22-ఏ నిబంధనతో ఆస్తి యజమానులకు
తీవ్ర ఇబ్బందులు
అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఎం.శ్రీనివాస్
నవతెలంగాణ-కాప్రా
నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన వివిధ కాలనీలకు చెందిన ప్రయివేటు భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు వివిధ కాలనీల ప్రముఖులతో కలిసి ఫోరం ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమలానగర్‌లోని ఎన్‌వీ భాస్కరరావు స్మారక భవన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 22-ఏ నిబంధన కింద పెద్ద సంఖ్యలో భూములను నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ప్రయివేటు భూముల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఒక సర్వే నంబర్‌లో కొంత మేర ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ మొత్తం సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ప్రయివేటు ఆస్తుల యజమానులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. భూమిని నిషేధిత జాబితాలో చేర్చే ముందు సంబంధిత యజమానులకు నోటీసులు ఇవ్వాలన్న న్యాయస్థాన ఆదేశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. ధరణి, భూ భారతి పేర్లతో వివిధ కారణాలతో ప్రజల భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మున్సిపల్ అనుమతులతో ఇండ్లు నిర్మించుకుని పన్నులు చెల్లిస్తున్న ఆస్తులతో పాటు హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన లేఅవుట్‌లను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదన్నారు. 1979లో హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన ఏఎస్ రావు నగర్ లేఅవుట్‌లో రెండు సర్వే నంబర్లలో కొంత అసైన్డ్ భూమి ఉందనే కారణంతో తొమ్మిది సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చడం అన్యాయమన్నారు. చర్లపల్లి, ఈసీ నగర్, బీఎన్ రెడ్డి నగర్ ప్రాంతాల్లోనూ ఇదే సమస్య నెలకొన్నదన్నారు. నిషేధిత జాబితా కారణంగా ప్రజలు తమ భూములను విక్రయించుకోవడం, కొనుగోలు చేయడం, కుటుంబ అవసరాల కోసం ఆస్తులను వినియోగించుకోవడం సాధ్యం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫోరం రాష్ట్ర నాయకులు ఎన్. అంజయ్య మాట్లాడుతూ.. ఎప్పుడో ఏర్పడిన కాలనీల్లోని ఆస్తులను ఇప్పుడు నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కాలనీ ప్రజల ప్రయివేటు ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు సోమయ్యచారి, జి.వి. రావు, వెంకటాచారి, జి. యాదగిరిరావు, శివరామకృష్ణ పాల్గొన్నారు.
నిషేధిత జాబితా నుంచి ప్రయివేటు భూములు తొలగించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



