ప్రజల్లో అవగాహన పెంచాలి :
ఎయిడ్స్‌పై అవగాహనా ర్యాలీలో మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రాన్ని హెచ్‌ఐవీ రహిత తెలంగాణగా తీర్చిదిద్దటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు. ఎయిడ్స్, సిఫిలిస్‌పై విస్తృత అవగాహన ప్రచార కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్‌లో ప్రసాద్ ఐమాక్స్ సమీపంలో హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో ఆయన ప్రారంభించారు. బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం 25కి పైగా ఆటోలతో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1600 మందికిపైగా నర్సింగ్, వైద్య కళాశాలల విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, పలు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, టార్గెటెడ్ ఇంటర్వెన్షన్, లింగ్ వర్కర్ స్కీమ్ ప్రాజెక్టుకు చెందిన వారు పాల్గొన్నారు. మొబైల్ ఐసీటీసీ వాహనాల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రితో పాటు ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్. చోంగ్తూ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కన్నన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డా. రవీంద్ర నాయక్, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ముకుంద రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ కె.విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సకాలంలో హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవడం, ముందస్తుగా గుర్తించడం, సరైన వైద్య సలహాలు పొందడం, సకాలంలో చికిత్స తీసుకోవడం వ్యాధి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఎయిడ్స్ బారిన పడిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని సూచించారు. మానవతా దృక్పథంతో సహాయ సహకారాలను అందించాలని కోరారు. కె.విద్యాసాగర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో హెచ్‌ఐవీ నివారణ, పరీక్షలు, చికిత్సకు సంబంధించి అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలపై వివరించారు. 2025-26 జాతీయ స్కోర్ కార్డులో తెలంగాణ ఐదో స్థానాన్ని సాధించిందనీ, 2023లో ఉన్న 31వ స్థానం నుంచి గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ముకుంద రెడ్డి మాట్లాడుతూ హెచ్‌ఐవీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, శాస్త్రీయ అవగాహనతో వ్యాధిని ఎదుర్కొనేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సినీ నటులు తనికెళ్ల భరణి మాట్లాడుతూ యువత హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై సరైన సమాచారాన్ని తెలుసుకోవాలనీ, వ్యాధి వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. హెచ్‌ఐవీపై ప్రామాణిక సమాచారం కోసం టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 1097ను సంప్రదించాలని, అందుబాటులో ఉన్న హెచ్‌ఐవీ నివారణ, పరీక్షలు, చికిత్స సేవలను ఎటువంటి సంకోచం లేకుండా వినియోగించుకోవాలని కోరారు. ‘హెచ్‌ఐవీ నివారణకు సానుకూలంగా ముందుకు సాగుదాం’ నినాదంతో రెండు నెలల పాటు ఎయిడ్స్, సిఫిలిస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించనున్నారు.
హెచ్‌ఐవీ రహిత రాష్ర్టంగా తీర్చిదిద్దుదాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



