Thursday, August 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమత్స్య సొసైటీల ఖాతాల్లోనే నగదు జమ చేయాలి

మత్స్య సొసైటీల ఖాతాల్లోనే నగదు జమ చేయాలి

- Advertisement -

బడ్జెట్‌ ‌కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వని ప్రభుత్వం
రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో పలువురు వక్తలు
నవతెలంగాణ–ముషీరాబాద్

​మత్స్యకారులు, మత్స్య సొసైటీలకు చెందాల్సిన నగదును నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని మత్స్యశాఖ మాజీ వైస్‌ చైర్మెన్‌ దివిటి మల్లయ్య, గొడుగు శ్రీనివాస్, తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ ప్రభుత్వాలను కోరారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మత్స్యకార కుటుంబాలు నేటికీ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. 33 జిల్లాల్లో 6,200 మత్స్య సొసైటీలు ఉండగా, వాటిలో సుమారు ఐదు లక్షల మంది సభ్యులుగా ఉన్నారని చెప్పారు. మరో ఐదు లక్షల మంది సొసైటీల్లో సభ్యత్వం లేకుండానే మత్స్యవృత్తిలో కొనసాగుతున్నారని వివరించారు. రాష్ట్రంలో మత్స్య సంపద ఉత్పత్తికి అవసరమైన జల వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ మత్స్యశాఖ వద్ద సరైన ప్రణాళిక లేదని, ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపుల్లో మత్స్యశాఖకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అన్నారు. మత్స్యకార సంఘాలు, సొసైటీలను మత్స్య పరిశ్రమ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని తెలిపారు. మత్స్యకారులకు బడ్జెట్‌ కేటాయింపుల్లో న్యాయమైన వాటా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా చెల్లింపులకు 2026–27 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించలేదని తెలిపారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి కూడా తగిన నిధులు కేటాయించకుండా ప్రభుత్వం మత్స్యకారులకు అన్యాయం చేసిందన్నారు. 12 ఏండ్లలో తెలంగాణలో 986 మంది మత్స్యకారులు మృతిచెందారని, వారి కుటుంబాలకు ఇప్పటికీ ఎక్స్‌గ్రేషియా అందలేదని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికితీసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు. చేప పిల్లల పంపిణీ పథకంలో అవినీతికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మత్స్యకారులు, మత్స్య సొసైటీల నిధుల్లో అవినీతికి తావులేకుండా పారదర్శకంగా నేరుగా సొసైటీల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేయాలని కోరారు. 50 ఏండ్లు నిండిన మత్స్యకారులకు వృద్ధాప్య పింఛన్లు అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శులు కొప్పు పద్మ, గొడుగు వెంకట్‌, బక్కి బాలమణి, గాండ్ల అమరావతి, ఉపాధ్యక్షులు దిటి శ్రీనివాస్‌, పిట్టల వెంకన్న, చెనమోని శంకర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు తడబోయన కృష్ణమూర్తి, ఈగ లక్ష్మణ్‌, కాదబోయన అరుణ, జునగారి దుర్గయ్య, నిమ్మేలా విజేందర్‌, గోల్కొండ హిమబిందు, చిన్నబోయన దర్గయ్య, సింఘం కృష్ణంరాజు, కాగు లక్ష్మి, సౌళ్ళ లలిత, కర్రెల్లీ నవనీత, పెబ్బ శంకర్‌ రాజమణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -