మరణించిన వారు 9,22,230
శాశ్వతంగా వలస వెళ్లిన వారు 45,18,961
ఆచూకీ లభించని ఓటర్లు 11,25,546 : ఎన్నికల సంఘం
ఫాం 6 ద్వారా 10 లక్షలకు పైగా కొత్త ఓటర్ల దరఖాస్తు
అక్టోబర్ 19న తేలనున్న మొత్తం ఓటర్ల సంఖ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ మొదటి దశలో రాష్ర్టంలో 73,39,234 ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుకు గాను 2,64,87,214 మంది ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి ఆగస్టు 10 వరకు ఎన్నికల సంఘానికి అందజేశారు. అందులో 2002 సర్‌తో మ్యాపింగ్ కాని 89.88 లక్షల మంది, తేడాలున్న 50 లక్షల మంది ఓటర్లు , సరైన పత్రాలు అందజేయని ఓటర్లు కూడా ఉన్నారు. జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు ఎన్యూమరేషన్ల పంపిణీ, వాటి స్వీకరణ అనంతరం మొత్తం ఐదు కేటగిరీల్లో ఓట్లను తొలగించారు. మరణించిన వారు 9,22,230, శాశ్వతంగా వలస వెళ్లిన వారు 45,18,961, ఆచూకీ లభించని ఓటర్లు 11,25,546, ఇప్పటికే ఎన్‌రోల్ అయిన ఓటర్లు 6,70,203, ఇతర కారణాలతో 1,02,294 ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించింది. కాగా ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 16 వరకు నెల రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ కొనసాగనుంది. అక్టోబర్ 15 వరకు ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి, 19న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం మంగళవారం సర్ మొదటి దశ వివరాలను వెల్లడించింది.
సరైన పత్రాలు లేకుంటే మరిన్ని ఓట్ల తొలగింపు
2002 సర్‌తో మ్యాపింగ్ కాని 89.88 లక్షల మంది, తేడాలున్న దాదాపు 50 లక్షల మంది ఓటర్లు సరైన పత్రాలు అందజేయకుంటే వారి ఓట్లు తొలగి పోయే అవకాశం ఉంది. వీరందరికీ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసి, వారి నుంచి సరైన ఆధారాలను, అభ్యంతరాలను స్వీకరిస్తుంది. వారసత్వ పత్రాలు లేని వారు ఎన్నికల సంఘం గుర్తించిన (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ కార్డులు, జన్మ ధృవీకరణ పత్రం, పాస్ పోర్ట్, టెన్త్ సర్టిఫికెట్, అటవీ హక్కుల ధృవీకరణ పత్రం, భూమి/ఇంటి కేటాయింపు) 11 డ్యాక్యుమెంట్లను సమర్పించాలి. వారి నుంచి వచ్చే సమాధానం ఆధారంగా నిబంధనల మేరకు వారి ఓటు నమోదుపై ఈసీ నిర్ణయం తీసుకుంటుంది. పూర్తి వివరాలు సమర్పించని ఓటర్ల విషయంలో ఈఆర్‌వో, ఏఈఆర్‌వోలు విచారణ చేస్తారు. విచారణ సమయంలో అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అయినా జాబితాపై అభ్యంతరాలుంటే ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి (ఈఆర్‌వో) తీసుకున్న ఏ నిర్ణయంపైనైనా ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 24(a) ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పీల్ చేయవచ్చు. మొదటి అప్పీల్ అధికారి నిర్ణయంపై 25 24(b) ప్రకారం రిజిస్ర్టేషన్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1960లోని రూల్ 27 ప్రకారం ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో)కు రెండో అప్పీల్ చేసుకోవచ్చు.
కొత్త దరఖాస్తులు 10 లక్షలకు పైనే…
రాష్ర్టంలో 10 లక్షల మంది వరకు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. ఇందులో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ఓటర్లతో పాటు ఇండ్లు మారిన సందర్భంలో ఎన్యూమరేషన్ ఫారాలు అందుకోలేక ఓటు డిలీట్ అయిన వారు కూడా ఉన్నారు. డిలీట్ అయిన ఓటర్లను తిరిగి చేర్చడంలో ఎన్నికల సంఘం ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించక పోవడంతో వారంతా ఫాం 6 ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ కొత్త ఓటర్లను సర్ తుది జాబితాలో ప్రకటించరు. సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వారికి ఓటు హక్కు కల్పించనున్నారు.



