పథకానికి కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివ‌ర్గ సమావేశం జరిగింది. అనంత‌రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ కేంద్ర మంత్రివ‌ర్గ నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించారు. రూ.23,731 కోట్ల ‘గోబర్ధన్’ జాతీయ సర్క్యులర్ బయోఎనర్జీ పథకానికి మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2035-36 వరకు కేంద్రం అమలు చేయనుంది. వ్యవసాయ అవశేషాలు, పశువుల పేడ, సేంద్రీయ వ్యర్థాలతో కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ఉత్పత్తి చేయనుంది. దేశీయ సీబీజీ ఉత్పత్తిని దాదాపు పది రెట్లు పెంచడమే లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు. దిగుమతి సహజవాయువుపై ఆధారాన్ని తగ్గించి ఇంధన భద్రతకు బలం చేకూర్చిందని వెల్లడించారు. రైతులు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, సహకార సంఘాలకు కొత్త ఆదాయ అవకాశాలు వస్తాయని వివరించారు. సీబీజీ ఉత్పత్తిదారులకు స్థిరమైన మార్కెట్ కల్పించేందుకు ప్రత్యేక కొనుగోలు విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. అలాగే సీబీజీకి ప్రతి ఎంఎంబీటీయూకు రూ.2,110 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది.

దీనివల్ల ఉత్పత్తిదారులకు దీర్ఘకాలిక ఆదాయ భరోసా లభించనుంది. కొత్తగా ఏర్పాటు చేసే సీబీజీ ప్లాంట్లకు రోజుకు ఒక టన్ను ఉత్పత్తి సామర్థ్యానికి గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు మూలధన సాయం అందించనున్నారు. ఇప్పటికే ఉన్న ప్లాంట్ల విస్తరణకు కూడా ఈ సాయం వర్తిస్తుంది. ముడి పదార్థాల సేకరణ, సేంద్రియ ఎరువుల తయారీ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధికి కూడా ప్రోత్సాహం లభించనుంది. సీబీజీ ప్లాంట్లను గ్యాస్ పైప్‌లైన్లతో అనుసంధానించేందుకు అవసరమైన మౌలిక వసతులకు మద్దతు ఇవ్వనున్నారు. ఎంఎస్‌ఎంఈ ఆధారిత ప్రాజెక్టులకు రుణ హామీ పథకం కూడా అమలు చేయనున్నారు. దీంతో పెట్టుబడులు పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని కేంద్రం భావిస్తోంది. ఇటు అసోంలో నాలుగు లేన్ల నేషనల్ హైవేకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. రూ.8,970 కోట్లతో అసోంలో నేషనల్ హైవే నిర్మించాలని మంత్రివ‌ర్గం ఆమోదించింద‌ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -