Monday, August 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅవిశ్రాంత మహామేధస్సు మూగబోయింది

అవిశ్రాంత మహామేధస్సు మూగబోయింది

- Advertisement -

శాస్త్రవేత్త డాక్టర్‌ దేవరాజు మహారాజు
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 
ప్రజా శాస్త్రవేత్త ఎంపీ పరమేశ్వరన్‌ 
సంస్మరణ సభ
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ

అవిశ్రాంత మహామేధస్సు మూగబోయిందని, ప్రజా శాస్త్రవేత్త ఎంపీ పరమేశ్వరన్‌ మృతి.. ప్రజాసైన్స్‌ ఉద్యమానికి తీరని లోటని డాక్టర్‌ దేవరాజు మహారాజు అన్నారు. అణుశాస్త్రవేత్తగా, శాస్త్ర ప్రచారకునిగా, పర్యావరణవేత్తగా, ప్రజల మనిషిగా ఆయన అందించిన సేవలను పలువురు స్మరించుకున్నారు. ఎంపీ పరమేశ్వరన్‌ సంస్మరణ కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆంధ్ర మహిళా సభ డిగ్రీ కళాశాలలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేదిక రాష్ట్ర అధ్యక్షులు చెలిమెల రాజేశ్వర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ దేవరాజు మహారాజు మాట్లాడుతూ.. అణుశాస్త్రవేత్త నుంచి శాస్త్ర ప్రచారకునిగా, పర్యావరణవేత్తగా, ప్రజల మనిషిగా మారిన అరుదైన శాస్త్రవేత్త ఎంపీ పరమేశ్వరన్‌ అని కొనియాడారు. ప్రశ్ననే ఆయుధంగా మలుచుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోవడం కష్టసాధ్యమని అన్నారు. అణుశాస్త్రవేత్తగా వృత్తి జీవితం ప్రారంభించిన ఆయన.. శిక్షణ కోసం మాస్కో వెళ్లారని, అక్కడి సోషలిస్టు వ్యవస్థలో పిల్లల నవ్వులను చూసి మురిసిపోయారని గుర్తుచేశారు. అలాంటి నవ్వులు ప్రపంచమంతా ఎందుకు విరబూయకూడదనే ఆలోచనతో భారత్‌కు తిరిగివచ్చి ఉద్యోగానికి స్వస్తి చెప్పి ప్రజల్లోకి వెళ్లారని తెలిపారు. ఎంపీ పరమేశ్వరన్‌ అసాధారణ స్వాప్నికుడని, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఉండలేరని, ఒక్కరోజూ ఏదో ఒకటి రాయకుండా గడపలేరన్నారు. ఆయనతో మాట్లాడటమంటే ఏదో ఒక చర్చలోకి దిగడమేనని తెలిపారు. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్తుతో ప్రారంభమైన ప్రజాసైన్స్‌ ఉద్యమ సంస్థలు దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఏర్పడి ఒకదానికొకటి అనుసంధానమయ్యాయంటే అందుకు పరమేశ్వరన్‌ కృషి ప్రధాన కారణమన్నారు. భారత జ్ఞాన విజ్ఞాన జాత, సాక్షరతా ఉద్యమం, జన వచన్‌ ఆందోళన్‌, ప్రజాపంచాయతీ ప్లానింగ్‌, హమారా దేశ్‌, సృజనోత్సవాలు వంటి కార్యక్రమాలు ఆయన కలల నుంచి పురుడు పోసుకున్నవేనని తెలిపారు. అవి ప్రజలను కదిలించి కార్యోన్ముఖులను చేశాయని తెలిపారు.

జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు ప్రొ. ఏ. రామచంద్రయ్య మాట్లాడుతూ.. ప్రజలు విజ్ఞానవంతులు కావడానికి జ్ఞానం, విజ్ఞానం వారి ముంగిట్లోకి, అరచేతిలోకి చేరాలని ఎంపీ పరమేశ్వరన్‌ భావించేవారని అన్నారు. ఇందుకోసం ఆయన ప్రజాసైన్స్‌ ఉద్యమాన్ని ఎంచుకున్నారని, మనదేశంలో ఈ ఉద్యమానికి ఆయన రూపశిల్పి, తాత్వికుడు, చోదకుడని కొనియాడారు. ఏఐపీఎస్‌ఎన్‌ నాయకులు డాక్టర్‌ సోమ మార్ల మాట్లాడుతూ.. తన కలలకు ముగింపు లేదని చెప్పిన పరమేశ్వరన్‌ ఇప్పుడు మనకు కలగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నిష్క్రమణతో ప్రజాసైన్స్‌ ఉద్యమం ఒక పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు. ఆయన స్ఫూర్తి, చూపిన మార్గం ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూనే ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్‌ దాసరి ప్రసాద్‌రావు, ప్రముఖ సైంటిస్ట్‌ బీవీ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. శ్రీనివాసరావు, పి. రజిని, ప్రొ. కట్ట సత్య ప్రసాద్‌, ఎం. రవీంద్రబాబు, భీమేశ్వరరావు, వై. యాదగిరి, టీ. విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -