రేషన్ షాపుల్లో 14 రకాల నిత్యావసర సరుకులివ్వాలి
ఇండ్ల స్థలాలతో పాటు ఇల్లు నిర్మించివ్వాలి
ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
ప్రజా సమస్యలపై 20న రాష్ట్ర వ్యాప్తంగా
జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు
31న మండల, పట్టణ కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని పిలుపు
నవతెలంగాణ-మంచాల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వైద్యంపై దృష్టి సారించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్ల స్థలాలతోపాటు ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పాషా, నరహరి స్మారక కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో, వైద్యశాలల్లో మౌలిక వసతులు కల్పించాల న్నారు. పేదలకు విద్య, వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం
మంచి పరిణామమే.. కానీ రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు మాట ఇచ్చిందనీ, అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. తూతూమంత్రంగా నోటిఫికేషన్లు ఇచ్చి.. కాలం గడుపుతోందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలంటూ నమ్మబలికి.. ఉన్న ఉద్యోగాలు తీసేసిందన్నారు. యువతకు రుణాలు ఇవ్వడంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వహించిన జైల్ భరో కార్యక్రమంలో లక్షలాది మంది కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి శ్రామిక వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని, లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో, 31న మండల, పట్టణ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సామెల్, ఎం.చంద్ర మోహన్, డి.జగదీష్, కె.జగన్ జిల్లా కమిటీ సభ్యులు ఎన్. రాజు, సి.శోభన్, ఏ.నర్సింహ, ఆర్.జంగయ్య, సిహెచ్ బుగ్గరాములు, హెచ్. జంగయ్య, డి.కిషన్, జి.నర్సింహ, జె..రుద్రకుమార్, కె.నర్సిరెడ్డి, పి.జగన్ పాల్గొన్నారు.



