విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి
జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
సామాజిక న్యాయం లేకుండా దేశ అభివృద్ధి ఎలా సాధ్యమని విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి ప్రశ్నించారు. దేశంలో సమానత్వం, సామాజిక న్యాయం, సమసమాజ నిర్మాణం ఇంకా పూర్తి స్థాయిలో సాధ్యం కాలేదని అన్నారు. భూమి, ఉపాధి, విద్య, మత సామరస్యం వంటి అంశాల్లో ప్రజల మధ్య అంతరాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ జేఎన్‌టీయూహెచ్‌లోని యూనివర్సిటీ ఆడిటోరియంలో ఆదివారం ‘భారత రాజ్యాంగం–సామాజిక న్యాయం’. ‘ఎస్‌ఐఆర్(సర్) పారదర్శకతపై ప్రభావం’ తదితర అంశాలపై రాజ్యాంగ పరిరక్షణ వేదిక అధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశంలో భూమి, ఉపాధి అవకాశాలు సామాన్య ప్రజలకు దూరమవుతున్నాయన్నారు. బీహార్‌లో వందల ఎకరాల భూమి కొద్ది మంది పారిశ్రామికవేత్తలకు ఎలా అందుబాటులోకి వస్తోందనే అంశాన్ని ప్రస్తావించారు. భూమి పంపిణీ, వనరుల వినియోగంలో సామాజిక న్యాయం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. “దేశంలో భూమి పోయింది.. ఉద్యోగం పోయింది” అంటూ సామాన్య ప్రజల పరిస్థితిని ప్రస్తావించారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించకుండా దేశ అభివృద్ధి గురించి మాట్లాడటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం నెలకొల్పడంతో పాటు ప్రజల మధ్య ఉన్న అంతరాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయం స్ఫూర్తికి విరుద్ధంగా కుల, మత వివక్షకు తావిచ్చే ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు సంబంధించిన ఒక ఘటనను ప్రస్తావిస్తూ.. ఒక దళిత నాయకుడు ఆలయ ప్రాంతానికి వెళ్లిన తర్వాత ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయడం వంటి చర్యలు సామాజిక న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. ఇదెక్కడి సామాజిక న్యాయ పద్ధతి? అని ప్రశ్నించారు. దేశంలో మత ఘర్షణలు చోటుచేసుకోవడం కూడా ఆందోళన కలిగించే అంశమన్నారు. ప్రజల మధ్య సామరస్యం, సోదరభావం పెంపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు.
ప్రతి చిన్నారికీ నాణ్యమైన విద్య
విద్యారంగ పరిస్థితులపైన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో పిల్లలు పాఠశాలలకు దూరమవుతున్నారని, అనేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని తెలిపారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేశారు. దేశ అభివృద్ధిపై విమర్శలు చేస్తున్న వారిని ‘నక్సలైట్ మైండ్‌సెట్ ఉన్నవారు’ అంటూ విమర్శించడం సరికాదన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో సహజమైన ప్రక్రియ అని తెలిపారు. రాజ్యాంగ విలువలను కాపాడేందుకు విమర్శలను కూడా గౌరవించే వాతావరణం ఉండాలని సూచించారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, గౌరవంతో జీవించే అవకాశం కల్పించిందని, ఆ స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకురావడమే నిజమైన సామాజిక న్యాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధ్యక్షులు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ప్రముఖ విశ్లేషకులు డా. పరకాల ప్రభాకర్, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డీజీ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయం లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యం?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



