కాంగ్రెస్‌ది దుర్మార్గ పాలన

కాంగ్రెస్‌ది దుర్మార్గ పాలన–  గజ్వేల్‌ నియోజకవర్గ ప్రజాపాలన కార్యక్రమంలో..: మాజీ సీఎం, ఎమ్మెల్యే కేసీఆర్‌ ఫోటో లేదని సర్పంచ్‌ విజయవర్ధన్‌ రెడ్డి ధ్వజం
నవతెలంగాణ-గజ్వేల్‌
ప్రజాపాలన పేరిట ప్రొటోకాల్‌ పాటించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం దుర్మార్గమైన పరాకాష్ట పాలన సాగిస్తుందని గజ్వేల్‌ మండలం బూరుగుపల్లి సర్పంచ్‌ ఒంటేరు విజయవర్ధన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం బూరుగుపల్లి గ్రామంలో అధికారులు మంగళవారం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫొటో లేకుండా కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని సంబంధిత అధికారులను సర్పంచ్‌ నిలదీశారు. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అధికారులు, సర్పంచ్‌కు మధ్య వాగ్వివాదం జరిగింది. ప్రజాపాలనలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పటికీ గజ్వేల్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా, రెండుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కెేసీఆర్‌ ఫొటో బ్యానర్‌పై లేకుండా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తే సహించేది లేదన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌, అధికారులు వివరణ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అంటే హుందాగా ఉండాలన్నారు. 6 గ్యారంటీల పేరిట ప్రజలను గారడీ చేస్తుందని విమర్శించారు. పథకాలు అమలు చేసేవారు ప్రజలకు నానా ఇబ్బందులు పెట్టడమేమిటని ప్రశ్నించారు. పథకాల అమలు కోసం గతంలో కేసీఆర్‌ ఒకరోజు సర్వే చేశారని గుర్తు చేశారు. కాలయాపన చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు.

Spread the love