నవతెలంగాణ – కామారెడ్డి : దేశవ్యాప్త పిలుపులో భాగంగా కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన జైల్ భరో కార్యక్రమంలో అరెస్టులకు భయపడకుండా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మిక ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, సభ్యులకు సీఐటీయూ జిల్లా కమిటీ అభినందనలు తెలుపుతున్నట్లు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ ఒక ప్రకటన విడుదల చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సమాఖ్యల సంయుక్త వేదిక ఇచ్చిన పిలుపు మేరకు వందలాది మంది కార్మికులు జైల్ భరో కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమం ప్రధానంగా కార్మిక, రైతు సమస్యల పరిష్కారం కోసం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
నాలుగు కఠినమైన కార్మిక చట్టాలను రద్దు చేయాలని, పటిష్టమైన ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను పునరుద్ధరించాలని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అలాగే అన్ని వర్గాల కార్మికులకు రూ.42 వేల సార్వత్రిక కనీస వేతనం అమలు చేయాలని కోరారు. జైల్ భరో కార్యక్రమం విజయవంతం కావడం ద్వారా కార్మికులు, రైతులు లేవనెత్తుతున్న డిమాండ్లు ప్రజల్లో ప్రతిధ్వనిస్తున్నాయని స్పష్టమైందని చంద్రశేఖర్ అన్నారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని, క్షేత్రస్థాయిలో వస్తున్న హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.



