Thursday, August 20, 2026
E-PAPER
Homeఆటలు600వ టెస్టులో అదిరే విజయం

600వ టెస్టులో అదిరే విజయం

- Advertisement -

గాలెలో 165 పరుగులతో భారత్‌ గెలుపు
ఛేదనలో శ్రీలంక 206 ఆలౌట్‌
మానవ్‌ సుతార్‌ 
ఆరు వికెట్ల మాయాజాలం

భారత్‌ చారిత్రక 600వ టెస్టులో అదిరే విజయం సాధించింది. గాలెలో ఓ వైపు వరుణుడు కుంభవృష్టి కురిపించేందుకు సమాయత్తం అవుతుండగా.. ఎంతో సహనంతో, పక్కా వ్యూహాంతో శుభ్‌మన్‌సేన ఆతిథ్య శ్రీలంకను బోల్తా కొట్టించింది. సోనల్‌ దినుశ (84), ధనంజయ డిసిల్వ (59) పాత బంతిపై పైచేయి సాధించినా.. స్పిన్నర్‌ మానవ సుతార్‌ మాయాజాలంతో మెరిశాడు. ఆరు వికెట్ల మ్యాజిక్‌తో శ్రీలంకను 206 పరుగులకు కుప్పకూల్చాడు. 165 పరుగుల తేడాతో భారత్‌ గాలె టెస్టులో ఘన విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్‌ 1-0తో ముందంజ వేసింది. మ్యాచ్‌‌ ముగిసిన పది నిమిషాల్లోనే గాలెలో భారీ వర్షం కురవటం గమనార్హం.

నవతెలంగాణ-గాలె
స్పిన్‌ అనుకూల పరిస్థితుల్లో ఆడిన గత మూడు టెస్టు సిరీస్‌ల్లో రెండింట ఓటమిపాలైన టీమ్‌ ఇండియా.. గాలెలో స్పిన్‌ వలలో చిక్కకుండా స్పిన్‌తో ప్రత్యర్థిని గింగిరాలు తిప్పేసింది. యువ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ (6/55) ఆరు వికెట్ల మాయాజాలంతో ఆతిథ్య శ్రీలంకను బోల్తా కొట్టించాడు. పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ (2/16), రవీంద్ర జడేజా (1/71), మహ్మద్‌ సిరాజ్ (1/15) సైతం వికెట్ల వేటలో మెప్పించారు. దీంతో 372 పరుగుల రికార్డు ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే కుప్పకూలింది. ఐదో రోజు ఆటకు ఆరు వికెట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమ్‌ ఇండియా 42.5 ఓవర్లలో లాంఛనం ముగించింది. తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హరో సోనల్‌ దినుశ (84, 128 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ ధనంజయ డిసిల్వ (59, 151 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ సెంచరీలతో భారత్‌ సహనాన్ని పరీక్షించారు. పది బంతుల వ్యవధిలో ఆఖరు 4 వికెట్లు పడగొట్టిన మానవ్‌ సుతార్‌ గాలె టెస్టులో భారత్‌కు మెరుపు విజయాన్ని కట్టబెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో చెలరేగిన నం.3 బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్‌ 1-0తో ముందంజలో నిలిచింది. భారత్‌, శ్రీలంక రెండో టెస్టు కొలంబోలో ఆదివారం నుంచి ఆరంభం కానుంది.

డిసిల్వ, దినుశ ప్రతిఘటన
భారత్‌, శ్రీలంక తొలి టెస్టు ఐదో రోజు ఆట షెడ్యూల్‌ సమయానికి ఆరంభమైంది. రాత్రంతా వర్షం కురిసినా, ఉదయం మంచి ఎండకాసింది. కానీ మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం సూచనలు ఉండటంతో ఇరు జట్లు ఆ కోణంలోనే వ్యూహం రచించాయి. ఓవర్‌నైట్‌ బ్యాటర్లు ధనంజయ డిసిల్వ (59), సోనల్‌ దినుశ (84)లు తొలి సెషన్లో భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 202 బంతుల్లో 95 పరుగులు జోడించారు. ఉదయం సెషన్లో మహ్మద్‌ సిరాజ్‌, రవీంద్ర జడేజాలు చెరో ఎండ్‌ నుంచి వికెట్‌ కోసం విశ్వప్రయత్నం చేశారు. కానీ ఈ జోడీ పేస్‌, స్పిన్‌ మాయకు చిక్కలేదు. దీంతో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ బౌలర్లను మార్చాడు. అర గంట విరామం తర్వాత మళ్లీ బంతి అందుకున్న జడేజా.. ప్రమాదకరంగా మారుతున్న డిసిల్వను సాగనంపాడు. దీంతో వికెట్ల వేటకు మార్గం తెరుచుకుంది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నిరోశన్‌ డిక్వెలా (10) ప్రసిద్‌ కృష్ణ అవుట్‌ చేశాడు. దీంతో తొలి సెషన్లో భారత్‌ రెండు వికెట్లు సాధించింది. లంచ్‌ విరామానికి శ్రీలంక 67 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. దినుశ, నువాంత క్రీజులో నిలిచారు.

టెయిలెండర్‌ కేశర నువాంత (20)తో కలిసి సోనల్‌ దినుశ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ ఇద్దరు 91 బంతుల్లో 43 పరుగులు జోడించారు. వర్షం సూచనల నేపథ్యంలో శ్రీలంక డ్రాకు చేరువైందనే నమ్మకం వచ్చేసింది. ఇక్కడే మానవ్‌ సుతార్‌ మాయాజాలం చేశాడు. ఇన్నింగ్స్‌ 76వ ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టాడు. బౌన్స్‌తో దినుశను మాయలో పడేసిన సుతార్‌.. టెయిలెండర్లను స్పిన్‌ చేయకుండా బోల్తా కొట్టించాడు. పది బంతుల వ్యవధిలో దినుశ, జయసూర్య (0), లహిరు కుమార (0), నువాంతలను సుతార్‌ సాగనంపాడు. దీంతో 206 పరుగులకే శ్రీలంక ఆలౌట్‌ కాగా.. 165 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం ఖాతాలో వేసుకుంది.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 462/10
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ : 284/10
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 193/10
శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ : మధుష్క ఫెర్నాండో (సి) ప్రసిద్‌ (బి) సిరాజ్‌ 6, లాహిరు ఉదార (సి) జురెల్‌ (బి) సుతార్‌ 16, పసిందు (ఎల్బీ) సుతార్‌ 0, కామిందు మెండిస్‌ (సి) రాహుల్ (బి) ప్రసిద్‌ 2, ధనంజయ డిసిల్వ (సి) సుతార్‌ (బి) జడేజా 59, సోనల్‌ దినుశ (సి) జురెల్‌ (బి) సుతార్‌ 84, నిరోశన్‌ డిక్వెలా (సి) పంత్‌ (బి) ప్రసిద్‌ 10, కేశర నువాంత (బి) సుతార్‌ 20, జయసూర్య (బి) సుతార్‌ 0, లహిరు కుమార (సి) పంత్‌ (బి) సుతార్‌ 0, అసిత ఫెర్నాండో నాటౌట్‌ 0, ఎక్స్ర్‌ట్రాలు : 9, మొత్తం : (77.4 ఓవర్లలో ఆలౌట్) 206.

వికెట్ల పతనం : 1-13, 2-14, 3-21, 4-47, 5-142, 6-156, 7-199, 8-199, 9-199, 10-206.
బౌలింగ్‌ : మహ్మద్‌ సిరాజ్‌ 9-2-15-1, మానవ్‌ సుతార్‌ 23.4-2-55-6, ప్రసిద్‌ కృష్ణ 10-3-16-2, రవీంద్ర జడేజా 23-3-71-1, కుల్‌దీప్‌ యాదవ్‌ 11-0-38-0, దేవదత్‌ పడిక్కల్‌ 1-0-5-0.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -