ఏడుగురి మృతి..10 మందికి గాయాలు..
బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి విచారం
మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటన
పాట్నా : బీహార్‌లోని ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన లఖిసరాయి పట్టణంలోని అశోక్ ధామ్ ఆలయంలో సోమవారం ఉదయం 6:40 గంటల సమయంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. శ్రావణమాసం సోమవారం సందర్భంగా ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రద్దీకి తగినట్లుగా ఆలయాధికారులు ఏర్పాట్లు చేయకపోవడం, విద్యుత్ స్తంభం విరిగిపోయిందనే వదంతుల కారణంగా ఆలయంలో తొక్కిసలాట జరిగినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్రావణ మాసంలో హిందువులు పవిత్రమైనదిగా భావించే సోమవారం రోజున, అధిక రద్దీతో కూడిన రెండు రైళ్లు ఒకే సమయానికి లఖిసరాయ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాయనీ, వీరిలో ఎక్కువ మంది మహిళలేనని, వీరంతా పవిత్ర జలాన్ని సమర్పించడానికి రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఆలయం వద్దకు ఒకే సారి చేరుకున్నారని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దీన్ని గుర్తించినా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. ఈ రద్దీ సమయంలో జరిగిన గందరగోళానికి వెదరుతో ఏర్పాటు చేసిన బారికేడ్ కూలిపోయిందని చెప్పారు. అదే సమయంలో సమీపంలో ఉన్న పొలంలో ఒక విద్యుత్ స్తంభం విరిగిపడింది. దీంతో వెనుక నుంచి వస్తున్న కొందరు విద్యుత్ స్తంభం కూలిపోయిందని బిగ్గరగా ఆరవడం ప్రారంభించారు. దీంతో క్యూలైన్లలో తొక్కిసలాట ప్రారంభమైంది. కొంత మంది కిందపడిపోయారు. వెనుక ఉన్న వారు వారిని తొక్కుకుంటూ వెళ్లడంతో ప్రాణనష్టం జరిగింది. గాయపడిన వారిని లఖిసరాయ్ సదర్ (టౌన్) ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల్లో ఆరుగురిని గుర్తించారు. బరహియాకు చెందిన మన్మలా దేవి (44), సోని దేవి (50), ముంగేర్‌లోని సఫియా సరాయ్‌కు చెందిన రింకు దేవి (50), హల్సిలోని కైండి ప్రతాప్పూర్కు చెందిన హేమలతా దేవి (55), హల్సి ప్రతాప్పూర్కు చెందిన లలితా దేవి (45), సంగీతా దేవి (40)గా గుర్తించారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తొక్కిసలాటపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని అధికారులు తెలిపారు.
ఈ ఘటన అత్యంత విచారకరం : సీఎం సామ్రాట్ చౌదరి
ఆలయంలో తొక్కిసలాట ఘటనపై బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి విచారం వ్యక్తం చేశారు. ‘ఇది అత్యంత విచారకరం, హృదయ విదారకం’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, ఆర్జేడీ నాయకులు తేజస్వీ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడమే ఈ ఘటనకు కారణమని విమర్శించారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వ ‘పరిపాలనా వైఫల్యాన్ని’ ప్రతిబింబిస్తోందని ఆరోపించారు.
బీహార్ ఆలయంలో తొక్కిసలాట
- Advertisement -
- Advertisement -



