శరీరమంతా కత్తి పోట్లే ..
నిందితుల కోసం ఐదు పోలీస్ బృందాల గాలింపు
నవతెలంగాణ- కొండమల్లేపల్లి
ప్రయివేట్ పాఠశాల ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన బుధవారం నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన కల్లు రూపా, రాజేందర్ రెడ్డి, గాదే జార్జిరెడ్డి, రాణి రెడ్డి కలిసి 26 ఏండ్ల నుంచి జేబీ హిల్స్ కాలనీలో నాగార్జున హైస్కూల్‌ను నడుపుతున్నారు.
గత శుక్ర, శని, ఆదివారం పాఠశాలకు సెలవు రావడంతో ప్రిన్సిపాల్ రూపారెడ్డి, భర్త రాజేందర్ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసానికి వెళ్లారు. తిరిగి ఆమె ఈనెల 11వ తేదీన మంగళవారం ఉదయం రూపారెడ్డి పాఠశాలకు రాగా, రాజేందర్ రెడ్డి పని నిమిత్తం హైదరాబాద్‌లోనే ఉండిపోయాడు. ప్రతిరోజూ ఆమె సాయంత్రం 7గంటల వరకు పాఠశాలలోనే ఉండేవారు. కానీ మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకే పట్టణంలోని ఇంటికి బంధువులు వస్తున్నారని చెప్పి వెళ్లింది. మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి రూపారెడ్డిపై కత్తితో అతి దారుణంగా దాడి చేసి తలను గోడకేసి కొట్టి హత్య చేశారు. భర్త రాజేందర్ రెడ్డి బుధవారం ఉదయం ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ రావడంతో పై ఫ్లోర్లో అద్దెకు ఉంటున్నవారికి సమాచారం ఇచ్చాడు. వారు కిందికి వచ్చి డోర్ కొట్టినా స్పందన లేకపోవడంతో తిరిగి ఆయనకు విషయం చెప్పారు.
వెంటనే భర్త రాజేందర్ రెడ్డి ఇంటి పక్కల ఉన్న చింతపల్లి ఎస్ఐ అజ్మీర్ రమేష్ కు సమాచారం ఇచ్చాడు. ఆయన స్థానికులతో కలిసి ఇంటి డోర్ తెరిచి చూడగా రూపా రెడ్డి రక్తపు మడుగులో పడి విగతజీవిగా కనిపించింది. వెంటనే ఆమె భర్తకు తెలియజేశారు. ఘటన స్థలంలో దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ నవీన్ కుమార్, ఎస్ఐ అజ్మీర రమేష్ పరిశీలించారు. డాగ్స్, క్లూస్ టీం లను రప్పించి ఆధారాలు సేకరించారు.
సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు అభినవ్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు దేవరకొండ డీఎస్పీ ఆధ్వర్యంలో నిందితుల ఆచూకీ కోసం జిల్లా సీసీఎస్ పోలీస్ టీం ఐదు బృందాలతో వెతుకుతున్నట్టు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు.
ప్రయివేట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



