ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడి
బంజారా భవన్లో ఘనంగా ఆదివాసీ దినోత్సవం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన సంక్షేమానికి ఈ ఏడాది ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రాష్ర్ట ప్రభుత్వం రూ.18,745.16 కోట్లు కేటాయించినట్టు ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని బంజారా భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా గిరిజన ప్రాంతాల్లోనే విద్య, మౌలిక వసతులు, రహదారులు, తాగు, సాగు నీరు, విద్యుత్, భూమి అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి తదితర రంగాలకు వినియోగిస్తున్నామని చెప్పారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి, మహిళా సాధికారతతో పాటు వారి భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. గిరిజన బిడ్డలు దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో రాణించేలా అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆదివాసీ సమాజం, గిరిజన సంక్షేమం, విద్య, సంస్కృతి, హక్కుల పరిరక్షణ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన తొమ్మిది మంది ప్రముఖులు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఆదివాసి వివిధ కళా సంస్కృతులకు సంబంధించిన ప్రదర్శనలు, ఆటపాటలు, నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ట్రైకార్ మాజీ చైర్మెన్ బెల్లయ్య నాయక్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ బీఎం. సంతోష్, టీజీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రటరీ సీతాలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, కళాకారులు, ఉద్యోగులు, వివిధ గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమానికి రూ.18,745.16 కోట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



