Wednesday, August 12, 2026
E-PAPER
Homeజాతీయంఅమెరికా ఒత్తిడితో యూపీఐపై చార్జీలు..!

అమెరికా ఒత్తిడితో యూపీఐపై చార్జీలు..!

- Advertisement -

వీసా, మాస్టర్‌ కార్డ్‌కు ప్రయోజనం
గూగుల్‌‌పే, ఫోన్‌‌పేకు లబ్ధి..!
న్యూఢిల్లీ :
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) ద్వారా జరిగే డిజిటల్ చెల్లింపులపై ఇప్పటివరకు ఉన్న ఉచిత విధానానికి మోడీ సర్కార్‌ ‌స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. ఇందుకోసం పార్లమెంట్‌లో కీలక బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అమెరికా నుంచి వస్తున్న వాణిజ్య ఒత్తిళ్ల నేపథ్యంతో యుపిఐ చెల్లింపులపై చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం యుపిఐ, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదు. అయితే ఈ నూతన చట్ట సవరణ ప్రకారం.. ఏ డిజిటల్ చెల్లింపులు ఉచితంగా ఉండాలి. వేటిపై ఛార్జీలు విధించవచ్చనేది నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లభించింది. ప్రస్తుతం రెండు రకాల ఆప్షన్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యుపిఐ మర్చంట్ లావాదేవీలపై 0.25 శాతం నుండి 0.5 శాతం వరకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్‌) విధించడం లేదా రూ. 1.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారుల నుంచి ఛార్జీలు వసూలు చేయనున్నారని రిపోర్టులు వస్తున్నాయి.జులై 2026లో యుపిఐ ఏకంగా 2360 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వాటి విలువ రూ.29.9 లక్షల కోట్లకు చేరింది.

ఎవరి ప్రయోజనాల కోసం..?
యుపిఐ సేవలు ప్రారంభమైన తర్వాత డెబిట్, క్రెడిట్‌ కార్డుల స్థానంలో ఉచిత యుపిఐ చెల్లింపులను విస్తృతంగా వినియోగిస్తున్నారు. దీంతో వీసా, మాస్టర్‌కార్డ్‌ వంటి అమెరికా కార్డు నెట్‌వర్క్‌లకు లభించే ఫీజు ఆధారిత వ్యాపార అవకాశాలు తగ్గుతున్నాయి. మరోవైపు దేశీయ కార్డు నెట్‌వర్క్‌ రూపేకు ప్రభుత్వం మద్దతు ఇవ్వడం, రూపే క్రెడిట్‌ కార్డులను యుపిఐతో అనుసంధానించడం కూడా అమెరికా అభ్యంతరాలకు కారణమయ్యాయని స్పష్టమవుతోంది.యుపిఐ, రూపే వ్యవస్థల వల్ల తమ దేశానికి చెందిన విసా, మాస్టర్‌కార్డ్ వంటి దిగ్గజ సంస్థల వ్యాపారం దెబ్బతింటోందని అమెరికా ప్రధాన ఆరోపణ. ఉచిత యుపిఐ సేవలు, రూపే కార్డులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల వల్ల తమ కార్డ్ నెట్‌వర్క్‌లు భారీగా ఫీజు ఆదాయాన్ని కోల్పోతున్నాయని వాషింగ్టన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బ్రెజిల్ దేశానికి చెందిన ఉచిత చెల్లింపు వ్యవస్థ పిక్స్ పై కూడా అమెరికా ఇలాగే ఒత్తిడి తెచ్చి.. మాట వినకపోవడంతో ఆ దేశ ఉత్పత్తులపై 25 శాతం దాకా అదనపు సుంకాలను విధించిన సంగతి విదితమే. ఆ తరహాలోనే భారత్‌‌పైనా ఒత్తిడి పెంచుతోందని తాజాగా సిపిఎం ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

డిజిటల్‌ ‌యాప్‌‌ల్లోనూ అమెరికా ఆధిపత్యం..
భారతదేశపు యుపిఐ మార్కెట్‌లోనూ అమెరికా సంస్థలైన గూగుల్ పే, వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్‌పే ఇప్పటికే 80 శాతానికి పైగా లావాదేవీలను నియంత్రిస్తున్నాయి. ఏ ఒక్క యాప్ కూడా 30 శాతానికి మించి మార్కెట్ వాటా కలిగి ఉండకూడదన్న ఎన్‌పిసిఐ నిబంధనను కూడా అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ నిబంధన అమలును ప్రభుత్వం డిసెంబర్ 2026 వరకు వాయిదా వేస్తూ వచ్చింది. దీనికితోడు డేటా లోకలైజేషన్ నిబంధనలను కూడా అమెరికా కంపెనీలు తప్పుబడుతున్నాయి.

సార్వభౌమత్వానికి దెబ్బ..
భారత ప్రజాధనంతో నిర్మితమైన డిజిటల్ మౌలిక సదుపాయాలలో విదేశీ కంపెనీలు ఇంతటి ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నప్పటికీ.. అమెరికా మాత్రం తమ వీసా, మాస్టర్‌కార్డ్ కంపెనీల లాభాల కోసం భారత్‌పై ఒత్తిడి పెంచుతూనే ఉంది. అమెరికా వాణిజ్య ఒత్తిళ్లకు తలొగ్గి ఉచిత సేవలకు స్వస్తి పలకడం లేదా నిబంధనలను సడలించడం భారత డిజిటల్ సార్వభౌమత్వానికి మంచిది కాదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఒత్తిళ్లకు కాకుండా భారత వినియోగదారులు, వ్యాపారులు, బ్యాంకులు, ఎన్‌పిసిఐ ప్రయోజనాలను సమతుల్యం చేసే విధంగా కేంద్ర విధానాలు ఉండాలని సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -