జైల్భరో కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి బొట్ల చక్రపాణి పిలుపు
నవతెలంగాణ – పరకాల
కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు వంటి సంపద సృష్టికర్తలకు వ్యతిరేకంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా కోశాధికారి బొట్ల చక్రపాణి పిలుపునిచ్చారు. దేశవ్యాప్త జైల్భరో కార్యక్రమంలో భాగంగా సోమవారం పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు పోలీస్స్టేషన్ ఎదుట అడ్డుకోవడంతో కార్మికులు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఈ సందర్భంగా బొట్ల చక్రపాణి మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని విమర్శించారు. యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగించేలా నిబంధనలు రూపొందిస్తున్నారని ఆరోపించారు. పని గంటలను పెంచుతూ కార్మికులను యాజమాన్యాలకు అనుకూలంగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం వల్ల దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. విద్యుత్ సంస్కరణల బిల్లు, విత్తన చట్టం వంటి ప్రతిపాదనలు రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా వీబీజీ రామ్ జీ బిల్లు రూపొందిస్తున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, మరోవైపు కార్పొరేట్ వర్గాలకు సంపదను దోచిపెట్టే విధానాలను మోడీ ప్రభుత్వం అనుసరిస్తోందని చక్రపాణి ఆరోపించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బొచ్చు ఆదాం, పల్లె రామన్న, పి. సమ్మక్క, రమేష్, కమల్, చరణ్, రాజమౌళి, పి. రవి, సరోజన, తిరుమలతో పాటు సుమారు 100 మంది కార్మికులు పాల్గొన్నారు.



