ప్రజా పోరాటాల ముందు ఎంతటి వారైనా మెడలు వంచాల్సిందే
క్విట్ ఇండియా డేలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్
క్విట్ ఇండియా స్ఫూర్తితో ముందుకు సాగాలి : మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
క్విట్ ఇండియా గొప్పతనాన్న జెన్‌జీ తరం తెలుసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో జెన్‌జీ తరం చేపట్టిన ఉద్యమం స్ఫూర్తి దాయకమని కొనియాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పోరాటాల ముందు ఎంతటి వారైనా మెడలు వంచక తప్పదని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వా మ్యాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరింత అంకితభావంతో పనిచేయాలని పిలుపు నిచ్చారు. స్వాతంత్ర్యం కోసం 1942 ఆగస్టు ఎనిమిదో తేదీన గాంధీ పిలుపుతో యావత్ దేశం కదం తొక్కిందనీ, ఆ ఉద్యమానికి గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. క్విట్ ఇండియా ఉద్యమమే మన దేశం నుంచి బ్రిటీష్‌వాళ్లు వెళ్లిపోవడానికి కారణమైందని గుర్తుచేశారు. వేలాది మంది ప్రాణ త్యాగాల వల్లనే స్వాతంత్ర్యం సిద్ధించిం దని వివరించారు. గాంధీ, నెహ్రూలను తక్కువ చేసిన పనిలో పటేల్‌ను సొంతం చేసుకునే ప్రయత్నంలో బీజేపీ ఉందని విమర్శించారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే వారికి క్విట్ చెప్పాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. దేశం ఆశ్చర్యం పోయేలా రాష్ట్రంలో అభివృధి ,సంక్షేమం జరుగుతున్నదని వివరించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణను ఉద్ధరించింది ఏమీ లేదని విమర్శించారు. ఉద్యోగాలు విషయంలో బీఆర్ఎస్ నేతల ప్రగల్భాలు హాస్యాస్పదమని కొట్టిపడేశారు. సద్విమర్శ చేయాలిగానీ అసత్యాలు మాట్లాడొద్దని బీఆర్‌ఎస్ నేతలకు హితవు పలికారు. సర్ ప్రక్రియ ద్వారా తెలంగాణలో పెద్ద ఎత్తున ఓట్లను తొలగించే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ఓట్ల తొలగింపును అడ్డుకొని అర్హత కలిగిన ఓటును కాపాడుతున్నామని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నామన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ క్విట్ ఇండియా డేను స్పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ కన్న కళలు నిజం కావాలంటే విద్యార్థిని విద్యార్థులు పోరాటాలు పటిష్ఠంగా చేయాలన్నారు. డూ ఆర్ డై అనే నినాదంతో బ్రిటిష్ వారి పై గొప్ప ఉద్యమాన్ని మొదలు పెట్టిన మహనీయులు మహాత్మా గాంధీ అని కొనియాడారు. అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులు, గాంధేయ వాదులు చూపించిన దారిలో కాంగ్రెస్ నాయకులు ముందుకు నడుస్తున్నారనీ, వారి స్ఫూర్తితోనే బీజేపీ పై రాహుల్ గాంధీ నిత్యం పోరాటం చేస్తున్నారని తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమం గొప్ప పోరాటాన్ని విద్యార్థులకు అర్థం అయ్యేలా గాంధీ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ బాగుందని ప్రశంసించారు. గాంధీ స్పూర్తి తో శాంతియుతమైన పాలన అందిస్తామని హామీనిచ్చారు. శాంతిమార్గంలో ఏదైనా సాధించవచ్చని మరోసారి జెన్జీ ఉద్యమం ద్వారా నిరూపితమైందన్నారు. టీపీసీసీ, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో క్విట్ ఇండియా 84వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు బి.మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల చైర్మెన్ గున్న రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 1500 గాంధీ విగ్రహాలను, 150 చరకాలను ప్రదర్శించారు. శాంతిమార్గంలో స్వాతంత్య ఉద్యమాన్ని గాంధ నడిపిన తీరును కండ్ల కట్టినట్టు వివరించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, మంత్రులు మాట్లాడుతూ..గాంధీజీ ఆశయాలను, ఆలోచనలను, ప్రకృతి వ్యవసాయాన్ని, చేనేత వస్ర్తాలను ప్రోత్సహిస్తున్న గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ సభ్యులను అభినందించారు. క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌కు సంబంధించి కాంపిటేషన్లలో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో గాంధీ విగ్రహాల కమిటీ రాష్ట్ర కన్వీనర్ గాంధారి ప్రభాకర్, కో కన్వీనర్, వైస్ ప్రెసిడెంట్ ఎన్.దయాకర్‌రెడ్డి, గ్లోబల్ సంస్థల ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, అడ్వైజరీ మెంబర్ యం వి గోన రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
క్విట్ ఇండియా గొప్పతనాన్ని జెన్‌జీ తెలుసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



