కూకట్‌పల్లిలో శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి
ఏడాదిలో గృహప్రవేశాలు జరిగేలా ప్రణాళిక
లక్ష ఇండ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం
తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 8 వేల ఇండ్ల నిర్మాణం
అర్హులైన పేదలకు పారదర్శకంగా లక్కీడిప్ ద్వారా కేటాయింపు :
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ మహా నగరంలో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేయబోతోందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. క్యూర్ పరిధిలో చేపడుతున్న ప్రతిష్టాత్మక ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి గురువారం సాయంత్రం కూకట్‌పల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇండ్ల నిర్మాణంపై బుధవారం అధికారులతో మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూకట్‌పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్ధాపన చేయనున్న ఐదెకరాల ప్రాంతంలో నాలుగు టవర్స్ నిర్మిస్తామని తెలిపారు. ఒక్కో టవర్‌లో 120 చొప్పున ఫ్లాట్లు ఉంటాయన్నారు. ఒక్కో ఫ్లోర్‌లో 12 ఫ్లాట్లు ఉండేలా మొత్తం 480 ఫ్లాట్లను నిర్మిస్తామని చెప్పారు. ఇందుకోసం రూ.43.20 కోట్లు ఖర్చవుతుందని వివరించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి దాదాపు 90 ఎకరాలను ఎంపిక చేసినట్టు వెల్లడించారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున పేదల కోసం భవనం నిర్మించడమంటే ఒక కుటుంబానికి భద్రత, ఒక తరానికి భరోసా అని మంత్రి అభివర్ణించారు. పేదలకు గౌరవంతో కూడిన జీవితం అందించడమే అని తెలిపారు. హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో నగరంలోనే సొంతిల్లు కావాలనే పేదల ఆకాంక్షను నెరవేర్చేందుకు ఇందిరమ్మ టవర్స్‌ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని గుర్తుచేశారు.
నగరంలోని కీలక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను సద్వినియోగం చేసుకుని బహుళ అంతస్తుల టవర్లను నిర్మిస్తున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ పథకం హైదరాబాద్‌లో పేదల గృహ అవసరాలను దశలవారీగా తీర్చే నిరంతర గృహ నిర్మాణ కార్యక్రమని స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో ఈ ఏడాది లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని , తొలి విడతలో ప్రయోగాత్మకంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 8 వేల ఇండ్లను నిర్మించనున్నట్టు వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దాదాపు 50 వేల దరఖాస్తులు అందాయని మంత్రి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగించినట్టు చెప్పారు. ప్రతిపాదిత ఇంటిలో ఒక బెడ్‌రూమ్, హాల్, కిచెన్‌తో కలిపి సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుందని వెల్లడించారు.
ఆయా ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి పది అంతస్తుల వరకు టవర్లను నిర్మించనున్నట్టు వివరించారు. ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న ఈ ఇండ్లలో లబ్ధిదారుల పేరుతో అన్‌డివైడెడ్ షేర్ కింద సుమారు 20 నుంచి 25 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయనున్నట్టు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో లబ్ధిదారుడికి లభించే భూమి వాటా విలువ సుమారు రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుందన్నారు.
వచ్చే ఏడాది బోనాల నాటికి గృహ ప్రవేశాలు
దరఖాస్తుల స్వీకరణ అనంతరం అర్హతలను పూర్తిస్థాయిలో పరిశీలించి, ఎలాంటి రాజకీయ జోక్యం, సిఫార్సులు, అవకతవకలకు తావులేకుండా పారదర్శక పద్ధతిలో డ్రా/లక్కీడిప్ ద్వారా ఇండ్లను కేటాయిస్తామని తెలిపారు. ఇల్లు మంజూరు కాని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన ఈఎండీ మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లిస్తామన్నారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా, వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది బోనాల పండుగ సమయానికి ఎంపికైన లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. శంకుస్థాపన నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి దశను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, నిర్ణీత గడువులో నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు.
క్యూర్ పరిధిలో నేడు ఇందిరమ్మ టవర్స్‌కు శ్రీకారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



