– ఆస్పత్రిలో సమూల మార్పు
– గిరిజనుల ఆరోగ్యానికి సంజీవనిలా మారుతున్న ఆస్పత్రి
– శరవేగంగా 100 పడకల నూతన భవన నిర్మాణానికి చర్యలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఒకప్పుడు ఇద్దరు వైద్యులు,పరిమిత పడకలతోనే వైద్య సేవలు అందించిన అశ్వారావుపేట సామాజిక ఆస్పత్రి.. నేడు 50 పడకల స్థాయికి చేరుకుని గిరిజన, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. రెగ్యులర్ వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో పాటు గైనకాలజీ, ప్రసవాలు, అత్యవసర వైద్యం, ఆపరేషన్ థియేటర్, టిఫా స్కానింగ్, ల్యాబొరేటరీ, ఎక్స్‌రే, మందులు, బ్లడ్ స్టోరేజ్ వంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసి 100 పడకల నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
నాడు ఇద్దరు వైద్యులు.. నేడు నిపుణుల వైద్యుల బృందం..
గతంలో ఆస్పత్రిలో కేవలం ఇద్దరు వైద్యులతో పరిమిత సేవలు అందేవి. ప్రస్తుతం రెగ్యులర్ వైద్యులు, సరిపడా నర్సింగ్ సిబ్బంది అందుబాటులోకి రావడంతో వైద్య సేవలు బలోపేతమయ్యాయి. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేక చొరవతో సర్జన్, ఎండీ జనరల్, పిల్లల వైద్యులు కొత్తగా విధుల్లో చేరారు. మరో ఎనిమిది మంది నర్సింగ్ సిబ్బంది కూడా కొత్తగా విధుల్లో చేరారు. దీంతో అత్యవసర కేసులకు సైతం మెరుగైన వైద్యం అందించే అవకాశం ఏర్పడింది.
నాడు ప్రసూతి సేవలు లేవు.. నేడు సురక్షిత ప్రసవాలు
గతంలో గర్భిణులకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని కొత్తగూడెం రామవరం ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఆస్పత్రిలో గైనకాలజీ సేవలు అందుబాటులోకి రావడంతో స్థానికంగానే వైద్య పరీక్షలు, ప్రసవాలు నిర్వహిస్తున్నారు. గైనిక్ సేవలు ప్రారంభమైన తర్వాత ఒక్క నెలలోనే 52 వరకు ప్రసవాలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. గర్భిణులకు అవసరమైన టిఫా స్కానింగ్‌ను ఉచితంగా అందిస్తుండటంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గింది.
నాడు ఆపరేషన్ థియేటర్ లేదు.. నేడు శస్త్రచికిత్సలు..
గతంలో ఆపరేషన్ థియేటర్ లేక అత్యవసర శస్త్రచికిత్సల కోసం రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి రావడంతో అవసరమైన శస్త్రచికిత్సలను స్థానికంగానే నిర్వహించే సామర్థ్యం పెరిగింది.
నాడు డయాలసిస్ లేదు.. నేడు సేవలు..
డయాలసిస్ అవసరమైన రోగులు గతంలో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆస్పత్రి సేవల విస్తరణలో భాగంగా డయాలసిస్ సేవలు అందుబాటులోకి రావడం ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారింది.
నాడు స్కానింగ్ లేదు.. నేడు టిఫా స్కానింగ్..
గతంలో స్కానింగ్ కోసం ప్రైవేట్ కేంద్రాలు, దూర ప్రాంతాలపై ఆధారపడాల్సి వచ్చేది. ప్రస్తుతం టిఫా స్కానింగ్ సేవలు ఉచితంగా అందుబాటులో ఉండటంతో ముఖ్యంగా గర్భిణులకు ప్రయోజనం కలుగుతోంది.
నాడు పరిమిత పడకలు.. నేడు 50.. రేపు 100..
పెరుగుతున్న రోగుల రద్దీ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 100 పడకల నూతన ఆస్పత్రి భవన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరో 3–4 నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. నూతన భవనం అందుబాటులోకి వస్తే మరిన్ని వైద్య విభాగాలు, ఆధునిక పరికరాలు, అదనపు పడకలు, మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి.
అత్యవసర కేసులకు తక్షణ వైద్యం…
పాముకాటు, విషపదార్థాల ప్రభావం, ప్రమాదాల్లో గాయాలు వంటి అత్యవసర కేసులకు ఆస్పత్రిలో తక్షణ వైద్యం అందిస్తున్నారు. 24 గంటలూ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ల్యాబొరేటరీ, ఎక్స్‌రే, మందులు, బ్లడ్ స్టోరేజ్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ.. మంత్రి సహకారం…
ఆస్పత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది, మౌలిక వసతులు, వైద్య సేవల విస్తరణపై అధికారులతో సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారం ఆస్పత్రి అభివృద్ధికి కీలకంగా నిలుస్తోంది.
జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ ఆసుపత్రి సేవలపై పర్యవేక్షణ చేస్తూ వైద్యులు, సిబ్బంది అందుబాటు, మౌలిక వసతులు, వైద్య సేవలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య యంత్రాంగం సమన్వయంతో పాటు డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జి. రవిబాబు చొరవతో ఆస్పత్రి సేవలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రజల నమ్మకానికి ప్రతీకగా..
ఇద్దరు వైద్యులతో పరిమిత సేవల నుంచి రెగ్యులర్ వైద్యుల బృందం వరకు..
పరిమిత పడకల నుంచి 50 పడకల వరకు..
ప్రసూతి సేవలు లేని స్థాయి నుంచి గైనిక్ సేవలు, సురక్షిత ప్రసవాల వరకు…
ఆపరేషన్ థియేటర్ లేకపోవడం నుంచి శస్త్రచికిత్సల సదుపాయం వరకు..
స్కానింగ్ అందుబాటులో లేకపోవడం నుంచి ఉచిత టిఫా స్కానింగ్ వరకు ఆస్పత్రి సేవల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. 100 పడకల నూతన భవనం పూర్తయితే ఈ సేవలు మరింత విస్తరించనున్నాయి. దీంతో అశ్వారావుపేట ఏజెన్సీ ప్రాంత ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్యం అందించే అవకాశం మరింత పెరగనుంది.



