Monday, August 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపీడీఎస్‌‌లో మరో ముందడుగు..
 స్మార్ట్ రేషన్ కార్డులు

పీడీఎస్‌‌లో మరో ముందడుగు..
 స్మార్ట్ రేషన్ కార్డులు

- Advertisement -

 రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

స్మార్ట్‌ ‌రేషన్‌‌కార్డుల పంపిణీ అనేది ప్రజా పంపిణీ వ్యవస్థలో మరో ముందడుగని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌ అని వ్యాఖ్యానించారు. ప్రతి కుటుంబానికి ఆహార భద్రతను కల్పించడంతో పాటు, సంక్షేమ ప్రయోజనాలను పారదర్శకంగా, సమర్థవంతంగా, సకాలంలో అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించడంలో, లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని అన్నారు.కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులు తమ రేషన్ కార్డు వివరాలను సులభంగా వెంట తీసుకెళ్లి, అవసరమైన సమయంలో వినియోగించుకోవచ్చని తెలిపారు. పాత రేషన్ పుస్తకాలతో ఎదురయ్యే ఇబ్బందులను డిజిటలైజేషన్ ద్వారా తగ్గించవచ్చని పేర్కొన్నారు.‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తోంది. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ ప్రయోజనాలు నేరుగా, పారదర్శకంగా, ఎలాంటి అనవసర ఇబ్బందులు లేకుండా చేరాలి,’ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ తదితర సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఇప్పటికే పలు పథకాలు అమలులో ఉండగా, మిగిలిన హామీలను కూడా దశలవారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, రేషన్ కార్డుల పరిధిని విస్తరించడం, నాణ్యమైన సన్నబియ్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్న సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషిని మంత్రి అభినందించారు. లబ్ధిదారులకు సాధ్యమైనంత వరకు వారు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుం టోందన్నారు. గతంలో కొంతమంది లబ్ధిదారులకు వారి నివాస ప్రాంతాలకు దూరంగా ఇండ్లు కేటాయించడం వల్ల ఉపాధి అవకాశాలు, కుటుంబ సంబంధాలపై ప్రభావం పడేదని మంత్రి పేర్కొన్నారు. కొత్త విధానంలో అర్హులైన లబ్ధిదారులు నివసించే ప్రాంతాల్లోనే అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించి, వారికి స్థానికంగానే గృహాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో సర్వేలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్, ఎంఐఎం ఎమ్మెల్యేలు మీర్ జుల్ఫికార్ అలీ, కౌసర్ మొహియుద్దీన్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, దానం నాగేందర్, గణేష్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అల, అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి, సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ రాజిరెడ్డి, జిల్లా సివిల్ సప్లైస్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -