త్వరలో తెలంగాణకు ప్రతినిధుల బృందాన్ని పంపుతాం
బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయకుమార్ సిన్హా
ఆయిల్ పామ్ సాగుకు సహాయ సహకారాలు అందిస్తాం : మంత్రి తుమ్మల హామీ
సచివాలయంలో ఇరువురు మంత్రులు, అధికారుల భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీహార్‌లో ఆయిల్ పామ్ సాగును పరిశీలిస్తామని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి విజయ్‌కుమార్ సిన్హా తెలిపారు. త్వరలో దానిపై అధ్యయనం కోసం ప్రతినిధుల బృందాన్ని పంపుతామని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు, నర్సరీలు, మార్కెటింగ్, తదితర అంశాలపై పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీనిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఇరువురు మంత్రులు, రెండు రాష్ర్టాల వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. బీహార్–తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యవసాయరంగంలో పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం, పంటల వైవిధ్యీకరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. వాతావరణ హెచ్చరికలను రైతులకు చేరవేయడం, రైతు నేస్తం ద్వారా రైతులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అనుసంధానం, క్రాప్ బుకింగ్, శాటిలైట్ ఆధారిత పంటల పర్యవేక్షణ, యూరియా బుకింగ్ అప్లికేషన్, అగ్రిస్టాక్ ద్వారా రైతు గుర్తింపు వంటి డిజిటల్ కార్యక్రమాల గురించి బీహార్ బృందానికి మంత్రి తుమ్మల వివరించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందనీ, రైతుబంధు, రైతు బీమా, సన్న వడ్లకు బోనస్ తదితర కార్యక్రమాల అమలు తీరు గురించి విడమర్చి చెప్పారు. తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, నర్సరీలు, ప్రాసెసింగ్ మిల్లులు, మైక్రో ఇరిగేషన్ వంటి మౌలిక సదుపాయాలపై బీహార్ మంత్రి విజయ్‌కుమార్ సిన్హా ఆసక్తితో అడిగి తెలుసుకున్నారు. బీహార్‌లో అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలు, పంటల వైవిధ్యీకరణ, పంటల క్లస్టర్ల విధానం, సాంకేతిక వినియోగం తదితరాల గురించి తెలంగాణ ప్రతినిధులకు వివరించారు. వ్యవసాయ ఉత్పత్తుల వైవిధ్యానికి అనుగుణంగా ప్రత్యేక పంటల క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మకానా, మొక్కజొన్న, పండ్లు–కూరగాయలు, తృణధాన్యాల కోసం ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేసి ఉత్పత్తి, విలువ జోడింపు, మార్కెటింగ్ రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు బీహార్ ప్రతినిధులు వివరించారు. దర్భంగా, మధుబని, సీతామర్హి ప్రాంతాల్లో మకానా క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మకానా పంట సాగుపై మంత్రి తుమ్మల ఆసక్తి కనబరిచారు. మకానా ఉత్పత్తి, పరిశోధన, విలువ జోడింపు, మార్కెటింగ్, అంతర్జాతీయ అవకాశాలను పెంపొందించేందుకు మకానా బోర్డును ఏర్పాటు చేసినట్లు బీహార్ ప్రతినిధులు వివరించారు. పదేండ్లలో మకానా సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత 2.5 రెట్లకు పైగా పెరిగినట్లు వివరించారు. మకానా సాగుపై మంత్రి తుమ్మల ఆసక్తి కనబర్చారు. రెండు రాష్ట్రాల్లో రైతులకు ప్రయోజనం చేకూరే పంటల పరస్పర అధ్యయనం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి దోహదం చేసుకోవాలని మంత్రి తుమ్మల కోరారు. ఆయిల్‌పామ్ సాగు విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీహార్ నుంచి వ్యవసాయశాఖ అధికారులు, ప్రతినిధుల బృందంతో పాటు రైతుల బృందాన్ని తెలంగాణకు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. అదే విధంగా మకానా సాగు, ప్రాసెసింగ్, విలువ జోడింపు, మార్కెటింగ్ విధానాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ నుంచి ప్రతినిధుల బృందాన్ని బీహార్‌కు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, హాకా ఎమ్డీ చంద్రశేఖర్ రెడ్డి, కో ఆపరేటీవ్ కమిషనర్ రాహుల్ రాజ్, హార్టీకల్చర్ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి, బీహార్ రాష్ట్ర వ్యవసాయశాఖ సెక్రటరీ నర్మదేశ్వర్ లాల్, వ్యవసాయశాఖ డైరెక్టర్ ముకేష్ కుమార్ లాల్, హార్టికల్చర్ డైరెక్టర్ అభిషేక్ కుమార్ పాల్గొన్నారు.
బీహార్‌లో ఆయిల్ పామ్ సాగును పరిశీలిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



