119 నియోజకవర్గాల్లో 1.05 కోట్ల కొత్త కార్డుల పంపిణీకి ఏర్పాట్లు
లామినేషన్‌తో తెల్ల రేషన్‌కార్డులు
కొత్త కుటుంబాల్లో సరికొత్త ఆశలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ర్ట ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పేదల కోసం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. అది కూడా ఒకేసారి దాదాపు 1.05 కోట్ల కార్డులు ఇవ్వాలని భావిస్తున్నారు. గడచిన పదేండ్లలో కొత్త రేషన్‌కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలో దాదాపు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటికి ఇప్పుడు ఇవ్వనున్న 1.05 కోట్ల కొత్త కార్డులు అదనం. రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడపాదడపా 19 లక్షల వరకు కొత్త తెల్లకార్డులు ఇచ్చింది. కొందరికి ఇచ్చి, మరికొందరికి ఇవ్వకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతూ వస్తున్నది. దీన్ని గమనించిన సీఎం రేవంత్‌రెడ్డి అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.
ఇవీ అర్హతలు
తెల్ల రేషన్‌కార్డుకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు ఖరారు చేసింది. వీటి ప్రకారం అర్హులను గుర్తిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షల లోపు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లించే వారు అనర్హులు. కొత్తగా ఇచ్చే తెల్ల రేషన్‌కార్డుల్ని లామినేషన్ చేసి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్డుల ద్వారా ప్రభుత్వ సబ్సిడీలతోపాటు ఉచిత బియ్యం కూడా లభిస్తుంది. రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ సహా అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరి అయ్యింది. అలాగే ఆరోగ్య శ్రీ వైద్యసేవలకు కూడా తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరి. రాష్ర్ట ప్రభుత్వం ఇటీవలే ఆరోగ్య శ్రీ వైద్యసేవల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్‌కార్డునే ప్రామాణికంగా గుర్తిస్తున్నారు.
సుదీర్ఘ నిరీక్షణ
ముఖ్యంగా తల్లిదండ్రుల రేషన్‌కార్డులో పేర్లు ఉన్న ఎంతో మంది యువతీయువకులు పెళ్లిళ్లు చేసుకున్నారు. వారంతా ఆయా కుటుంబాలతో వేరపడ్డారు. చిన్న కుటుంబాలకు కొత్త రేషన్‌కార్డులు కావాలని అభిలషిస్తున్నారు. పెండ్లిండ్లు చేసుకొని అత్తగారింటికి వెళ్లిన ఆడపిల్లల పేర్లు ఇప్పటికీ పుట్టింటి రేషన్కార్డుల్లోనే ఉన్నాయి. పేర్ల మార్పు, చేర్పులకు సవాలక్ష నిబంధనలు అడ్డుగా ఉండటంతో అందరికీ ఇబ్బందిగానే ఉంది. రేషన్కార్డులోంచి ఎవరిపేరన్నా తొలగిస్తే, మొత్తానికే కార్డు పోతుందనే భయంతో మరికొందరు అలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయం కొత్త కుటుంబాలకు భరోసాను ఇస్తున్నది.
గ్రామీణంలో..
గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని కూలీలు, పట్టణాల్లో అద్దె ఇళ్లలో నివసించే కుటుంబాలు, కొత్తగా విడిపోయిన కుటుంబాలు, కొత్త పెళ్లిళ్లు జరిగిన జంటలు, ఇప్పటివరకు కార్డు లేని నిరుపేదలు కొత్త కార్డుల కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. అలాంటి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద ఊరటనిస్తోంది. వారికి రేషన్‌దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇస్తున్నారు.
15న సంగారెడ్డిలో ప్రారంభించనున్న సీఎం
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కొత్తరేషన్కార్డుల్ని అందచేస్తున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం తెలిపారు. ఆగస్టు 15న ఈ కార్యక్రమాన్ని సీఎం ఏ రేవంత్‌రెడ్డి సంగారెడ్డిలో లాంఛనంగా ప్రారంభిస్తారని వివరించారు. ఆ వెంటనే అన్ని నియోజకవర్గాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) సమన్వయంతో జిల్లాల యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న వారికి కొత్త కార్డులు ఇవ్వడంతో పాటు కొత్త దరఖాస్తుల్ని కూడా స్వీకరిస్తామని చెప్పారు. లబ్ధిదారుల జాబితాల
ఖరారు నుంచి కార్డుల ముద్రణ,
రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలు, మీడియా ప్రచారం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారుల్ని ఆదేశించారు. కొత్త రేషన్‌కార్డులపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు ఓ
ప్రకటనలో తెలిపారు.



