కార్మిక హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత, మెరుగైన వేతనాల కోసం నిరంతర పోరాటం.. పరిశ్రమల్లో యాజమాన్యాల వేధింపులు, కక్షసాధింపు చర్యలకు ఎదురొడ్డి ఐక్యంగా నిలిచిన కార్మిక వర్గం.. వరుస గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూకు పట్టం. తెలంగాణలోనే అత్యధిక పరిశ్రమలున్న సంగారెడ్డి జిల్లాలో సుమారు 1,375 పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. పటాన్చెరు ‘మినీ ఇండియా’గా పేరొందినా కార్మికుల బతుకులు మాత్రం మారలేదు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, నివాసం, పని ప్రదేశాల్లో రక్షణ లేకపోవడం వంటి సమస్యలతో సతమతమతవుతున్నాయి. యూనియన్ ఏర్పాటు చేస్తే తొలగింపులు, ప్రమాదాల్లో గాయపడినా న్యాయం దక్కని పరిస్థితులు నిత్యం వేధిస్తున్నాయి. ఇలాంటి దుస్థితిలో కార్మికులను సంఘటితం చేసి, హక్కుల కోసం పోరాడుతున్న సంఘంగా సీఐటీయూ నిలిచింది. పరిశ్రమల్లో యూనియన్లను ఏర్పాటు చేయడంతో పాటు వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, మెరుగైన పని పరిస్థితులు, కార్మిక సంక్షేమ సదుపాయాల కోసం నిరంతరం పోరాడు తోంది.
ప్రస్తుతం జిల్లాలో డెబ్భయికి పైగా పరిశ్రమల యూని యన్లను కలిగి ఉన్న సీఐటీయూ.. కార్మిక శాఖ నిర్వహించే గుర్తింపు ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తోంది. పటాన్ చెరులోని శాండ్విక్ పరిశ్రమలో నలభై రెండేండ్లుగా సీఐటీయూ ప్రాతినిధ్యం కొనసాగిస్తోంది. ఇటీవల పద్దెనిమిదవ యూనియన్ మహాసభను కూడా నిర్వహించింది. కిర్బీ, తోషిబా, టీఐడీసీ, కొండాపూర్ ప్రాంతంలోని బీరు పరిశ్రమలు, జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్, మహీంద్రా ట్రాక్టర్స్, ఎంఆర్ఎఫ్ వంటి ప్రముఖ పరిశ్రమ ల్లోనూ సీఐటీయూ తన కార్మికుల నమ్మకాన్ని నిలబెట్టింది. ఆగస్టు 7న జరిగిన పెప్సీ (వీబీఎల్) కంపెనీ గుర్తింపు ఎన్నికల్లో వరుస విజయాన్ని నమోదు చేసింది. కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలను రాజకీయ పోరాటాలుగా మార్చే ప్రయత్నాలు కూడా చోటుచేసుకుం టున్నాయి. డబ్బు, మద్యం, ఖరీదైన వస్తువుల ప్రలోభాలతో పాటు బెదిరింపులు, కులం, మతం, ప్రాంతీయ అంశాలతో కార్మికులను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల వివిధ యూనియన్లు ఏకమై సీఐటీయూను ఓడించేందుకు ప్రయత్నిం చినా కార్మికులు మాత్రం సీఐటీయూకే మద్దతు పలికారు. పోరాడే ఎర్రజెండాను గుండెల్లో పెట్టుకున్నారు. దీంతో కార్మికుల నమ్మకమే సీఐటీయూ ప్రధాన బలంగా మారింది.
