షేర్మార్కెట్లో ఉద్యోగుల సొమ్ము ప్రతినెలా రూ.200 కోట్లు
ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు చేయాలంటూ
ఎంపీ వేం నరేందర్‌రెడ్డికి టీఎస్సీపీఎస్ఈయూ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్)ను తక్షణమే పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్‌రెడ్డిని ఆదివారం హైదరాబాద్‌లో టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్‌ల ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సుమారు రూ.20 వేల కోట్లు ఇప్పటికే షేర్ మార్కెట్లో పెట్టుబడులుగా ఉన్నాయని వివరించారు. ప్రతి నెలా ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెందిన మరో రూ.200 కోట్లు షేర్ మార్కెట్ పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాయని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిన విధంగా, తెలంగాణలో కూడా తక్షణమే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వేం నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఉద్యోగుల సమస్య న్యాయమైనదనీ, దీనిపై ఏఐసీసీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయన్నారని పేర్కొన్నారు. వీలైనంత త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై తగిన నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్సీపీఎస్ఈయూ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్ రావు, ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు భాస్కర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



