కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కృష్ణా జలాలను ఉభయ తెలుగు రాష్ర్టాలకు న్యాయంగా పంపిణీ చేయాలనీ, ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణా జలాల వివాద పరిష్కారం కోసం 2004లో ఏర్పాటు చేసిన జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించకుండా ఇప్పటికీ వాయిదాలతో కాలయాపన చేయడం అన్యాయమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నాలుగో రాష్ట్రంగా ఏర్పడి ట్రిబ్యునల్‌లో చేరి పిటిషన్ వేసినప్పటికీ కృష్ణా జలాల్లో 32 శాతానికి మించి దక్కలేదని గుర్తుచేశారు. ఏపీ మాత్రం 68 నుంచి 70 శాతం నీటిని వాడుకుంటున్నదని తెలిపారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగా తెలంగాణకు 555 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 256 టీఎంసీలు (68.50:31.50 నిష్పత్తి) కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నదని పేర్కొన్నారు. కల్వకుర్తికి 44 టీఎంసీలు, నెట్టెంపాడుకు 22 టీఎంసీలు, భీమా-1, భీమా-2కు 20 టీఎంసీలు, కోయిల్‌సాగర్‌కు 8 టీఎంసీలు, కొడంగల్ ఎత్తిపోతలకు 10 టీఎంసీలు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత లకు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 120 టీఎంసీలను పరి గణనలోకి తీసుకుని కేటాయించాలని కోరారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అన్ని పార్టీల సహకా రంతో చర్చల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన వాటాను న్యాయంగా సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య మానవ సంబంధాలపై జలాల పంపిణీ వివాదం తీవ్ర ప్రభావం చూపకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. ట్రిబ్యునల్‌పై ఒత్తిడి తీసుకొచ్చి పరివాహక ప్రాంత ప్రాతి పదికన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల మధ్య శాస్త్రీయంగా, న్యాయం గా పంపిణీ చేసేలా కేంద్రం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.



