Thursday, August 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‘ఉపాధి’ టెన్యూర్ సిబ్బందికి జీతాలు బంద్

‘ఉపాధి’ టెన్యూర్ సిబ్బందికి జీతాలు బంద్

- Advertisement -

3 నెలలుగా ఎదురు చూపులు
వాటా చెల్లించని కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామన్నా ఒప్పుకోని వైనం
 ఇబ్బందుల్లో 3,800 మంది ఉద్యోగులు
​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

ఉపాధిహామీ చట్టం ద్వారా రాష్ట్రంలో నియమితులైన ఫిక్స్ డ్ టెన్యూర్ ఉద్యోగులు 3 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వీబీ గ్రామ్ జీ కొత్త చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాను 60:40 శాతంగా నిర్ణయించారు. అయితే కేంద్రం తన వాటా చెల్లించనందున 3,800 మంది ఉద్యోగుల జీతాలు నిలిచి పోయాయి. ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా జీతాలు చెల్లించి, అనంతరం ఆ మొత్తాన్ని రీయింబర్స్ చేసుకునే ప్రతిపాదన చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఫలితంగా ఫిక్స్ డ్ టెన్యూర్ ఉద్యోగుల జీతాలు ఆగిపోయాయి. ఉపాధి హామీ పథకంలో పని చేసేందుకు ఏపీఓ, టీఏ తదితర క్యాడర్లలో 2006లో రాష్ర్టంలో వీరిని డిస్ర్టిక్‌ ‌సెలక్షన్‌ ‌కమిటీ (డీఎస్‌‌సీ) ద్వారా అప్పటి రాజశేఖర్‌ ‌రెడ్డి ప్రభుత్వం భర్తీ చేసింది. రెండేండ్ల కాంట్రాక్ట్‌ ‌పద్దతిన 3,800 మంది ఉద్యోగులను నియమించారు. ఆ తర్వాత సొసైటీ ఫర్‌ ‌రూరల్‌ ‌డెవలప్‌‌మెంట్‌ ‌పథకం కింద హెచ్‌ఆర్‌ ‌పాలసీ తీసుకొచ్చి వారిని కంటిన్యూ చేస్తూ వచ్చింది. దాదాపు 20 ఏండ్ల నుంచి ఈ విభాగంలో ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా వీరు పని చేస్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్‌ ఉపాధి హామీ‌ని కాస్త వీబీ గ్రామ్‌ ‌జీ పథకంగా మార్చినప్పటి నుంచి తన వాటా చెల్లించడం లేదు. ఫలితంగా ఈ విభాగంలో పని చేస్తున్న టెన్యూర్‌ ఉద్యోగుల జీతాలు ఆగి పోయాయి.
అమలు కాని పే స్కేల్….
ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫిక్స్ డ్ టెన్యూర్ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయడంతో పాటు వారి సమస్యలన్ని పరిష్కరిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొంది. మూడేండ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చొరవ చూపలేదు. పే స్కేల్‌ అమలు చేస్తే ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.2.5కోట్ల చొప్పున ఏడాదికి రూ.30 కోట్ల అదనపు భారం మాత్రమే పడుతుంది.
ఇబ్బందులు పడుతున్నాం: ఉద్యోగులు
జీతాలు సకాలంలో రాక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఈఎంఐలు, ఇంటి అద్దెలు సమయానికి చెల్లించలేక పోతున్నాం. చాలా మంది ఉద్యోగుల సిబిల్‌ ‌స్కోర్‌ ‌పడిపోయింది. బ్యాంకుల తోపాటు ఏ ప్రయివేట్‌ ‌ఫైనాన్స్‌‌లు కూడా అప్పులు ఇవ్వడానికి జంకుతున్నాయి. కేంద్రం వాటా సకాలంలో చెల్లించక పోయినా రాష్ర్ట ప్రభుత్వం పే స్కేల్‌ అమలు చేయడంతో పాటుక్యాడర్ స్ట్రెంత్ ఖరారు, బదిలీల విధానం, 2011 ధరల ప్రకారం నిర్ణయించిన ట్రావెలింగ్‌ అలవెన్స్‌‌ను రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచాలి. రాబోయ నాలుగు నుంచి ఐదు సంవత్సరాల్లో పలువురు ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నందున ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం కూడా క్రమంగా తగ్గుతుంది. వీబీ గ్రామ్‌ ‌జీ పథకంలో పని చేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లకు రూ.5 వేల ప్రత్యేక అలవెన్స్‌ ఇవ్వాలి.
కేంద్రం వల్లే జాప్యం : సీతక్క
కేంద్ర ప్రభుత్వం తన వాటా చెల్లించనందున గత మూడు నెలలుగా ఫిక్స్‌ ‌టెన్యూర్‌ ఉద్యోగుల జీతాలు నిలిచి పోయాయి. ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా జీతాలు చెల్లించి, అనంతరం ఆ మొత్తాన్ని తీసుకునే ప్రతిపాదన చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ కారణంగానే జీతాల విడుదలలో జాప్యం జరుగుతోంది. రాష్ర్ట ప్రభుత్వం వారికిచ్చిన హామీలన్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోంది. ఇప్పటికే వారికి ప్రమాద బీమా (ఆక్సిడెంటల్ ఇన్సూరెన్స్) పథకాన్ని వర్తింపజేస్తున్నాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -