Monday, August 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకాంతమ్మ సేవలు ఎనలేనివి

కాంతమ్మ సేవలు ఎనలేనివి

- Advertisement -

 పార్టీకి తీరనిలోటు : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌‌రెడ్డి
 నవతెలంగాణ సీజీఎం 
పి.ప్రభాకర్‌ నివాళి
గ్రామంలో ముగిసిన అంత్యక్రియలు
నవతెలంగాణ-తిరుమలగిరి

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన కారుపోతుల కాంతమ్మ మృతి సీపీఐ(ఎం)కు తీరనిలోటని ఆ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌‌రెడ్డి, సవతెలంగాణ సీజీఎం పి. ప్రభాకర్‌ అన్నారు. ‘నవతెలంగాణ’ ఎడిటర్‌ ‌రాంపల్లి రమేష్‌ అమ్మమ్మ కారుపోతుల కాంతమ్మ అంత్యక్రియలను ఆదివారం నిర్వహించారు. నవతెలంగాణ సీజీఎం, సిబ్బంది, సీపీఐ(ఎం) నాయకులు కారుపోతుల కాంతమ్మ నివాసానికి వెళ్లి ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలేసి నివాళుల ర్పించారు. సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు కాంతమ్మ భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె సేవలను, ధైర్యసాహసాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. ​​కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి, తెలంగాణ ప్రాంతంలో జరిగిన వివిధ పోరాటాలకు ఆమె ఇల్లు ప్రధాన కార్యాలయంగా సేవలు అందించిన తీరును గుర్తుచేశారు. ​సాయుధ పోరాట కాలంలో అనేక దాడులు ఎదురైనప్పటికీ, ప్రాణాలకు తెగించి పోరాట యోధులకు, కార్యకర్తలకు ఈ నివాసం రక్షణ కల్పించిందని తెలిపారు. ​స్వార్థం లేకుండా పార్టీ పురోగతికి, ప్రజా పోరాటాలకు నిలయంగా నిలిచిన ఈ నివాసం ప్రాంతీయ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుందన్నారు. తరతరాల సిద్ధాంత బంధం ​చిన్నతనం నుంచే కమ్యూనిస్టు భావజాలంతో పెరిగిన ఈ కుటుంబం, తరం మారినా అదే సిద్ధాంతానికి కట్టుబడి ఉందన్నారు. కుటుంబంలోని తల్లి, తండ్రి, కుమారుడు, కోడలు అందరూ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి ఉద్యమ పంథాలో ముందుకు సాగారని తెలిపారు. మల్లు స్వరాజ్యం, భీమిరెడ్డి నరసింహారెడ్డి వంటి ప్రముఖు లందరికీ ఇక్కడ ఆతిథ్యం లభించడమే కాకుండా, వ్యూహాత్మక చర్చలకు ఈ ఇల్లు వేదికగా నిలిచిందని గుర్తుచేశారు.

ప్రజా ఉద్యమాల్లో ఆమెది క్రియాశీలక పాత్ర : పి. ప్రభాకర్
ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన కాంతమ్మ సేవలు ఎనలేనివని నవతెలంగాణ పత్రిక సీజీఎం పి. ప్రభాకర్‌ అన్నారు. కాంతమ్మ నిరక్షరాస్యురాలైనప్పటికీ ప్రగతిశీల, వామపక్ష భావజాలాన్ని కలిగి ఉన్నారని తెలిపారు. ​తన రక్తసంబంధీకులను, కుటుంబాన్ని ఉద్యమ నేపథ్యం వైపు నడిపించడంలో ఆమె కీలక పాత్ర పోషించారన్నారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన రాంపల్లి రమేష్ నవతెలంగాణ పత్రిక ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించడం, కాంతమ్మ ఆశయాల బాటలో పత్రికను తీర్చిదిద్దడం యాదృచ్ఛికం కాదన్నారు. అది వారి ఉద్యమ నేపథ్య బలానికి నిదర్శనమని తెలిపారు. ​సామాజిక మార్పు కోసం పత్రికల ద్వారా మార్క్సిజంను ప్రజలకు మరింత చేరువ చేయాలనే కాంతమ్మ ఆశయం నేటి తరానికి ఆదర్శనీయమని అన్నారు.

కాంగ్రెస్ మూకల దాడిని తిప్పికొట్టిన వీరనారి
​​గ్రామంలో సీపీఐ(ఎం) నాయకుల సమావేశాలు, ప్రత్యర్థుల దాడులను ఎదుర్కొనే వ్యూహాలు, ప్రజా కళాకారులను తీర్చిదిద్దడం వంటి కీలక నిర్ణయాలకు కాంతమ్మ ఇల్లు ఒక ప్రధాన విప్లవ కేంద్రంగా మారిందని ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ తెలిపారు. ​ఆ రోజుల్లో సీపీఐ(ఎం) కార్యకర్తలపై కాంగ్రెస్ మూకలు జరిపిన కిరాతక దాడులను తిప్పికొట్టడంలో కాంతమ్మ సైతం నాయకులకు, కార్యకర్తలకు సమయోచిత సలహాలు, సూచనలు అందించేవారని అన్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు కాంతమ్మ ఇంట్లో ఉన్నారనే సమాచారంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఇంటిపైకి దాడికి వచ్చారని, ​సమయస్ఫూర్తితో వ్యవహరించిన కాంతమ్మ ధైర్యంగా నిలబడి పార్టీ కార్యకర్తలకు కర్రలు, కారంపొడి అందించడంతో పాటు దాడికి వచ్చిన కాంగ్రెస్ మూకల ముఖాన కారం కొట్టి తరిమికొట్టండి అని పిలుపునిస్తూ పోరాటంలోకి దింపారని గుర్తుచేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ.. ​​విప్లవ పోరాటంలో సీపీఐ(ఎం) శ్రేణులకు అండగా నిలిచి, ప్రత్యర్థుల దాడులను తిప్పికొట్టిన కాంతమ్మ ధైర్యసాహసాలు ప్రాంతీయ ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొత్తగట్టు మల్లయ్య, తాటికొండ సీతయ్య, నవతెలంగాణ జనరల్ మేనేజర్ లింగారెడ్డి, వేణుమాధవ్, బసవపున్నయ్య, గోవర్ధన్, మధుసూదన్ రెడ్డి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ సభ్యులు బూరుగుల ప్రభాకర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వనం సోమయ్య, సీనియర్ కళాకారులు కందుకూరి కాంతయ్య, మండల కమిటీ సభ్యులు పులిమామిడి మల్లేష్, సర్పంచ్ బోయపల్లి కిషన్, సీపీఐ(ఎం) నాగారం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి పాల్గొన్నారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -