స్వచ్ఛమైన గాలికోసం కేంద్రం చేసిన ఖర్చు రూ.16,423 కోట్లు
అయినా ‘జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం’ అట్టర్ ఫ్లాప్…బీజేపీ పాలిత మహా నగరాల్లో మరీ అధ్వాన్నం
అమెరికాలో వద్దన్న కంపెనీలకు భారత్‌లో స్థానం…భయపెడుతున్న వాయు కాలుష్యం
నవతెలంగాణ-న్యూఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించే దుస్థితి. ముంబయి, కోల్‌కతా, సూరత్, అహ్మదాబాద్, పూణే, భువనేశ్వర్, అమృత్‌సర్ , గౌహతి నగరాలదీ దాదాపు అదే పరిస్థితి. దేశంలోని ప్రధాన నగరాల్లో వాయి కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంది. దీన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ‘జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం’ (ఎన్‌సీఏపీ) అనే స్కీంను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్కీం ద్వారా రూ.16,423 కోట్లు ఖర్చు చేసింది. దానిలో 2023 నుంచి 2026 మార్చి వరకు చేసిన ఖర్చు అక్షరాలా రూ.6,822 కోట్లు. ఈ నిధులన్నీ ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ర్టాలకే అధికంగా కేటాయించబడ్డాయి. ఈ నిధులు ఖర్చు చేసిన చోట్ల వాతావరణ పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా అని పరిశీలిస్తే…అలాంటిదేం లేదని శాస్ర్తీయ ఆధారాలు రుజువు చేస్తున్నాయి. ఆ నిధుల వినియోగం చేసిన 83 శాతం నగరాల్లో గాలి నాణ్యత ఇప్పటికీ అధ్వాన్నంగానే ఉందని తాజా నివేదికలు చెప్తున్నాయి. దీనితో ఈ నిధుల ఖర్చుపై సహజంగానే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మారని పర్యావరణ మార్పుల కోసం అన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు చేశారనేదే ప్రశ్నార్థకం!
మార్పు లేదన్న కేంద్రం
ఇదే విషయాన్ని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీ , వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆగస్టు 10న లోక్‌సభలో వివరాలు వెల్లడించింది. వాయు కాలుష్య నియంత్రణ కోసం రూ. 800 కోట్లకు పైగా ఖర్చు చేసినప్పటికీ మహారాష్ట్రలోని ముంబయి సహా మొత్తం 19 నగరాల్లో గడచిన మూడేండ్లు గా సూక్ష్మ ధూళి కణాలు(పీఎం)10 మైక్రో మీటర్ల కంటే ఎక్కువ ఉన్నాయని నిర్ధారణ అయ్యింది. ప్రపంచ ఆరోగ్య సంస్థీ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాల ప్రకారం గాలిలో సూక్ష్మ ధూళి కళాలు 2.5 మైక్రోమీటర్లకంటే దాటరాదు. ఇలాంటి సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి నేరుగా వెళ్తాయి. తద్వారా శ్వాస సంబంధ సమస్యలు తీవ్రమవుతాయి. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలో ‘జాతీయ పరిసర గాలి నాణ్యత ప్రమాణాల’ (ఎన్ఏఏక్యూఎస్) పరిమితిని దాటి ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది.
పీఎం 10 అంటే..
పీఎం10 (అంటే 10 మైక్రాన్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన సూక్ష్మ కణాలు) అనేది ధూళి, నిర్మాణ సామాగ్రి, రవాణా రంగం నుంచి వెలువడే ఉద్గారాలు , పుప్పొడి రేణువుల నుంచి కూడా
ఉత్పన్నమయ్యే వాయు కాలుష్య కారకం. ఎన్సీఏపీ ప్రధానంగా పీఎం 10పై దృష్టి సారిస్తున్నది. కానీ పీఎం 2.5 (అంటే 2.5 మైక్రాన్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన సూక్ష్మ కణాలు) ప్రజల ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి.
