అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
రూ.20 కోట్లతో ఆషాఢ బోనాల నిర్వహణ
బంగారు బోనం సమర్పించిన కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల
నవతెలంగాణ – సిటీబ్యూరో
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల జాతర హైదరాబాద్ పాతబస్తీలో కన్నులపండువగా సాగింది. లాల్ దర్వాజాలోని ప్రసిద్ధ సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో లాల్ దర్వాజా పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రులు, ప్రజాప్రతినిధులకు అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత : మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ బోనాల జాతరకు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బోనాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఆలయానికి వచ్చిన వారందరికీ అమ్మవారి దర్శనం సులభంగా అయ్యేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. నెల రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో తెలంగాణ కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన అధికారులకు, పోలీసులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, రైతాంగం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు సాగాలని అమ్మవారిని వేడుకున్నట్టు చెప్పారు
.
భక్తులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు : మంత్రి కొండా సురేఖ
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని దేవాలయాల్లో బోనాల జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. అమ్మవారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
బంగారు బోనం సమర్పించిన కలెక్టర్
సింహవాహిని అమ్మవారికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు హైకోర్టు జస్టిస్ ఎస్. నంద అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరను పురస్కరించుకుని పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ బండా ప్రకాష్, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే ఠాగూర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వివిధ కార్పొరేషన్ చైర్మెన్లు మెట్టు సాయి కుమార్, సరితా తిరుపతయ్య యాదవ్, భాస్కర్, అజయ్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, నగర సీపీ సజ్జనార్, స్పెషల్ ఆఫీసర్ రవి, ఆర్డీవో రామకృష్ణ, సినీహీరోలు విజయ దేవరకొండ బ్రదర్స్, ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు విస్తృత బందోబస్తు నిర్వహించారు.



