నవతెలంగాణ – హైదరాబాద్ : ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రంగా మారాయి. భారత సంతతికి చెందిన బిలియనీర్ లక్ష్మీ మిత్తల్‌కు చెందిన ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఉక్రెయిన్‌లోని క్రివీ రిహ్‌లో ఉన్న ఈ కర్మాగారం దేశంలోనే అతిపెద్ద సమగ్ర ఉక్కు పరిశ్రమగా ఉంది. దాడిలో ఇద్దరు మృతి చెందారు. 14 మంది కార్మికులు గాయపడ్డారు. కీలక విద్యుత్ వ్యవస్థలు, బ్లాస్ట్ ఫర్నేస్‌లకు నష్టం వాటిల్లడంతో ఉత్పత్తిని కొంతకాలం నిలిపివేయాల్సి వచ్చింది.ఈ దాడికి ముందు రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. రష్యా అంతటా 822 డ్రోన్లను అడ్డుకున్నట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. మాస్కో వైపు దాదాపు 600 డ్రోన్లు దూసుకొచ్చాయని నగర మేయర్ సెర్గీ సోబ్యానిన్ చెప్పారు.
వాటిలో మూడో వంతును మాస్కో ప్రాంతంలోనే కూల్చివేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మాస్కో సమీపంలోని ఓ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడంతో 83 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. మరో దాడిలో రష్యాలో అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్ వైల్డ్‌బెర్రీస్ గిడ్డంగిలో భారీగా మంటలు చెలరేగాయి. రోస్టోవ్ ప్రాంతంలో 150కి పైగా డ్రోన్లతో జరిగిన దాడిలో ఐదుగురు మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇళ్లు, రైల్వే స్టేషన్ సహా పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి.



