Wednesday, August 12, 2026
E-PAPER
Homeఖమ్మంవిగ్రహాల్లోనూ కుల అస్థిత్వం!

విగ్రహాల్లోనూ కుల అస్థిత్వం!

- Advertisement -

– ప్రతీ కులానికీ ఓ మహనీయుడి విగ్రహం..
– వాట్సాప్‌ గ్రూపుల్లో కుల ప్రేరేపణలు
– విగ్రహాలు నిలయంగా మూడు రోడ్ల కూడలి
– సంఘ బాధ్యులు, విశ్రాంత ఉద్యోగుల చొరవ పై విస్త్రుత చర్చ
నవతెలంగాణ – అశ్వారావుపేట

మహనీయులు ఏ కులంలో పుట్టినా.. ఏ మతానికి చెందిన వారైనా.. వారి ఆలోచనలు, పోరాటాలు, సేవలు ఒక కులానికో, మతానికో పరిమితం కాలేదు.సంఘ సంస్కర్తలు,సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు,మేధావులు,శాస్త్రవేత్తలు సమాజం బహుళ ప్రయోజనాల కోసం, సమానత్వం కోసం చేసిన కృషి కారణంగానే నేటికీ ప్రజల హృదయాల్లో నిలిచారు. అయితే వారి పేరుతో ఏర్పాటు చేస్తున్న విగ్రహాలు మాత్రం క్రమంగా కులాల వారీ అస్థిత్వ ప్రదర్శనకు వేదికలుగా మారుతున్నాయన్న చర్చ అశ్వారావుపేటలో సాగుతోంది.

నాడు సమాజాన్ని ఏకం చేసిన మహనీయుల విగ్రహాలు.. నేడు కుల సంఘాల ఉనికి, రాజకీయ ప్రాధాన్యత, సామాజిక గుర్తింపు కోసం ఉపయోగపడుతున్నాయా.? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్‌ గ్రూపుల్లో ఆయా సామాజిక వర్గాలకు చెందిన మహనీయుల విగ్రహాల ఏర్పాటుపై జరుగుతున్న చర్చలు ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

నాటి నుంచి విగ్రహాల ఏర్పాటు:
అశ్వారావుపేటలో సుమారు నాలుగు దశాబ్దాల క్రితమే మూడు రోడ్ల ప్రధాన కూడలిలో కెమిలాయిడ్స్‌ సంస్థ, వివేకానంద వికాస తరంగిణి భాగస్వామ్యంతో స్వామి వివేకానంద భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధాన ద్వారం వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం, అశ్వారావుపేట పూర్వ ప్రధాన గ్రామంలో మహాత్మాగాంధీ విగ్రహం, కామాయ్యపాలెం రోడ్డులో పొట్టి శ్రీరాములు, నాటి పంచాయతీ కార్యాలయ రోడ్డులో భగత్‌సింగ్‌ విగ్రహాలను ఏర్పాటు చేశారు.

తర్వాత మూడు రోడ్ల ప్రధాన కూడలిలో నటసార్వభౌమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను రాజకీయ పార్టీలు ఏర్పాటు చేశాయి. అనంతరం బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలు ఏర్పాటయ్యాయి. ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ విగ్రహం, రింగ్‌ రోడ్డులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అప్పటి టీఆర్‌ఎస్‌ నాయకులు ఏర్పాటు చేశారు.

పునర్నిర్మాణ పనులతో కొత్త చర్చ..
ప్రస్తుతం అశ్వారావుపేటలో సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్‌ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా అంబేద్కర్‌, పొట్టి శ్రీరాములు, భగత్‌సింగ్‌ విగ్రహాలను పునర్నిర్మిస్తున్నారు. ఇదే సమయంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన సంఘాల నుంచి తమ కులానికి చెందిన మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలు తెరపైకి వస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుండగా.. ఆదివాసీ నాయకుడు కొమరం భీం విగ్రహాన్ని అటవీ, ఆదివాసీ, గిరిజన వర్గాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఇటీవల మంత్రి సీతక్క, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు.

మరిన్ని విగ్రహాలకు సన్నాహాలా?:
ప్రజా యుద్ధనౌక గద్దర్‌, సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌, చాకలి ఐలమ్మ తదితరుల విగ్రహాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలు ఆయా సామాజిక వర్గాల్లో సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని వాట్సాప్‌ సమూహాల్లో ఈ అంశాలపై చర్చలు, సందేశాలు జరుగుతున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. దీంతో అశ్వారావుపేట లోని ప్రధాన కూడళ్లు, రహదారులు భవిష్యత్తులో మరిన్ని విగ్రహాలకు నిలయాలుగా మారతాయా? 

అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మహనీయుల స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విగ్రహాలు ఏర్పాటు చేయడం ఒక అంశమైతే..  వాటిని కేవలం కుల అస్థిత్వ ప్రదర్శనకు పరిమితం చేయడం మరో అంశమని సామాజిక పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ తల్లి.. జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలపై చర్చ
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి కొత్త రూపాన్ని పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో అశ్వారావుపేట లోనూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కొత్త రూపంలోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది.

అదేవిధంగా దేశ తొలి ఉపప్రధాని, కేంద్ర మాజీ మంత్రి, దళిత నేత బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన మాదిగ సామాజిక వర్గానికి చెందిన కొందరిలో ఉన్నట్లు తెలుస్తోంది.అశ్వారావుపేట, పేరాయిగూడెం పంచాయతీల్లో గతంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నార్లపాటి పిచ్చయ్య, నార్లపాటి సత్యవతి, నార్లపాటి సుమతి,నండ్రు జయభారతి,కొక్కెరపాటి పుల్లయ్య సర్పంచులుగా ఎన్నిక కావడం, ప్రస్తుతం మున్సిపల్‌ కౌన్సిలర్లుగా నార్లపాటి మహేష్ , నార్లపాటి దివాకర్, నార్లపాటి మౌనిక, కో – ఆప్షన్ సభ్యురాలు గా తగరం నిర్మల మాదిగ వర్గానికే చెంది ఉండటంతో జగ్జీవన్‌రామ్‌ విగ్రహ ఏర్పాటుకు సామాజికంగా, రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుందన్న చర్చ సాగుతోంది.

మహనీయుల స్ఫూర్తి..కులాల పోటీగా మారొద్దు..
సమాజ మార్పు కోసం జీవితాలను అర్పించిన మహనీయులందరి ఆలోచనల్లో ప్రధానంగా కనిపించేది సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం. వారి విగ్రహాలు ప్రజలకు ఆ స్ఫూర్తిని అందించాల్సినవి. కానీ ఒకరి తర్వాత మరొకరు తమ సామాజిక వర్గానికి చెందిన నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం పోటీగా మారితే.. అది మహనీయుల ఆశయాలకు భిన్నమైన పరిణామంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విగ్రహాలు పెరగడం కంటే.. వాటి ద్వారా సమాజంలో సమానత్వం, సామాజిక చైతన్యం, ప్రజాస్వామ్య విలువలు పెరగడం ముఖ్యమన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరి అశ్వారావుపేటలో ఈ విగ్రహాల పరంపర ఎక్కడికి దారితీస్తుందో?  ఇంకా ఎన్ని విగ్రహాలు రూపుదిద్దుకోనున్నాయో? వేచి చూడాల్సిందే మరి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -