Thursday, August 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకాంగ్రెస్‌ హత్యా రాజకీయాలు

కాంగ్రెస్‌ హత్యా రాజకీయాలు

- Advertisement -

నేత కార్మికుడు వెంకటేశం కుటుంబానికి అండగా ఉంటాం
బాధిత కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తాం
ఆయన హత్యలో సూత్రధారులను వెలికితీయాలి : బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ 
‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

​కాంగ్రెస్ హత్యా రాజకీయాలు చేస్తోందనీ, నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ హామీ ఇచ్చారు. సిరిసిల్లలో బుధవారం వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించిన ఆయన.. భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు. వెంకటేశం హత్యకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు, బాధ్యులు, సూత్రధారులను వెలుగులోకి తీసుకురావాలని కేటీఆర్‌ పోలీసులను డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ రాజకీయంగా తమను ఎదుర్కోవాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలని, విమర్శలు చేయొచ్చని, కేసులు పెట్టొచ్చని.. కానీ సామాన్య ప్రజలను బలిపశువులుగా మార్చడం దుర్మార్గమన్నారు.“రాజకీయ లబ్ది కోసం మనుషుల ప్రాణం తీసే స్థాయికి దిగజారడం అత్యంత బాధాకరం. తెలంగాణ రాజకీయాల్లో దాదాపు 20 ఏండ్లుగా ఉన్నాను. ఇంత దిగజారిన రాజకీయాలను ఎప్పుడూ చూడలేదు” అని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశం హత్య కేసులో కొంతమంది కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ, అసలు సూత్రధారులు ఎవరనే విషయాన్ని దర్యాప్తులో తేల్చాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్టు చెబుతున్నారని, వారిలో ఇద్దరిని మాత్రమే రిమాండ్‌కు పంపి.. మరో ముగ్గురికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడాన్ని ప్రశ్నించారు. పోలీసుల దర్యాప్తు పూర్తిగా పారదర్శకంగా సాగాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకూ తలొగ్గకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. వెంకటేశం కుటుంబం ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న ఇంట్లో నివసిస్తోందని, ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయలేని పరిస్థితి ఉంటే బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున తామే ఇల్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. వెంకటేశం కుమార్తె విద్య, భవిష్యత్‌ ‌బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.

కేటీఆర్‌ను కలిసిన డబుల్ బెడ్ రూ‌మ్‌ ఇండ్ల బాధితులు
వీర్నపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి హాజరైన కేటీఆర్‌ను డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల లబ్దిదారులు కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు. డబుల్ రోడ్డు నిర్మాణం కోసం కేటీఆర్ ఇచ్చిన ధైర్యంతోనే తాము ఇండ్లను కూల్చుకోవడానికి సహకరించామన్నారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుకున్నప్పటికీ ఇప్పటివరకు బిల్లులు రాలేదని వాపోయారు. కలెక్టర్‌ను పలుమార్లు కలిసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్ సిరిసిల్ల వెళ్లగానే కలెక్టర్, సంబంధిత మంత్రితో స్వయంగా మాట్లాడి నిధులు వచ్చేలా చూస్తానన్నారు. ఒకవేళ ప్రభుత్వం లేదా అధికారులు బిల్లులు ఇవ్వకపోతే, తన సొంత బాధ్యతగా తానే ఆ బిల్లుల డబ్బులు చెల్లిస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -