సీవోఈ పునరావాస సెంటర్ కాదు
వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
నవతెలంగాణ-బెంగళూరు
జశ్‌ప్రీత్ బుమ్రా, నితీశ్‌కుమార్ రెడ్డి, హర్షిత్ రానా, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్.. తాజాగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఫిట్‌నెస్ సమస్యలతో దూరమైన భారత ఆటగాళ్లు. భారత క్రికెటర్లు ఇటీవల తరచుగా గాయాల బారిన పడటం, ఏ మ్యాచ్‌కు ఎవరు అందుబాటులో ఉంటారో అనే ఆందోళన టీమ్ మేనేజ్‌మెంట్‌లోనూ మొదలైన ఆందోళకర పరిస్థితులు చూస్తున్నాం. దీంతో, బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ (సీవోఈ) పనితీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీవోఈ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే పునరావాస కేంద్రం (రిహాబిలిటేసన్) కాదు, భారత క్రికెట్ నిరంతర పురోగతికి దిక్సూచిగా పనిచేస్తుందని స్పష్టత ఇచ్చారు. ఆటగాళ్లకు వరుస గాయాల నేపథ్యంలో జట్టు మేనేజ్‌మెంట్, సీనియర్ సెలక్షన్ కమిటీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మధ్య ఎటువంటి సమన్వయ సమస్య లేదని.. ఎప్పటిలాగే అద్భుతంగా సమాచారం పంచుకుంటున్నామని లక్ష్మణ్ తెలిపారు.సమన్వయం ఎలా ఉంటుందంటే.. ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ), మెన్స్, ఉమెన్స్ టీమ్ మేనేజ్‌మెంట్ మధ్య సమన్వయం అద్భుతంగా ఉంది. స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ (ఎస్‌ఎస్‌ఎం) సిబ్బంది, సెలక్షన్ కమిటీతోనూ చక్కటి సమన్వయం ఉంది.
సమాచారం, సమన్వయం ప్రక్రియ ఎలా ఉంటుందంటే.. సెలక్షన్ కమిటీ చైర్మెన్ ఏదేని ఆటగాడి ఫిట్‌నెస్ నివేదిక కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సంప్రదిస్తారు. స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ టీమ్ నుంచి ఆ సమాచారం తీసుకుని సెలక్షన్ కమిటీ చైర్మెన్‌తో పాటు చీఫ్ కోచ్, బీసీసీఐకి ఫిట్‌నెస్ నివేదికలు పంపుతాం. ఒకవేళ ఏదేని ఆటగాడి ఫిట్‌నెస్ పురోగతి నెమ్మదిగా ఉంటే ఆ విషయాన్ని సెలక్షన్ కమిటీకి చేరవేస్తాం. వచ్చే సిరీస్‌లో ఆ ఆటగాడు అందుబాటులో ఉండబోడనే అవగాహన సెలక్షన్ కమిటీకి ఉంటుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్ ఎల్లప్పుడూ ప్లేయర్, టీమ్ కేంద్రితంగా పని చేస్తుంది. జశ్‌ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్ ఫిట్‌నెస్ సాధించలేదు. సీవోఈ రూపొందించిన టైమ్‌లైన్‌కు తగినట్టుగా కోలుకోలేదు. ఆ ఇద్దరు ఫిట్‌నెస్ సాధించకపోతే, ఎవరిని జట్టులోకి తీసుకోవాలనే స్పష్టత సెలక్షన్ కమిటీకి ఉంది. అన్నీ తెలిసే, బుమ్రా, సాయి సుదర్శన్‌లను ఎంపిక చేశారు. ఇందులో ఇప్పుడే జరిగిందేదీ లేదు. క్రికెటర్లు సైతం మనుషులే, టైమ్‌లైన్‌ను ఎల్లప్పుడూ అందుకునేందుకు మెషిన్లు కాదు’ అని లక్ష్మణ్ తెలిపారు.పునరావాస కేంద్రం కాదు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కీలక విభాగం స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్‌కు చీఫ్ లేరు. నితిన్ పటేల్ వైదొలిగిన తర్వాత ఆ పదవికి అర్హుడైన వ్యక్తి కోసం ప్రయత్నిస్తున్నాం.
ప్రస్తుతం డా. దిన్షా పర్దివాలతో కూడిన ప్యానల్ ఆటగాళ్ల వైద్య నివేదికలను పరిశీలిస్తోంది. ఓ క్రికెటర్ భారత జట్టులో గాయపడినా, బయట గాయపడినా.. జట్టు ఫిజియోథెరపిస్ట్ గాయం స్వభావంపై ఓ అంచనాకు వస్తారు. సీవోఈకి వచ్చిన తర్వాత నిపుణులతో సంప్రదింపులు జరుపుతాం. వైద్య నివేదికలు, పరీక్షలు పూర్తయ్యాక… స్పోర్ట్స్ సైన్స్ మెడిసిన్ సిబ్బంది గాయపడిన క్రికెటర్లను పర్యవేక్షిస్తోంది. గాయంపై అంచనాకు వచ్చిన తర్వాత రికవరీ పక్రియపై ప్రణాళిక రూపొందిస్తారు. ఆటగాడు కోలుకున్నాక.. దశల వారీగా అతడి ఫిట్‌నెస్‌ను పరీక్షించి, అంచనా వేస్తాం. అంతిమంగా రెండు రిటర్న్ టు ప్లే మ్యాచ్ ప్రాక్టీస్‌ల అనంతరమే ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభిస్తుంది. మెన్స్, ఉమెన్స్ సహా జూనియర్ క్రికెటర్లకు ఇదే ప్రక్రియ. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కేవలం పునరావాస కేంద్రంగా చూడవద్దు. భారత క్రికెట్‌ను నిరంతర పురోగతి దిశగా నడిపించేందుకు ఇదో దిక్సూచి. ఈ మొత్తం ప్రక్రియలో ప్రతి దశలోనూ సమాచారాన్ని సెలక్షన్ కమిటీ చైర్మెన్, టీమ్ మేనేజ్‌మెంట్, బీసీసీఐతో సజావుగా పంచుకుంటాం. ఇందులో ఎటువంటి సమస్య తలెత్తలేదు. సమాచారం, సమన్వం అద్బుతంగా సాగతుందని’ లక్ష్మణ్ వివరించారు.



