సామ్రాజ్యవాద దేశాల ముందు మోకరిల్లుతున్న ప్రధాని
బ్రిటీషోళ్లను క్షమాబిక్ష కోరిన చరిత్ర ఆర్ఎస్ఎస్ది
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి
రేషన్ కార్డు ద్వారా 14 రకాల సరుకులు అందజేయాలి
21న ఉద్యోగాల భర్తీ కోసం కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
నవతెలంగాణ – మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
‘‘సామ్రాజ్యవాద దేశాల ముందు మోకరిల్లుతున్న మోడీ మన దేశంలో కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తున్నాడు. మతతత్వ మోడీని గద్దె దించకపోతే లౌకిక ప్రజాస్వామ్య దేశానికే ప్రమాదకరం. మన దేశ స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో అరెస్టైన ఆర్ఎస్ఎస్ నాయకులు బ్రిటీషోళ్లను క్షమాబిక్ష కోరి దేశ ద్రోహులుగా మారారు. ఇప్పుడు దేశం కోసం పోరాడినట్టు పోజులు కొడుతున్నారు’’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. బుధవారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సమావేశానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సర్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని హస్యాస్పదంగా మారుస్తున్న కేంద్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. సర్ పేర ఓట్లను తొలగించి ప్రభుత్వాలను తారుమారు చేస్తున్నారని, పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన ఎన్నికలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు ప్రతి కార్డుపై ఒక్కొక్కరికి 10 కేజీల ఉచిత బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర వస్తువులను అందజేయాలని కోరారు. గతంలో రేషన్ ద్వారా చింతపండు, కారం, పప్పు, నూనెలు ఇచ్చేవారని గుర్తు చేశారు. నిరుద్యోగుల విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పిందని, అందుకే దేశవ్యాప్తంగా నిరుద్యోగుల ఉద్యమ సెగను బీజేపీ చవిచూస్తోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకుని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. పాలకుల వైఫల్యం వల్ల విద్య, వైద్యం వ్యాపారంగా మారాయని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాలలో 60 శాతం, పట్టణ ప్రాంతాలలో 80 శాతం మంది ప్రయివేటులోనే విద్య, వైద్య సేవలు పొందుతున్నారని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర, లాభదాయకమైన సాగుపై నివేదిక ఇచ్చిన స్వామినాథన్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ, అటవీ హక్కులు, విద్యుత్ సవరణ వంటి చట్టాలను సవరించి కేంద్రం తీరని అన్యాయం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మోడీకి అదానీ బినామీగా మారి దేశ సంపదను కొల్లగొడుతున్నాడని విమర్శించారు. ఒక శాతం ధనవంతుల చేతిలో 40 శాతం సంపద వచ్చి చేరిందని, వారిపై రెండు శాతం పన్నులు పెంచినా.. ఉచిత విద్య, వైద్యం అందుబాటులోకి వస్తాయని జాన్వెస్లీ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న బీజేపీని ఓడించి తీరాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జయలక్ష్మి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రాములు, కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లె గోపాల్, కురుమూర్తి, పద్మ తదితరులు పాల్గొన్నారు.



