Thursday, August 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‘అచ్చ కాంగ్రెస్‌’ను తొక్కి… ‘పచ్చ కాంగ్రె‌స్‌’కు పెద్దపీట

‘అచ్చ కాంగ్రెస్‌’ను తొక్కి… ‘పచ్చ కాంగ్రె‌స్‌’కు పెద్దపీట

- Advertisement -

మాట తప్పినందుకు మైసమ్మ గుడి వద్ద ప్రమాణం చేస్తారా ?
సలహాదారుడి తమ్ముడి కంపెనీకి రూ.200 కోట్ల ప్రభుత్వ భూమి ధారాదత్తం
టికెట్ ఇవ్వకున్నా పరకాల నుంచి బరిలో ఉంటా
రేపే రాజీనామా చేయమను..ఎవరు గెలుస్తారో చూద్దాం
సీఎం రేవంత్‌రెడ్డిపై ‘కొండా సుస్మిత’ సంచలన వ్యాఖ్యలు
నవతెలంగాణ – గీసుకొండ

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం మొదటినుంచీ పనిచేస్తున్న అసలైన అచ్చ కాంగ్రెస్‌ నాయకులను విస్మరిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ‘పచ్చ కాంగ్రెస్‌’ (టీడీపీ నేపథ్యం ఉన్నవారికి)కే పెద్దపీట వేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ‌పుట్టినరోజు సందర్భంగా వరంగల్ జిల్లా గీసుకొండ మండల మరియాపురం పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, మహిళలకు చీరలు, కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కొండా సుస్మిత మాట్లాడుతూ మాట తప్పిన చరిత్ర మీది కాదా? అని ‌సీఎంను ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు కావాలని ఢిల్లీస్థాయిలో మొదట ప్రతిపాదించింది కొండా సురేఖ, మురళీధర్‌రావులేనని సుస్మిత గుర్తుచేశారు. “పీసీసీ చీఫ్ అయ్యాక మా ఇంటికి వచ్చి.. రాష్ట్రంలో 38 సీట్లు వచ్చినా కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆ మాట ఎందుకు తప్పారు.? ఈ విషయమై మా కోటగండి మైసమ్మ గుడికి వచ్చి ప్రమాణం చేసే దమ్ముందా?” అని సీఎంకు సవాల్ విసిరారు. బీసీ బిడ్డ, ప్రజా నాయకుడైన కొండా మురళిని రాజకీయంగా ఎదగనివ్వకుండా తొక్కివేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు పరకాల ప్రజలకు రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఎవరో తెలియదని, కొండా మురళి నియోజకవర్గమంతా తిరిగి ప్రచారం చేయడం వల్లే ఆయన గెలిచారని అన్నారు. అలాంటిది ఇప్పుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని సీఎం మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి టికెట్ విషయాన్ని అధిష్టానం చూస్తుందని చెప్పిన సీఎం.. పరకాలలో రేవూరికే టికెట్ అని ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.
​ప్రభుత్వ భూమిని ధారదత్తం చేశారు
​ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి మూడేండ్లల్లో ప్రభుత్వానికి ఏం సలహాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సలహాదారుని తమ్ముడి కంపెనీకి రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ధారదత్తం చేశారని ఆరోపించారు. బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ కూడా దక్కడం లేదని, ఉద్యమకారులు తీవ్ర ఆవేదనతో ఉన్నారని పేర్కొన్నారు. టికెట్ రాకున్నా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, రాబోయే ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి వచ్చినా, రేవూరి వచ్చినా పరకాల నుంచి తానే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తానని సుస్మిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో నిలబడతానని తేల్చిచెప్పారు. వచ్చే 20 ఏండ్లు పరకాల ప్రజలకు సేవకురాలిగా ఉంటానని, త్వరలోనే నియోజకవర్గంలో సొంత ఇల్లు నిర్మించుకుని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అల్లం స్వప్న దేవి, సర్పంచ్‌లు వీరగొని రాజ్ కుమార్, రడం భరత్, బానోత్ రాఘవేంద్ర, కేలోతు అమృత బిక్షపతి, కొమ్ముల కమల బిక్షపతి, పేర్ల శ్రావణ్, జిల్లా గ్రంధాలయ చైర్మెన్‌ మీసాల ప్రకాష్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు గోపాల నవీన్‌రాజ్, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ కార్యకర్తలు, కొండ ఆభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .

​రేపే రాజీనామా చేయమను 
ఎవరు గెలుస్తారో చూద్దాం
​ఎన్నికల ముందు రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే పరకాల ప్రజలకు తెలవదని, ఎన్నికల ముందు కొండ మురళి వచ్చి ప్రచారం చేస్తేనే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచాడని అన్నారు. నాకెలాంటి భయం లేదని, నేను ప్రజల మనిషినని, ప్రజల మధ్య తిరిగేదానినని తేల్చి చెప్పారు. రెండేండ్ల వరకు ఎందుకు… రేపే రేవూరి రాజీనామా చేయాలని, వంచనగిరిలో తమ మూడంతస్తుల బిల్డింగ్ ఇస్తానని, అక్కడే ఉండి రేవుర్ ప్రకాష్ రెడ్డికి ప్రచారం చేయాలన్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా ? లేదంటే కొండా కుటుంబం గెలుస్తుందో చూద్దామని సవాల్ విసిరారు. హైదరాబాదులో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం ఉన్న పోస్టర్లు వేయించుకున్నారని, అక్కడ హైదరాబాద్ ఇన్‌‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోటో ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. మీరు పీసీసీ అధ్యక్షులు కావడానికి పార్టీ ముఖ్య నాయకులు దయాసాగర్ రావును, షబ్బీర్ ఆలీని కారులో ఎక్కించుకొని తిరిగావని, నేడు వారికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. పదేండ్లు ముఖ్య మంత్రిగా ఉంటానని రేవంత్‌‌రెడ్డి చెప్పుకుం టున్నాడని, కానీ.! మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి లాంటి వారు కూడా ఇలా చెప్పుకోలేదని అన్నారు. టీడీపీ సభ్యులు అంటే రేవంత్‌ రెడ్డికి ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. ఎందుకు బీసీ బిడ్డ కొండ మురళిని రాజకీయపరంగా తొక్కదలు చుకున్నారో అర్థం కావడం లేదన్నారు. రేవురి ప్రకాశ్‌‌రెడ్డికే మళ్లీ టికెట్‌ అని ఎలా ప్రకటిస్తారని, తెలంగాణలో 119 నియోజక వర్గాల అభ్యర్థులను అధిష్టానం నిర్ణయిస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలా వద్దా ? అనేది ఆయనే ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -