Thursday, August 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసర్వర్‌ డౌన్‌..లాగిన్ అవ్వదు

సర్వర్‌ డౌన్‌..లాగిన్ అవ్వదు

- Advertisement -

పౌరసేవలకు అంతరాయం ​‌మీ-సేవలకు నాసిరకం కిట్ల పంపిణీ
ఒక్క పనికి గంటల కొద్దీ ఎదురుచూపులు
వినియోగదారులకు తప్పని తిప్పలు
సర్వర్‌ ‌డౌన్‌‌తో లాగిన్‌ ‌కాని పరిస్థితి
పెరగని కమీషన్లు.. పని ఒత్తిడితో ఇబ్బందులు
వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్వాహకుల వినతి

నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
పౌర సేవలందించే మీ సేవ కేంద్రాలను ‘‘సర్వర్‌ ‌డౌన్‌’’ సమస్య వెంటాడుతోంది. తరచూ సర్వర్‌ ‌సమస్యలు తలెత్తడంతో లాగిన్‌ అవ్వడం వీలుకాని పరిస్థితి. దీని వల్ల ధ్రువ పత్రాలు, బిల్లుల చెల్లింపులు, ఇతర పౌర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ఒక్క ట్రాన్సాక్షన్‌‌కు గంటల సమయం పడుతుండడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ధ్రువ పత్రాలు సకాలంలో పొందలేక కొన్ని సార్లు దరఖాస్తు చేసే గడువు ముగిసి నష్టపోతున్న పరిస్థితులూ ఉన్నాయి. మరోపక్క ప్రజలకు సేవలందిస్తున్న మీ సేవ ఆపరేటర్లకు ప్రభుత్వం నుంచి తగిన సాకారం అందట్లేదన్న ఆవేదన వారిలో ఉంది. కమిషన్ పెంచకపోవడం, ఉచిత విద్యుత్‌, నాణ్యమైన కిట్ల పంపిణీ, పహానీ, చౌఫసలా మ్యాన్యూవల్‌ ‌కాకుండా మీ సేవలకు అప్పజెప్పడం వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలించాలని కోరుతున్నారు. కుటుంబ అడ్రస్సులతో కూడిన గుర్తింపు కార్డులు అందించే బాధ్యతను ప్రభుత్వం మీసేవలకే అప్పగించిన విషయం తెలిసిందే. దీనివల్ల వీరిపై మరింత భారం పడే అవకాశం ఉంది. ప్రతి ఒక్క పనిని మీసేవలకే అప్పగించడంతో పని భారం పెరిగి నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో 4900 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. వీటితోపాటు పల్లె సమగ్ర సేవలు అందించేవి 600, ప్రభుత్వ పరిధిలో పనిచేసేవి 110 కలిపి మొత్తం 5610 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. వీటిని 23,000 మంది మీసేవ ఆపరేటర్లు నిర్వహిస్తున్నారు. వీరిపై కుటుంబ సభ్యులు లక్ష మంది వరకు ఆధారపడి జీవిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 80 మీ సేవ కేంద్రాలుండగా వనపర్తి జిల్లాలో 53, గద్వాలలో 48, నారాయ ణపేటలో 46, మహబూబ్‌నగర్‌లో జిల్లాలో 110 వరకు ఉన్నాయి. మీసేవ కేంద్రాల ద్వారా ఆదాయ, కుల, నివాస, బర్త్, డెత్‌, లోకల్‌ వంటి ధ్రువీకరణ పత్రాలతో పాటు భూముల క్రయవిక్రయాలు, బిల్లుల చెల్లింపుల పనులకు సంబంధించిన సేవల్ని అందిస్తారు.

తరచూ సర్వర్‌ ‌సమస్యలు
మీ సేవ కేంద్రాల్లో తరచూ సర్వర్ మొరాయించడంతో అక్కడికి వచ్చే వినియో గదారులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. సర్వర్‌ ‌స్లోగా ఉండడం, తరచూ హ్యాంగ్‌ అవడం, మధ్యలో కనెక్షన్‌ ‌కట్‌‌కావడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక పని చేయడానికి 10 నుంచి 15 నిమిషాలకు బదులు గంటల సమయం పడుతోంది. దీంతో వివిధ సేవల కోసం వచ్చే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుకు 30 వరకు ఆధార్‌ ‌నమోదు, చేర్పులు, మార్పుల ట్రాన్సాక్షన్స్ జరిగేవి. సర్వర్‌ ‌సమస్య వల్ల ప్రస్తుతం ఐదారు ఆధార్‌ పనులు కూడా చేయలేకపోతున్నామని చెబుతున్నారు. తరచూ మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సి రావడంతో వినియోగదారులు సైతం ఆపరేటర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కుల ధ్రువీకరణ పత్రంలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు మీ సేవ కేంద్రం నిర్వాహకులకే ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కొంతకాలంగా వినియోగదారులతో పాటు నిర్వాహకులు కోరుతున్నారు. అయితే మీసేవ సర్వీసులకు సిటిజన్ లాగిన్ ఇవ్వడం వల్ల ఎవరికి వారు ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడుతుండటంతో భూభారతిలో తరచుగా అక్రమాలు జరుగుతున్నాయనే చర్చ ఉంది. భూభారతి సర్వీస్ లను సిటిజన్ చార్ట్ నుంచి తొలగించి మీసేవ కేంద్రాల నిర్వహణకు అప్పజెప్పడం ద్వారా పారదర్శకంగా సర్వీ సులు ప్రజలకు లభిస్తాయని అంటున్నారు. తమకు కూడా ఇబ్బందులు తప్పుతాయని వారు చెబుతున్నారు.

​నాసిరకం కిట్లతో తిప్పలు
మీసేవ కేంద్రాల నిర్వాహకులకు ఆధార్‌ ‌ఎన్‌‌రోల్‌‌మెంట్‌ ‌చేసే అవకాశం ఇచ్చారు. ఇందు కోసం ఆపరేటర్ల నుంచి రూ. 1.50 లక్షలు డిపాజిట్‌గా తీసుకుని నాణ్యతలేని కిట్లను మీసేవ నిర్వాహకులకు అంట కట్టారు. ఆ కిట్లు సరిగా పనిచేయకపోవడం వల్ల ఆధార్ ఎన్‌‌రోల్‌‌మెంట్‌ ప్రక్రియలో తీవ్రమైన ఆలస్యం జరుగుతోంది. రోజుకు 20 నుంచి 30 మందికి ఆధార్ సర్వీసులు అందించే క్రమం నుంచి రోజుకు ఐదు నుంచి పదిమందికి మాత్రమే ఆధార్ సర్వీస్ లను అందించే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ కార్యాలయాలలో స్థలాభావం వల్ల కాంపౌండ్ పరిధిలో సొంతంగా కంటైనర్ వేసుకోవాల్సి వస్తోంది. ఈ కంటైనర్ల తయారీ కోసం కనీసం రూ.2 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధార్ కేంద్రాలను మీసేవ కేంద్రాలలోనే ఏర్పాటు చేస్తే ప్రజలకు, నిర్వాహకులకు ఆర్థిక భారం తగ్గి వేగవంతంగా సేవలు అందే అవకాశముంది.

పెరగని కమీషన్‌.. అందని ఉచిత విద్యుత్‌
ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా మీసేవ ద్వారా సేవలందిస్తున్న ఆపరేటర్లకు కమీషన్‌ ‌పెంచాలనే డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం ఇస్తున్న కమీషన్‌ ‌పెరిగే ధరలకు సరిపోవడంలేదని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్‌ ‌బిల్లులు, నెట్‌ ‌చార్జీలు పెరగడం వల్ల నిర్వహణ భారం పడుతుందని చెబుతున్నారు. పట్టణ, మండల కేంద్రాల్లో ప్రధాన కూడలిలో మీసేవ పెట్టాల్సి రావడంతో అద్దెలు కూడా తరచూ పెంచుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం మీసేవ కేంద్రాలకు ఉచిత కరెంట్‌ ‌సరఫరా చేయాలనీ, కమీషన్‌ ‌పెంచాలనీ, ఉచిత వైద్య సేవలు అందించేందుకు హెల్త్ కార్డులు ఇవ్వాలనీ, పహానీ, చౌఫసలా మ్యాన్యూవల్‌‌గా కాకుండా మీసేవలకు అప్పజెప్పి డిజిటలైజ్‌ ‌చేయాలని ఆపరేటర్లు కోరుతున్నారు.

​వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది ఆధారపడి జీవిస్తున్న మీసేవ కేంద్రాలను నిర్వహించే వారి సంక్షేమం కోసం ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. కమీషన్లు పెంచి నిర్వహణ భారం తగ్గేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇప్పటి వరకు 50శాతం కమీషన్ పెంచింది. మిగతా 50 శాతం పెంచి సాంకేతిక సిబ్బందిని ఆదుకోవాలి. ప్రధానంగా సర్వర్ డౌన్ వంటి సాంకేతిక సమస్యలను పరిష్కరించాలి.
బౌర శంకర్, తెలంగాణ మీసేవ సంఘాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -