Wednesday, August 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌నిషేధిత భూములపై ఆందోళన చెందొద్దు

‌నిషేధిత భూములపై ఆందోళన చెందొద్దు

- Advertisement -

చట్టబద్ధంగా అర్హులైన వారికి న్యాయం చేస్తాం
 14 లోగా డాక్యుమెంట్లను
 ఆన్‌‌లైన్‌‌లో అప్‌‌లోడ్‌ చేయాలి
 యుద్ధప్రాతిపదికన
 దరఖాస్తులను పరిష్కరించాలి
 ఆన్‌‌లైన్‌‌లో ఉన్న వివరాల మేరకే నిర్ణయాలు : మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నిషేధిత ఆస్తుల పీఓబీ/22ఏ జాబితాలో ఉన్న భూముల‌కు సంబంధించి ప్రజ‌లు ఎలాంటి అపోహ‌లు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేద‌నీ, ఎవరూ ఆందోళన చెందొద్దని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి చెప్పారు. చ‌ట్టబ‌ద్దంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. కొత్తగా ఎలాంటి భూముల‌ను త‌మ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చలేద‌ని స్పష్టం చేశారు. గ‌త ప్రభుత్వం నుంచి కొన‌సాగుతున్న చ‌ట్టప‌ర‌మైన సాంకేతిక చిక్కుల‌ను ప‌రిష్కరించి బాధితుల‌కు ఊర‌ట క‌లిగిస్తామ‌ని వివరించారు. మంగ‌ళ‌వారం హైదరాబాద్‌‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ‌రాష్ట్ర స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో 22/ పీఓబీ అంశంపై హైద‌రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మ‌ల్కాజ్‌గిరి, సంగారెడ్డి క‌లెక్టర్లు, జిల్లా స‌బ్‌రిజిస్ట్రార్లతో మంత్రి సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ భూముల రెగ్యుల‌రైజ్‌కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివ‌ర‌కు జారీచేసిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేక‌ర‌ణ ప్రొసీడింగ్స్, లే-అవుట్ల అనుమతులు తదితర వివ‌రాల‌తో కూడిన అన్ని డాక్యుమెంట్లనూ ఈనెల 14లోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. త‌ద్వారా ఫోర్జరీ డాక్యుమెంట్లకు చెక్ పె‌ట్టొచ్చని చెప్పారు. రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో స‌బ్ రిజిస్ట్రార్లకు స్పష్టత వ‌స్తుంద‌నీ, ఏది బోగ‌స్ డాక్యుమెంట్‌, ఏది నిజ‌మైన డాక్యుమెంట్ అనేదానిపై సూప‌ర్ చెక్ చేసుకోవ‌డానికి వీలుక‌లుగుతుందన్నారు. మరింత పారదర్శకత కోసం పహానీలు కూడా స‌బ్ రిజిస్ట్రార్‌కు అందుబాటులో ఉండేలా చ‌ర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చిన ద‌ర‌ఖాస్తుల్లో జెన్యూన్ ఉన్నవాటిని యుద్ధ ప్రాతిప‌దిక‌న ప‌రిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా ప్రజా కోణంలో ఆలోచించి కలెక్టర్లు నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఈ విషయంలో కలెక్టర్లు మరింత క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. “స‌మ‌స్య వ‌చ్చిన‌పుడు ప‌రిష్కరించే దానిక‌న్నా స‌మ‌స్య రాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉంద‌ని చెప్పారు. పీఓబీ ద‌ర‌ఖాస్తుల‌కు సంబంధించి కేస్‌బై కేస్ ప్రతి రోజూ స‌మీక్షించాలని సూచించారు. 22ఏ పేరిట ఉద్దేశ‌పూర్వకంగా పేదోడికి అర్హుల‌కు అన్యాయం చేసే విధంగా వ్యవ‌హ‌రిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.స‌బ్ రిజిస్ట్రార్లకు విచ‌క్షణాధి కారాలు ఉండొద్దనీ, అద‌న‌పు అధికారాలు వ‌ద్దని ఈ విష‌యంపై గ‌తంలోనే చాలా స్పష్టత ఇచ్చామని మంత్రి గుర్తు చేశారు. ఆన్‌లైన్‌లో ఏది ఉంటే దానికి ఆమోదం తెలిపేవ‌ర‌కే వారి అధికారాల‌ను ప‌రిమితం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తుల‌ను కాపాడే విష‌యంలో ఏమాత్రం రాజీప‌డే ప్రస‌క్తేలేదన్నారు. ఏ చిన్న త‌ప్పుచేసినా క్షమించేదిలేదనీ, క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామని అన్నారు. ఏదైనా స‌మ‌స్య ఉంటే జిల్లా స‌బ్ రిజిస్ట్రార్లు, క‌లెక్టర్ దృష్టికిగాని, ఐజీ దృష్టికి గాని తేవాలని సూచించారు. పీఓబీ జాబితాలో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేష‌న్‌ల‌ను గుడ్డిగా తిర‌స్కరించ‌కుండా మూడు రోజుల స‌మ‌యం తీసుకుని ఎందుకు తిర‌స్కరించాల్సి వ‌స్తుంద‌న్న వివ‌రాల‌ను తెలియ‌జేయాలని కోరారు. పీఓబీకి సంబంధించి వ‌చ్చిన ప్రతి ద‌ర‌ఖాస్తునూ ఇకనుంచి త‌హ‌శీల్దార్‌కు పంప‌కుండా నేరుగా క‌లెక్టర్‌కే పంపించాలని చెప్పారు.
కలెక్టర్ నుంచి జిల్లా రిజిస్ట్రార్, అక్కడి నుంచి కలెక్టర్ మధ్యనే ఉత్తర, ప్రత్యుత్తరాలు జరగాలన్నారు. గ‌తంలో నాన్ అగ్రిక‌ల్చర్‌, అగ్రిక‌ల్చర్‌, పీఓబీ జాబితాలు వేర్వేరుగా ఉండేవని వివరించారు. వాటిని స‌మీకృతం చేయ‌డం వ‌ల్ల స‌బ్ రిజిస్ట్రార్ ప‌రిశీల‌న‌లో కొన్ని ఆస్తులు, నిషేధిత జాబితాలో ఉన్నట్టు క‌నిపిస్తున్నందున మొత్తం రిజిస్ట్రేష‌న్ ఆపుతున్నార‌ని ఫిర్యాదులు వ‌స్తున్నాయని అన్నారు. తాజాగా అప్‌లోడ్ చేస్తున్న స‌మాచారంతో స‌రిపోల్చుకొని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ రోజు సాయంత్రంలోగా నాలుగు జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించి ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వారికి తెలియజేయాలని కోరారు. తక్షణం అమలుచేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్ శాఖ ఐ‌జీని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డిఎస్ లోకేశ్ కుమార్, స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్ ఐ‌జీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -