రాష్ట్రంలో 60 ఏండ్లు దాటిన వారిలో ఈ సమస్యలు 8.27శాతం
2016లో 3.04 లక్షల మందిలో డిమెన్షియా
2036 నాటికి 5.58 లక్షలకు
చేరే అవకాశం
నిమ్స్ న్యూరాలజీ విభాగం ప్రొఫెసర్, విభాగాధిపతి డాక్టర్ టి. సూర్యప్రభ
నవతెలంగాణ-సిటీబ్యూరో/బంజారాహిల్స్
అల్జీమర్స్ వ్యాధి ప్రారంభ లక్షణాలను సాధారణ వృద్ధాప్య సమస్యలుగా భావించడం వల్ల వ్యాధి నిర్ధారణలో జాప్యం జరుగుతోందని నిమ్స్ న్యూరాలజీ విభాగం ప్రొఫెసర్, విభాగాధిపతి డాక్టర్ టి.సూర్యప్రభ తెలిపారు. జ్ఞాపకశక్తి, ఆలోచనా విధానం, భాష, విచక్షణ లేదా రోజువారీ కార్యకలాపాల్లో నిరంతర మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదిం చాలని సూచించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో బుధవారం ఇంటరాక్షన్ కార్యక్రమంలో వారు పలు విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో 60 ఏండ్లు దాటిన వారిలో డిమెన్షియా వ్యాప్తి 8.27 శాతంగా ఉందని, ఇది జాతీయ సగటు 7.43 శాతం కంటే ఎక్కువని తెలిపారు. 2016లో రాష్ట్రంలో సుమారు 3.04 లక్షల మంది డిమెన్షియాతో జీవిస్తున్నారని అంచనా వేయగా, 2036 నాటికి ఈ సంఖ్య 5.58 లక్షలకు చేరే అవకాశం ఉందన్నారు. జ్ఞాపకశక్తి సమస్యలను తరచుగా వృద్ధాప్యంలో వచ్చే సాధారణ సమస్యలుగా కొట్టి పారేస్తుండటంతో అల్జీమర్స్ వ్యాధి నిర్ధారణ ఆలస్యం కావచ్చని తెలిపారు. జ్ఞాపకశక్తి, ఆలోచనా విధానం, భాష, విచక్షణ లేదా రోజువారీ కార్యకలాపాల్లో నిరంతరంగా వచ్చే మార్పులను విస్మరించొద్దని సూచించారు. అవి అంతర్గత సమస్యకు తొలి సంకేతాలు కావొచ్చని చెప్పారు. సకాలంలో రోగ నిర్ధారణ చేయడం వల్ల రోగులు, కుటుంబ సభ్యులు వ్యాధిని మెరుగ్గా అర్థం చేసుకుని సరైన వైద్య సలహాలు, సంరక్షణ, సహాయం పొందేందుకు వీలవుతుందన్నారు. సరైన సమయంలో సహాయం అందేలా చూడటంలో అధిక అవగాహన, లక్షణాలను ముందుగానే గుర్తించడం కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. తరచుగా జ్ఞాపకశక్తి కోల్పోవడం, సంభాషణలో సరైన పదాలను గుర్తించలేకపోవడం, పరిచయమైన పనులు చేయడంలో ఇబ్బంది, సమయం లేదా ప్రదేశంపై గందరగోళం, విచక్షణ లేదా ప్రవర్తనలో మార్పులు అల్జీమర్స్ ప్రారంభ సంకేతాలు కావచ్చని తెలిపారు. అల్జీమర్స్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా లక్షణాల నిర్వహణ, జీవన నాణ్యత మెరుగుపడటంతో పాటు కుటుంబాలపై సంరక్షణ భారం, ఖర్చులు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
అల్జీమర్స్ లక్షణాలను వృద్ధాప్య సమస్యలుగా భావించొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