ఈ నగరాల్లో మరీ అధ్వాన్నం
ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా, సూరత్, అహ్మదాబాద్, పూణే, భువనేశ్వర్, అమృత్‌సర్ , గౌహతి నగరాలన్నీ 2023, 2024, 2025 , 2026 (జులై వరకు) సంవత్సరాలలో ఎన్ఏఏక్యూఎస్ ప్రమాణాలను మించిపోయాయి. 2019లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి 130 నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం రూ. 16,423 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఎన్సీఏపీ పరిధిలో అత్యధిక సంఖ్యలో నగరాలు కలిగిన రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర , ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. అవి ఈ జాబితాలో వరుసగా 13, 19 , 17 చొప్పున నగరాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని ఏ నగరంలోనూ గాలి నాణ్యత జాతీయ సురక్షిత ప్రమాణాల పరిధిలో లేకపోగా (అన్నీ ప్రమాణాలను మించి ఉన్నాయి), ఉత్తరప్రదేశ్‌లోని 17 నగరాల్లో 16 నగరాలు ఎన్ఏఏక్యూఎస్ పరిమితులను మించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో13 నగరాల్లో 8 నగరాలు నిర్దేశిత ప్రమాణాలను అందుకోలేకపోయాయి. బీహార్‌లోని మూడు నగరాలు, గుజరాత్‌లోని నాలుగు నగరాలు , ఒడిశాలోని ఏడు నగరాలు కూడా అవసరమైన గాలి నాణ్యత ప్రమాణాలను పాటించడంలో విఫలమయ్యాయి. ఈ నగరాలన్నింటిలో కేంద్రం నిధుల్ని ఖర్చుచేసింది.
ఇవీ లక్ష్యాలు..
ఎన్సీఏపీ కింద ప్రతి నగరం 2025-26 నాటికి సూక్ష్మ కణాల కాలుష్యాన్ని 40 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ లోక్‌సభలో పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానం ప్రకారం మొత్తం 130 నగరాల్లో కేవలం 26 నగరాలు మాత్రమే ఈ లక్ష్యాన్ని సాధించగలిగాయి. అదే సమయంలో, ఈ కార్యక్రమంలో జాబితా చేయబడిన నగరాల్లో 10 శాతం కంటే తక్కువగా, అంటే కేవలం 14 నగరాలు మాత్రమే పీఎం 10 సాంద్రతకు సంబంధించిన ఎన్ఏఏక్యూఎస్ ప్రమాణాలను అందుకున్నాయని వెల్లడైంది. మరి మిగిలిన నగరాల్లో పరిస్థితులు ఎందుకు మారలేదనేదానికి కేంద్రం వద్ద సమాధానాలు లేవు..
ప్రభుత్వ విధానాలే కారణం
వాయు కాలుష్యానికి కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. పట్టణాలు, పల్లెల్లో ప్రభుత్వ ప్రజారవాణా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి, ప్రయివేటు, కార్పొరేట్ వ్యాపారాల కోసం వ్యక్తిగత వాహనాల సంఖ్యను పెంచేశారు. దానికి తోడు అమెరికా వంటి సంపన్న దేశాల్లో అక్కడి ప్రజల ఆరోగ్యం కోసం తిరస్కరించబడిన అనేక పరిశ్రమల్ని భారతదేశంలో నెలకొల్పుకునేందుకు అనుమతులు ఇచ్చారు. అమెరికాలో వద్దనుకున్న డేటా సెంటర్ల ఏర్పాటు కూడా దానిలో భాగమే. మరోవైపు అదానీ, అంబానీలకు భూగర్భ ఖనిజాలను కట్టబెట్టేందుకు వేల ఎకరాల అడవులను కూడా వారికి ధారాదత్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ పేరుతో వేల కోట్ల రూపాయాల నిధుల్ని ఖర్చు చేస్తూ, వాటి ఫలితాలను మాత్రం విస్మరిస్తున్నారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2019లో ఎన్సీఏపీని ప్రారంభించి, ప్రాధాన్యతల పేరుతో బీజేపీ పాలిత రాష్ర్టాలకు వరుసగా నిధుల్ని విడుదల చేస్తూనే ఉంది.