కాంట్రాక్ట్, పర్మినెంట్ అనే తేడా లేకుండా కార్మికులందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి యాజమాన్యాల ముందు ఐక్యశక్తిగా నిలబెట్టడం సీఐటీయూ పోరాటంలో కీలక అంశంగా మారింది. అక్రమ బదిలీలు, తొలగింపులు, సస్పెన్షన్లు, కక్షసాధింపు చర్యలకు వ్యతిరేకంగా చట్టబద్ధమైన పోరాటాలతో పాటు అవసరమైన ప్పుడు సంఘీభావ ఉద్యమాలు నిర్వహిస్తోంది. పాశమైలారం బిస్లరీ ఇంటర్నేషనల్ పరిశ్రమలో యూనియన్ ఏర్పాటు చేశారనే కారణంతో ఐదుగురు కార్మికులను యాజమాన్యం సస్పెండ్ చేసిన ఘటనపై సీఐటీయూ పోరాటం కొనసాగిస్తోంది. కొండాపూర్ మైక్రోబాక్స్ పరిశ్రమలో పద మూడు మంది కార్మికులను తొలగించిన ఘటనపైనా ఉద్యమం చేపట్టింది. ఉద్యోగాలు కోల్పోయిన కార్మిక కుటుం బాలకు తోటి కార్మికుల సహకారంతో నిత్యావసర వస్తువులు అందిస్తూ సంఘీభావాన్ని చాటుతోంది. యాజ మాన్యాల కక్షసాధింపు చర్యలకు గురైన సీఐటీయూ నాయకులు, కార్మికులు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ.. కార్మికులు భారీ మెజార్టీలతో సీఐటీ యూను గెలిపించిన సందర్భాలు అనేకం. ఇది యూనియన్‌పై కార్మికులకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం. వేతనాల పెంపుతో పాటు ఉద్యోగ భద్రత, కుటుంబ ఆరోగ్యం, పిల్లల విద్య, ప్రమాద బీమా వంటి అంశాలపైనా సీఐటీయూ దృష్టి పెట్టడం కార్మికుల్లో విశ్వాసాన్ని పెంచింది.
ఉమ్మడి మెదక్ జిల్లా పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో సీఐటీయూ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. మెరుగైన వేతన ఒప్పందాలు సాధించడం, కార్మిక నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం, యాజ మాన్యాల అక్రమాలను ప్రశ్నించడం వంటి అంశాల్లో నాయకత్వం కీలక పాత్ర పోషిస్తోంది. సమస్య వచ్చిన వెంటనే స్పందించి కార్మికులకు అండగా నిలిచే నాయకత్వమే సీఐటీయూపై నమ్మకాన్ని మరింత బలోపేతం చేసింది. సంగారెడ్డి పరిశ్రమల గుర్తింపు ఎన్నికల్లో వివిధ రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు రంగంలోకి వచ్చినా సీఐటీయూ విజయాలను అడ్డుకోలేకపోయారు. ఈ విజయాల వెనుక నాయకత్వంతో పాటు కార్మికుల ఐక్యత, సంఘటిత పోరాటం, సిద్ధాంత నిబద్ధత ప్రధాన కారణాలుగా నిలిచాయి.ఈ నేపథ్యంలో సంగారెడ్డి పరిశ్రమల్లో సీఐటీయూ సాధిస్తున్న వరుస విజయాలు కేవలం కొన్ని కార్మిక సమస్యల పరిష్కారాలకే పరిమితం కావు.
అవి ఐక్యతతో పోరాడితే హక్కులను సాధించవచ్చనే నమ్మకాన్ని కార్మికుల్లో నింపు తున్నాయి. ఈ విజయాలు రేపటి పోరాటాలకు స్ఫూర్తిగా మారి, శ్రమదోపిడీ లేని సమాజ నిర్మాణం వైపు కార్మిక వర్గాన్ని చైతన్యంగా ముందుకు నడిపించాలి. కార్పొరేట్ ఆధిపత్యం, కార్మిక వ్యతిరేక విధానాలు విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికుల ఐక్యతే వారి ప్రధాన బలం. ఆ ఐక్యతను మరింత పదునుపెట్టి, హక్కుల పరిరక్షణతో పాటు మెరుగైన సమాజ నిర్మాణం వైపు ఉద్యమాన్ని నడిపించాల్సిన బాధ్యత ముందుంది.
క్రిష్ణ, 9490098705



