Wednesday, August 12, 2026
E-PAPER
Homeఖమ్మంఎస్టీ విద్యార్థులకు హాస్టళ్ళ కొరత

ఎస్టీ విద్యార్థులకు హాస్టళ్ళ కొరత

- Advertisement -

– నిధుల మంజూరులో సాంకేతిక అడ్డంకులు.. 
– అరకొర సౌకర్యాలతో విద్యార్థుల అవస్థలు
నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలు ఉన్నప్పటికీ విద్యార్థులకు అవసరమైన వసతి సౌకర్యాలు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి ఇంటర్‌, డిగ్రీ విద్యను అభ్యసించేందుకు వచ్చే పేద, మధ్యతరగతి, దళిత, గిరిజన విద్యార్థులకు కళాశాలలు అందుబాటులో ఉన్నా.. పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లు లేకపోవడంతో ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు.

అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనంలోనే డిగ్రీ కళాశాల కూడా కొనసాగుతుండటం ఒకవైపు అసౌకర్యంగా ఉండగా, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు వసతి సౌకర్యం లేకపోవడం మరో సమస్యగా మారింది. బాలికలకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌ ఉన్నప్పటికీ, బాలురకు ప్రత్యేక వసతి గృహం లేకపోవడంతో మారుమూల ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్థులు చదువులు కొనసాగించలేకపోతున్నారని సమాచారం.

ఎస్సీ హాస్టల్‌లో తాత్కాలికంగా నిర్వహణ:
బూర్గంపాడులో మూతపడిన సోషల్‌ వెల్ఫేర్‌ పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌ను అశ్వారావుపేటకు బదిలీ చేసి, ప్రస్తుతం ఎస్సీ బాలుర వసతి గృహంలో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ అరకొర సౌకర్యాల మధ్య విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. హాస్టల్‌ ఎస్సీ విభాగానికి చెందినది కాగా, ఇక్కడ వసతి పొందుతున్న విద్యార్థుల్లో అత్యధికులు ఎస్టీ కేటగిరీకి చెందినవారు కావడంతో స్కాలర్‌షిప్‌లు, ఇతర నిధుల మంజూరులో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు.

ప్రత్యేక హాస్టల్‌ నిర్మించాలని డిమాండ్‌:
గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలురు కోసం ప్రత్యేకంగా ఎస్టీ పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌ మంజూరు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. కళాశాలలకు సమీపంలోనే శాశ్వత భవనం నిర్మించి, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సాంకేతిక సమస్యలను పరిష్కరించి, ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పీఎంహెచ్‌ మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -