Thursday, August 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు‌బ్యాంకులే రైతుల వద్దకెళ్లాలి

‌బ్యాంకులే రైతుల వద్దకెళ్లాలి

- Advertisement -

సకాలంలో రుణాలు అందించాలి
ఆదాయం పెరిగేందుకు కృషిచేయాలి
క్యూర్‌, ప్యూర్‌, రేర్‌‌కు అనుగుణంగా వ్యూహాలుండాలి : ఎస్‌ఎల్‌‌బీసీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
బ్యాంకులే రైతుల వద్దకు వెళ్లి వారి అవసరాలేంటో తెలుసుకోవాలని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకూ సకాలంలో రుణాలను అందించాలని సూచించారు. రుణంతోపాటు రైతు ఆదాయమూ పెరిగేందుకు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్యూర్, ప్యూర్, రేర్‌‌కు అనుగుణంగా బ్యాంకులు వ్యూహాలను రూపొందించాలని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌‌లోని ప్రజాభవన్‌‌లో 50వ రాష్ట్ర స్థాయి బ్యాంక‌ర్ల స‌మావేశం (ఎస్‌ఎల్‌‌బీసీ) నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో బ్యాంకింగ్, ఆర్థిక రంగం కీలక భాగస్వాములుగా మారాలని అన్నారు. ప్రభుత్వ వ్యయంతో ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యం కాదనీ, భారీ స్థాయిలో ప్రయివేట్ పెట్టుబడులు, బలమైన ఆర్థిక సంస్థలు, లోతైన ఆర్థిక మార్కెట్లు, వినూత్న నిధుల విధానాలు అవసరమని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్-2047 కేవలం విజన్ డాక్యుమెంట్ కాదనీ, తెలంగాణ ప్రజల అభివృద్ధి ఒప్పందమని వివరించారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే బ్యాంకింగ్ రంగం కూడా రూపాంతరం చెందాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా భవిష్యత్ బ్యాంకింగ్ వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరముందన్నారు.

​ఆర్థిక వ్యవస్థకు గ్రామీణ, వ్యవసాయమే పునాది
బ్యాంకులు నిర్దేశించిన లక్ష్యాలను ఎంతవరకు సాధించాయన్నదే కాకుండా, ఇచ్చిన రుణాలతో ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు సృష్టించబడ్డాయ‌నే అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష‌లు చేసుకోవాల‌ని భట్టి విక్రమార్క అన్నారు. వ్యవసాయ ఉత్పాదకత ఎంత పెరిగింది, గ్రామీణ ఆదాయం ఎంత మెరుగుపడింది, ప్రయివేట్ పెట్టుబడి ఎంత సమీకరించబడింది అన్నదే బ్యాంకింగ్ పనితీరుకు నిజమైన కొలమానమని చెప్పారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు గ్రామీణ, వ్యవసాయ రంగం పునాది అని వివరించారు. రైతులకు రుణాలు అవసరమయ్యే సమయంలోనే అందించాలని సూచించారు. అర్హత ఉన్న రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. రుణం కోసం బ్యాంకును వెతుక్కుంటూ రైతులు రావడం కాదనీ, బ్యాంకింగ్ వ్యవస్థే రైతుల వద్దకు వెళ్లాలని కోరారు. డెయిరీ, మత్స్య, ఉద్యాన, పామాయిల్, ఫుడ్ ప్రాసెసింగ్ స‌హా ఇత‌ర అనుబంధ రంగాలను అధికారిక రుణ వ్యవస్థలోకి తేవాలని అన్నారు. రైతుకు రుణం ఇవ్వడం మాత్రమే కాకుండా, ఆ రుణాన్ని అధిక, స్థిరమైన వ్యవసాయ ఆదాయంగా మార్చడమే లక్ష్యంగా ఉండాలని సూచించారు.

​రూ.52,337 కోట్ల రుణాలివ్వడం అభినందనీయం
జూన్ నాటికి బ్యాంకులు వ్యవసాయ రంగానికి రూ.52,337 కోట్లు రుణాలుగా అందించడం అభినందనీయమని భట్టి అన్నారు. అయినప్పటికీ రుణాలు సకాలంలో అందడం ముఖ్యమని సూచించారు. రైతు రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే కేవలం రికవరీ చర్యలకే పరిమితం కాకుండా, వారి ఆదాయం ఎందుకు తగ్గిందో విశ్లేషించాలన్నారు. ఉత్పాదకత, మార్కెట్ సదుపాయాలు, కోత అనంతర వసతులు, వర్కింగ్ క్యాపిటల్ వంటి అంశాలను రుణ వ్యూహంలో భాగం చేయాలని సూచించారు. తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రంగం కీలకమని అన్నారు. రుణం మంజూరు కావడం కంటే అవసరమైన సమయంలో డబ్బు చేతికి అందడం వ్యాపారులకు ముఖ్యమని చెప్పారు. దరఖాస్తు, మంజూరు, పంపిణీ ప్రక్రియకు స్పష్టమైన, కొలవదగిన కాలపరిమితి ఉండాలని ఆదేశించారు. క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ కింద ఈ త్రైమాసికంలో రూ.4,463 కోట్ల విలువైన 16,265 ప్రతిపాదనలు ఆమోదం పొందడం అభినందనీయమన్నారు. వాటికి మంజూరు చేసే రుణాలకు పూచీకత్తు నిబంధనల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు.

​అధునాతన ఫైనాన్సింగ్‌ అవసరం
తెలంగాణ రైజింగ్-2047లోని క్యూర్, ప్యూర్, రేర్ విధానాలకు అనుగుణంగా ప్రాంతాల అవసరాలను బట్టి ప్రత్యేక రుణ వ్యూహాలను రూపొందించాలని భట్టి అన్నారు. క్యూర్‌లో ఏఐ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఏరోస్పేస్, స్టార్టప్‌లు, నాలెడ్జ్ రంగాలకు అధునాతన ఫైనాన్సింగ్ అవసరమని సూచించారు. ప్యూర్ ప్రాంతాల్లో తయారీ, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, పారిశ్రామిక క్లస్టర్లు, గృహ నిర్మాణం, మౌలిక వసతులకు నిధులు అవసరమన్నారు. రేర్ ప్రాంతాల్లో వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, డెయిరీ, ఫిషరీస్, గ్రామీణ పరిశ్రమలకు సకాలంలో, సరసమైన రుణాలు అందించాలని చెప్పారు.
తెలంగాణ రైజింగ్-2047 బ్యాంకింగ్ రోడ్‌మ్యాప్‌‌ను రూపొందించాలని భట్టి చెప్పారు. వ్యవసాయ, ఉత్పాదకత ఆధారిత రుణాలు, ఎంఎస్‌ఎంఈలు–స్టార్టప్ ఫైనాన్స్, మహిళా పారిశ్రామికవేత్తలు, గ్రామీణ పరిశ్రమలు, యువత ఉపాధి ఆధారిత రుణాలు, గ్రీన్–క్లైమేట్ ఫైనాన్స్, డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, జిల్లాల మధ్య క్రెడిట్ వ్యత్యాసాల నివారణ, దీర్ఘకాలిక మౌలిక వసతుల ఫైనాన్స్, కొత్త పరిశ్రమలు–సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాలకు ఇందులో స్పష్టమైన వార్షిక లక్ష్యాలు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఈఓ దివ్య, నాబార్డ్ సీజీఎం చిన్మయ్ కుమార్, ఎస్బీఐ సీజీఎం నీలేష్ ద్వివేది, ఎస్ఎల్బీసీ కన్వీనర్ సతీష్ కుమార్, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్క‌ర్‌, డీఎఫ్ఎస్ డైరెక్ట‌ర్ మాన‌స గంగోత్రి ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

19.13 లక్షల ఖాతాల్లో జీరో బ్యాలెన్స్‌
రాష్ట్రంలో జనధన్ ఖాతాలు భారీగా ఉన్నప్పటికీ దాదాపు 19.13 లక్షల ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ ఉందని భట్టి అన్నారు. ఖాతాలు తెరవడమే కాకుండా వారిని పొదుపు, బీమా, రుణాల దిశగా ప్రోత్సహించడమే నిజమైన ఆర్థిక సుస్థిరత అని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో నిష్క్రియాత్మకంగా ఉన్న బిజినెస్ కరస్పాండెంట్లను వెంటనే క్రియాశీలకం చేయాలనీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రతి గ్రామానికి బ్యాంకింగ్ సేవలు అందేలా చూడాలని ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాలను కేవలం బ్యాంక్ లింకేజీలకే పరిమితం చేయకుండా మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌గా తీర్చిదిద్దేలా ‘ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్’ అందించాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమల్లో బ్యాంకులకు రావాల్సిన రీయింబర్స్‌మెంట్లు సమయానికి అందేలా చూసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల సమగ్ర వికాసానికి బ్యాంకింగ్ రంగం ప్రతినిధులు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -