Wednesday, August 12, 2026
E-PAPER
Homeబీజినెస్అదానీపై అమెరికాలో క్రిమినల్‌ కేసు కొట్టివేత

అదానీపై అమెరికాలో క్రిమినల్‌ కేసు కొట్టివేత

- Advertisement -

కేసు ఉపసంహరణ తీరుపై 
న్యాయమూర్తి అసంతృప్తి..
వాషింగ్టన్‌ :
అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీపై అమెరికాలో నమోదయిన మోసం, లంచాల క్రిమినల్‌ కేసును బ్రూక్లిన్‌ ఫెడరల్‌ కోర్టు కొట్టివేసింది. అమెరికా న్యాయశాఖ ఇక ఈ కేసును కొనసాగించబోమని కోరడంతో న్యాయమూర్తి నికోలస్‌ గారాఫిస్‌ సోమవారం కేసును రద్దు చేశారు. భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి సౌర విద్యుత్‌ ప్రాజెక్టులకు అనుమతులు పొందేందుకు ప్రయత్నించారని, అనంతరం అమెరికా పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారని అదానీపై 2024లో ఆరోపణలు వచ్చాయి. అదానీ గ్రూప్‌ ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చింది. కేసు విదేశాలకు సంబంధించినదని, నిరూపించడం కష్టమని, ప్రస్తుత ప్రాధాన్యాలకు అనుగుణంగా లేదని అక్కడి న్యాయశాఖ పేర్కొంది. అయితే కేసును ఉపసంహరించుకున్న తీరుపై న్యాయమూర్తి గారాఫిస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసును దర్యాప్తు చేసిన అధికారులు, ప్రాసిక్యూటర్ల అభిప్రాయాలను పక్కనపెట్టి న్యాయశాఖలోని ప్రిన్సిపల్‌ అసోసియేట్‌ డిప్యూటీ అటార్నీ జనరల్‌ ట్రెంట్‌ మెక్‌కాటర్‌ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందని.. ఈ ప్రక్రియలోని అవకతవకలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అదానీ గతంలో అమెరికాలో 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెడతానని ఇచ్చిన హామీ కేసు ఉపసంహరణపై ప్రభావం చూపిందా అని కూడా కోర్టు ప్రశ్నించింది. అయితే కేసును రద్దు చేయడం ద్వారా ఆరోపణలపై అదానీ నిర్దోషిత్వాన్ని న్యాయమూర్తి నిర్ధారించినట్లు భావించరాదని కోర్టు స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -